దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న రాహుల్ వాఖ్యలు

దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న రాహుల్ వాఖ్యలు
x
Highlights

రాహుల్ గాంధీ చేసిన రేప్‌ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీ నాయకులు రాహల్‌ని టార్గెట్‌ చేశారు.

రాహుల్ గాంధీ చేసిన రేప్‌ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీ నాయకులు రాహల్‌ని టార్గెట్‌ చేశారు. మహిళలకు రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రాహుల్‌ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని.. క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు.

రాహుల్ వ్యాఖ్యలు లోక్‌సభ, రాజ్యసభలోనూ దుమారం రేపాయి. బీజేపీ ఎంపీలు రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోడీ మేకిన్‌ ఇండియాను ప్రోత్సహిస్తోంటే, ఉద్యోగావకాశాలు మెరుగుపడుతున్నాయని, అలాంటి మేక్ ఇన్ ఇండియాను నినాదాన్ని రేప్ ఇన్ ఇండియా అంటూ వ్యాఖ్యానించడం సరికాదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. అత్యాచారాలపై అలాంటి వ్యాఖ్యలు చేసినవారికి లోక్‌సభలో ఉండే నైతిక అర్హత లేదని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

అత్యాచార ఘటనలను ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలపై.. లోక్‌సభలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ చరిత్రలో మొదటిసారి ఓ నాయకుడు భారతీయ మహిళలు అత్యాచారానికి గురికావాల్సిందే అంటున్నాడని మండిపడ్డారు. ఇదేనా దేశానికి రాహుల్ ఇచ్చే సందేశం అంటూ ప్రశ్నించారు.

బీజేపీ నేతల డిమాండ్‌పై రాహుల్ గాంధీ స్పందించారు. తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పౌరసత్వ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనలను పక్క దారి పట్టించేందుకే బీజేపీ నేతలు ఈ నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. ఉన్నావ్ ఘటన బీజేపీ పాలిత రాష్ట్రంలో జరిగిందేనని.. వారి ఎమ్మెల్యేలే నిందితులని రాహుల్ అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories