Puja Khedkar Dismissed: పూజా ఖేద్కర్‌ డిస్మిస్.. దొంగ సర్టిఫికేట్ల ఐఏఎస్ ఆఫీసర్ కథ కంచికి...

Puja Khedkar Dismissed: పూజా ఖేద్కర్‌ డిస్మిస్.. దొంగ సర్టిఫికేట్ల ఐఏఎస్ ఆఫీసర్ కథ కంచికి...
x
Highlights

పూజా ఖేద్కర్‌ని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ నుంచి తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐఏఎస్‌కు ఆమె సెలెక్షన్‌ను యూపీఎస్సీ రద్దు...

పూజా ఖేద్కర్‌ని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ నుంచి తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐఏఎస్‌కు ఆమె సెలెక్షన్‌ను యూపీఎస్సీ రద్దు చేసిన నెల రోజులకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పూజా ఖేద్కర్ ఓబీసీ కోటా, దివ్యాంగుల కోటా కింద అక్రమ పద్ధతుల్లో సెలెక్ట్ అయినట్లు నిరూపణ కావడంతో కేంద్ర ప్రభుత్వం, యూపీఎస్సీ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అంతేకాదు, పూజా ఖేద్కర్ జీవితంలో మరోసారి యూపీఎస్సీ పరీక్షకు హాజరయ్యే వీలు లేకుండా శాశ్వతంగా ఆమెపై నిషేధం విధించినట్లు కూడా యూపీఎస్సీ ప్రకటించింది.

పూజా ఖేద్కర్ ఉదంతం వెలుగుచూసిన తరువాత యూపీఎస్సీపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో 2009 నుండి 2023 మధ్య కాలంలో ఐఏఎస్‌కి ఎంపికైన 15000 మందికిపైగా అధికారుల డేటాను యూపీఎస్సీ పరిశీలించింది. అభ్యర్థుల ఎంపిక సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రూల్స్‌కి అనుగుణంగా జరిగిందా లేదా ఎంపిక ప్రక్రియలో ఏమైనా లోపాలు ఉన్నాయా అని గుర్తించే ప్రయత్నం చేసింది. అయితే, ఒక్క పూజా ఖేద్కర్ ఘటన మినహాయించి అలా అక్రమ పద్ధతుల్లో ఐఏఎస్‌కి ఎంపికైన వారు ఇంకెవ్వరూ లేరని తమ పరిశీలనలో తేలినట్లు యూపీఎస్సీ తెలిపింది.

తన గొయ్యి తనే తవ్వుకున్న పూజా ఖేద్కర్..

నకిలీ సర్టిఫికేట్లతో ఐఏఎస్‌గా ఎంపికైన పూజా ఖేద్కర్.. ఆ సీటులోకి వచ్చీ రావడంతోనే తన జాతకాన్ని తనే బయటపెట్టుకోవడం మొదలుపెట్టారు. ఐఏఎస్ ఆఫీసర్లకు ఉన్నన్ని సౌకర్యాలు రెండేళ్లుపాటు ప్రొబేషన్ ఉండే ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్లకు ఉండవనే విషయం తెలియని పూజా ఖేద్కర్.. తనకు ప్రత్యేకంగా కారు, పని వాళ్లు, ఆఫీస్ కావాలని పట్టుబట్టారు. దీంతో పూజ అడుగుతున్న గొంతెమ్మ కోరికలపై పూణె జిల్లా కలెక్టర్ సుహాస్ దివాసె మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుజాత సౌనిక్‌కి ఫిర్యాదు చేస్తూ ఓ లేఖ రాశారు. దీంతో పూజా వ్యవహారం తొలిసారి వార్తల్లోకెక్కింది. ఆ తరువాత పూజను వషీంకి బదిలీ చేశారు.

ఆ తరువాత జరిగిన విచారణలో పూజా ఖేద్కర్ అసలు రంగు బయటపడింది. పూజ తండ్రి మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా పనిచేసి రిటై అయ్యారు. ఆయనకు దాదాపు 40 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయి. అయినప్పటికీ పూజాఖేద్కర్ ఓబిసి నాన్-క్రిమిలేయర్ కోటా కింద సర్టిఫికెట్ సంపాదించి యూపీఎస్సీకి పలుమార్లు హాజరయ్యేందుకు మినహాయింపు పొందారు. మరోవైపు దివ్యాంగుల కోటాను కూడా అక్రమ పద్దతిలోనే సంపాదించారు. దివ్యాంగుల కోటా కింద తన అభ్యర్థిత్వాన్ని నిరూపించుకునేందుకు ప్రభుత్వాస్పత్రిలో హెల్త్ చెకప్‌కి హాజరు కావాల్సి ఉండగా.. పూజ ఆ హెల్త్ చెకప్‌కి కూడా డుమ్మా కొట్టారు. పూజా ఖేద్కర్ వివాదం వెలుగులోకొచ్చిన అనంతరం ఆమెపై విచారణ చేపట్టిన యూపీఎస్సీ, పూజను ఐఏఎస్‌గా అనర్హురాలిగా ప్రకటించారు. యూపీఎస్సీ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై కేసు నమోదు అరెస్ట్ చేశారు.

పూజ తల్లిదండ్రులు కూడా తక్కువేం కాదు..

పూజా ఖేద్కర్ తల్లి తమ గ్రామానికి సర్పంచ్‌గా పనిచేస్తున్నారు. గ్రామ సర్పంచ్ హోదాలో ఆమె అక్కడి ప్రజలను బెదిరిస్తూ తుపాకీ చూపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక పూజాఖేద్కర్ తండ్రి దిలీప్ ఖేద్కర్ కూడా తక్కువేం తినలేదు. ప్రభుత్వ అధికారిగా ఉండి భారీ మొత్తంలో అక్రమాస్తులు కూడబెట్టారని దిలీప్ ఖేద్కర్‌పై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories