PM Modi: నేడు కశ్మీర్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ

Prime Minister Modi will visit Kashmir today
x

PM Modi: నేడు కశ్మీర్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ

Highlights

PM Modi: 370ఆర్టికల్‌ రద్దు తర్వాత మొదటిసారి కశ్మీర్‌కు ప్రధాని

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ కశ్మీర్‌‌లో పర్యటించనున్నారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత మొదటిసారి మోడీ కశ్మీర్‌లో పర్యటించనున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలు జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలపై ప్రకటన చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని కశ్మీర్‌ పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలు మోడీ చేపట్టనున్నారు. ఈ సందర్భంగా శ్రీనగర్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. శ్రీనగర్‌లోని బక్షి స్టేడియంలో జరగనున్న వికసిత్‌ భారత్.. వికసిత్‌ జమ్మూకశ్మీర్‌ కార్యక్రమానికి మోడీ హాజరు కానున్నారు. ఇక, కేంద్ర పాలిత ప్రాంతంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కోసం దాదాపు 5వేల కోట్ల విలువైన కార్యక్రమాలను ప్రధాని ప్రారంభిస్తారు.

అలాగే.. శ్రీనగర్‌లోని హజ్రత్‌బల్ మందిరంలో స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకాల కింద 1,400 కోట్ల కంటే ఎక్కువ విలువైన పర్యటక రంగానికి సంబంధించిన ప్రాజెక్టులను మోడీ ప్రారంభిస్తారు. ఇదే సమయంలో జమ్మూకశ్మీర్‌లో కొత్తగా రిక్రూట్ అయిన దాదాపు 1,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాని అపాయింట్‌మెంట్ లెటర్‌లను ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మహిళలు, రైతులు, పారిశ్రామికవేత్తలతో సహా వివిధ కేంద్ర పథకాల లబ్ధిదారులతో ఆయన మాట్లాడనున్నారు. అనంతరం 2,000 రైతు సేవా కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు.

ప్రధాని మోడీ రాక నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేల సంఖ్యలో పోలీసులు, ఆర్మీ బందోబస్తులో ఉన్నారు. అటు, మోడీ వస్తున్న క్రమంలో కశ్మీర్‌లో బీజేపీ మద్దతుదారులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories