2020లో భారీ సవాళ్ళు

2020లో భారీ సవాళ్ళు
x
Highlights

మరికొద్ది గంటల్లో 2020 రాబోతుంది. 2019 కాలగర్భంలోకి వెళ్ళనుంది. ఇప్పుడు అందరి దృష్టి 2020లో నాయకులకు ఎదురయ్యే సవాళ్ళపైనే ఉంది. మోడీ, సోనియాగాంధీ,...

మరికొద్ది గంటల్లో 2020 రాబోతుంది. 2019 కాలగర్భంలోకి వెళ్ళనుంది. ఇప్పుడు అందరి దృష్టి 2020లో నాయకులకు ఎదురయ్యే సవాళ్ళపైనే ఉంది. మోడీ, సోనియాగాంధీ, కేజ్రీవాల్, మమతాబెనర్జీ, శరద్ పవార్, యోగి ఆదిత్యానాథ్ లకు ఎలాంటి సవాళ్ళు ఎదురు కానున్నాయో చూద్దాం.

2019లో బీజేపీ దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా కచ్ నుంచి కోహిమా దాకా ప్రధాని మోడీ నిర్ణయాల ప్రభావం పడింది. లోక్ సభలో 303 స్థానాలు గెలుచుకోవడం రాజ్యసభలో మిత్రపక్షాలతో కలసి దాదాపుగా మెజారిటీని సాధించడం చిన్న విషయాలేమీ కాదు. 2019 లో మొత్తం మీద దేశ రాజకీయరంగంలో మోడీ షో జోరుగానే సాగింది. కాకపోతే ఏడాది చివర్లో మాత్రం కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. 2020 ప్రధాని మోడీకి రాజకీయ, ఆర్థిక సవాళ్ళతో స్వాగతం పలుకనుంది.

ఓ ఏడాది కాలంగా మోడీ షో తిరుగులేని విధంగా సాగింది. కాకపోతే చివరి రెండు, మూడు నెలల్లో మాత్రం కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. వాటి ఫలితం 2020లో ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. మోడీకి తగిలిన ఎదురుదెబ్బలు చిన్నవేమీ కాదు. మోడీ ఒక్కసారిగా డిఫెన్స్ లో పడిపోయారు. అఫెన్స్ రాజకీయం ఒక్కసారిగా డిఫెన్స్ లోకి మారిపోయింది. 2020 ప్రధాని మోడీకి రాజకీయంగా భారీ సవాళ్ళనే విసరుతోంది. రాజకీయంగా లబ్ధి చేకూరుస్తాయనుకున్న కొన్ని అంశాలు బ్యాక్ ఫైర్ అయ్యాయి. పౌరసత్వ సవరణ చట్టం లాంటి అంశాలపై జరుగుతున్న ఆందోళనలు విపక్షాలను ఏకం చేసే దిశగా నడుస్తున్నాయి. అదే సమయంలో బీజేపీ తన మిత్రపక్షాలు అనుకూలంగా ఉంటాయనుకున్న పార్టీలు కొన్నిటిని చేజార్చుకునే పరిస్థితి వస్తోంది. దానికి తోడుగా జార్ఖండ్ ఓటమి, హర్యానాలో పరాజయం మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో పరాభవం అంతకంటే ముందు కొన్ని రాష్ట్రాల్లో ఓటమి లాంటివన్నీ రాజకీయంగా బీజేపీ ఎదుగుదలకు బ్రేక్ పడిందా అనే అనుమానాలు కలిగిస్తున్నాయి. ఏడాది కాలంలో బీజేపీ ఐదు రాష్ట్రాలను చేజార్చుకుంది. లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పార్టీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విఫలం కావడం కొత్త సందేహాలను రేకెత్తిస్తోంది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరుగునున్నాయి. ఈ ఎన్నికలు బీజేపీకి ఎంతో కీలకం. మరీ ముఖ్యంగా ప్రధాని మోడీకి. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ నుంచి డైరెక్ట్ చాలెంజ్ ఎదురవుతోంది. జాతీయ స్థాయిలో బలమైన విపక్షం లేకపోవడం లోక్ సభ ఎన్నికల్లో మోడీకి కలసివచ్చింది. రాష్ట్రాల్లో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. గత ఐదేళ్ళలో బీజేపీ ఎన్నో రాష్ట్రాల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 2015లో ఢిల్లీ, బీహార్ లలో ఓటమి ఎదురైంది. 2017లో పంజాబ్ లోనూ ఓడిపోయింది. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లలో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో 2020లో ఢిల్లీ, బీహార్ లలో జరిగే ఎన్నికలు ప్రధాని మోడీకి సవాల్ గా మారాయి. ఈ ఎన్నికలు ఆయా రాష్ట్రాల్లో విపక్షాలు సంఘటితం అయ్యేందుకు తద్వారా జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతారాగానికి వీలు కల్పించే అవకాశం ఉంది. జార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానాలలో ఇప్పటికే విపక్షాలు మోడీ దూకుడుకు కళ్లెం వేశాయి.

ఇక బీజేపీ మిత్రపక్షాల విషయానికి వస్తే శివసేనతో బీజేపీ అనుబంధం తెగిపోయింది. మరోవైపు బీహార్ లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజకీయ వ్యూహాలకు పెట్టింది పేరు. ఆయన బహిరంగంగానే ఎన్నార్సీని వ్యతిరేకించారు. శివసేన తరహా షాక్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అసెంబ్లీ ఎన్నికల సమయానికి మోడీకి హ్యాండిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 2019 లోక్ సభ ఎన్నికల్లో నితీష్ నేతృత్వంలోని జేడీయూ, బీజేపీ కలసి అక్కడ ఘన విజయం సాధించాయి. కాకపోతే జార్ఖండ్ తరహాలో అసెంబ్లీ ఎన్నికల్లో అందుకు భిన్నమైన ఫలితాలు వచ్చినా రావచ్చు. బీహార్ లో కాంగ్రెస్ -ఆర్జేడీ కూటమి అధికారపక్షానికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలన్న ప్రధాని మోడీ ఆకాంక్షకు 2020లో గట్టి సవాలు ఎదురు కావచ్చు. లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడు, కేరళలో మోడీ మ్యాజిక్ వర్కవుట్ కాలేదు. 2019లో తమిళ ఓటర్లను దువ్వేందుకు ప్రధాని మోడీ గట్టిగా ప్రయత్నించారు. మామళ్ళపురంలో చైనా అధ్యక్షుడిని కలిసినా అది తమిళనాడును ప్రభావితం చేయలేకపోయింది. పొంగల్ చివరి రోజును తమిళ ప్రఖ్యాత కవి జయంతిగా నిర్వహిస్తామని 2019 చివరి మన్ కి బాత్ లో చెప్పినా అది తమిళ ప్రజానీకాన్ని ఆకట్టుకోలేకపోయింది. ఏఐడీఎంకే తో అనుబంధం ఉన్నా లాభం లేకపోవచ్చు. ఏఐడీఎంకే పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్న భావన ఉంది. కేరళలో కూడా బీజేపీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ రాజకీయంగా మెరుపు దాడులు చేయడంలో మోడీ ప్రఖ్యాతి చెందారు. అలాంటివేవైనా జరిగితే రాజకీయంగా మోడీ పలుకుబడి పెరగడం ఖాయం.

రాజకీయాలు అటుంచితే ఆర్థికపరంగా, సామాజికంగా కూడా మోడీకి 2020లో ఎన్నో సవాళ్ళు ఎదురు కానున్నాయి. బీజేపీ హయాంలో ఎన్నడూ ఎదురుకానంత ఆర్థికమాంద్యం చోటు చేసుకుంటోంది. దాన్ని అధిగమించి ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం మోడీకి అతిపెద్ద సవాలుగా మారింది. ఇక దేశంలో పెరిగిపోతున్న సామాజిక ఉద్రికత్తలను మోడీ ఎలా పరిష్కరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక ఆర్థికపరంగా ప్రధాని మోడీకి ఎదురయ్యే అతిపెద్ద సవాల్ ఆర్థిక మాంద్యం. ఆర్థిక మాంద్యం ఏర్పడిందన్న వాదనను మొదట్లో మోడీ కొట్టిపారేశారు. ఆ తరువాత మాత్రం ఆర్థిక మాంద్యం ఏర్పడిందని అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అనేక రంగాలు ఉద్దీపన ప్యాకేజీల కోసం డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్ కీలకంగా మారనుంది. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను దారి లోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకతప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కేంద్రప్రభుత్వం కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకున్నా అవేవీ ఆశించిన ఫలితాలను అందించలేకపోయాయి. దాంతో బడ్జెట్ లో మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడిక అందరి చూపూ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ పైనే ఉంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మోడీ హామీ ఇచ్చారు. అదే విధంగా దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చడాన్ని మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రెండు అంశాల్లో తీసుకున్న చర్యలు మాత్రం ఇప్పటికీ ఆశించిన ఫలితాలు అందివ్వలేదు.

2019లో ప్రధాని మోడీ పార్టీ భావజాలాన్ని ఆచరణలో పెట్టారు. ఆర్టికల్ 370 ఎత్తివేయడం, కశ్మీర్ ను రెండు ముక్కలు చేయడం లాంటివి చేశారు. అదే సమయంలో ఈ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో పౌరసత్వ సవరణ చట్టం నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్, నేషనల్ పాపులేషన్ రిజిష్టర్ లాంటి అంశాల్లో మాత్రం ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ అంశాలకు ఇంత భారీస్థాయిలో వ్యతిరేకత వస్తుందని మోడీ ఊహించలేకపోయారు. కశ్మీర్ లో నెలల తరబడి ఆంక్షలు యూనివర్సిటీల్లో విద్యార్థుల ఆందోళనలు లాంటివన్నీ సామాజిక ఉద్రిక్తతలకు దారి తీశాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ అంశం పై ప్రస్తుతానికి తగ్గాల్సిన అవసరం ఏర్పడింది. మరో వైపున అంతర్జాతీయంగా ఇలాంటి అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. పాక్ ఉగ్రభూతం ఎప్పటిలా 2020లోనూ మోడీని వెంటాడే అవకాశం ఉంది.

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విషయానికి వస్తే ఆ పార్టీకి ఆమె తాత్కాలిక అధ్యక్షురాలిగానే కొనసాగుతున్నారు. ఆ పార్టీకి ఫుల్ టైమ్ ప్రెసిడెంట్ లేరు. బాధ్యతలు లేని నిర్ణయాధికారిగా రాహుల్ కొనసాగుతున్నారు. పార్టీ లో కీలక బాధ్యతలు చూడాల్సిన ప్రియాంక వాద్రా ఒకటి రెండు రాష్ట్రాలకే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో బాధ్యత అంతా సోనియాగాంధీ పైనే పడింది. పరిస్థితి ఆశాజనకంగా ఉన్నా దాన్ని సొమ్మ చేసుకునే విషయంలో మాత్రం సోనియాగాంధీకి అనేక సవాళ్లు ఎదురు కానున్నాయి.

పౌరసత్వ సవరణ చట్టం సోనియాగాంధీకి ఊహించని అస్త్రంగా మారింది. ఆచట్టం పట్ల ఈ స్థాయిలో వ్యతిరేకత వస్తుందని కాంగ్రెస్ కూడా ఊహించలేదంటే అతిశయోక్తి కాదు. కాకపోతే ఈ అవకాశాన్ని సోనియాగాంధీ ఎలా సొమ్ము చేసుకోగలదనే అంశంపైనే కాంగ్రెస్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అదే సమయంలో ఈ విషయంలో అతిగా వ్యవహరిస్తే హిందూ సమాజం నుంచి వ్యతిరేకతను కూడా కాంగ్రెస్ మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఓసారి మైనారిటీ అనుకూలత మరోసారి హిందూ అనుకూలతగా రంగులు మారుస్తూ వచ్చిన కాంగ్రెస్ 2020లో ఎలాంటి ధోరణి అనుసరించనుంది అనేది ఇప్పుడు కీలకంగా మారింది. సీఏఏ వ్యతిరేకత తో వచ్చే ఓట్ల కన్నా పోగొట్టుకునే ఓట్లే ఎక్కువగా ఉంటాయని కొందరు కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.

బీజేపీని అడ్డుకోవాలన్న ఏకైక లక్ష్యమే రాహుల్ వ్యూహంగా ఉండింది. అందుకే విపక్ష కూటమి లో అధికారం పంచుకోవడంలో రెండో స్థానమిచ్చినా అందుకు సై అన్నారు రాహుల్. ఆ వ్యూహం కాస్తంత ఫలించింది. నిజానికి ఈ వ్యూహం సోనియాగాంధీకి అంతగా నచ్చకపోయినా చేయగలిగింది కూడా ఏమీ లేకపోయింది. 2020లో ఢిల్లీ, బీహార్ లలో, 2021 లో అసోం, బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో ఎన్నికలు జరుగనున్నాయి. అక్కడ కూడా కాంగ్రెస్ ఇలాంటి వ్యూహమే అనుసరిస్తుందేమో చూడాలి. తనకు అధికారం రాకపోయినా సరే బీజేపీకి అధికారం దక్కకూడదన్నది ప్రస్తుతం కాంగ్రెస్ వ్యూహంగా ఉంది. ఆ లెక్కన చూస్తే సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి పటిష్ఠంగా ఉన్నట్లే లెక్క. తమిళనాడు డీఎంకే బలంగా ఉంది. బీహార్ లో ఆర్జేడీతో పొత్తు ఖాయం కావచ్చు. అసోంలో పౌరసత్వ సవరణ చట్టం సెగలు రగిలిస్తోంది. అక్కడ ముస్లిం ఓట్లపై కన్నేసిన కాంగ్రెస్ అక్కడ ఏఐయూడీఎఫ్ తో చేతులు కలపాలన్న ఆలోచనలో ఉంది. అసోం జనాభాలో 35 శాతం మంది ముస్లింలు కావడం కాంగ్రెస్ కు కలసి వచ్చే అవకాశం కానుంది. 2021లో అక్కడ బీజేపీకి కాంగ్రెస్ గట్టిపోటీ ఇచ్చే వీలుంది.

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఏడు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. 2017తో పోలిస్తే మరో మూడు రాష్ట్రాలు అదనంగా దాని ఖాతాలో చేరాయి. మరో వైపున ఆ పార్టీని నాయకత్వ సంక్షోభం వేధిస్తోంది. పార్టీ అధినేతగా లోక్ సభ ఎన్నికల్లో విజయం అందించలేకపోయిన రాహుల్ గాంధీ ఎలాంటి బాధ్యతలు లేని యువరాజు హోదాలో డిఫ్యాక్టో డెసిషన్ మేకర్ గా ఉండేందుకే ఇష్టపడుతున్నారు. పార్టీలో ప్రియాంక వాద్రా ప్రాబల్యం పెరుగుతున్నా పార్టీ పగ్గాలు ఆమె చేపట్టే అవకాశాలపై సందేహాలు వస్తున్నాయి. ప్రస్తుతం సోనియాగాంధీ కాంగ్రెస్ కు తాత్కాలిక అధ్యక్షురాలిగానే కొనసాగుతున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ లలో కాంగ్రెస్ సాధించిన విజయం పార్టీకి ఫుల్ టైమ్ ప్రెసిడెంట్ కావాలన్న అంశంపై చర్చకు తెర తీసింది. 2020లోనూ ఆ పార్టీ తాత్కాలిక ప్రెసిడెంట్ తోనే నడుస్తుందా లేదంటే ఫుల్ టైమ్ ప్రెసిడెంట్ ను పొందుతుందో చూడాలి. రాహుల్ గాంధీ ఇప్పటికే పార్టీ నాయకత్వ బాధ్యతలను స్వీకరించేందుకు తిరస్కరించారు. ఇప్పట్లో పార్టీ బాధ్యతలు చేపట్టేందుకు ప్రియాంక వాద్రా ఇష్టపడకపోతే సోనియా గాంధీనే పార్టీ బాధ్యతలు మోయవలసి రావచ్చు.

2020 ముగ్గురు సీఎంలకు కూడా ఎన్నో సవాళ్ళు విసురుతోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఈ జాబితాలో ఉన్నారు. ఇక మహారాష్ట్రలో చక్రం తిప్పిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు సైతం 2020 పలు సవాళ్ళు విసురుతోంది.

విపక్ష నాయకుల విషయానికి వస్తే సోనియా గాంధీ తరువాత ప్రధానంగా ముచ్చటించుకోవాల్సింది తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ గురించే. జాతీయ రాజకీయాల్లోకి రావాలని జాతీయ స్థాయిలో విపక్ష ఫ్రంట్ ఏర్పరచాలని ఆమె కలలు కంటున్నా బెంగాల్ లో పరిస్థితులు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్ లో బీజేపీ 42 స్థానాలకు గాను 18 స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్రంలో కమల వికాసానికి అది సంకేతంగా నిలిచింది. ఈ పరాజయం తృణమూల్ కాంగ్రెస్ కు పెద్ద ఎదురుదెబ్బనే. మరో వైపున పౌరసత్వ సవరణ చట్టం లాంటి అంశాలు బెంగాల్ ప్రజానీకాన్ని నిట్టనిలువునా చీల్చనున్నాయి. హిందూ ఓట్లు సంఘటితం అయ్యే అవకాశం ఉంది. అలా జరిగితే అది బీజేపీకి లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. మమతా బెనర్జీ మాత్రం రాష్ట్రంలో ఎన్నార్సీని అమలు చేయబోమని చెబుతూ ముస్లిం ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నవంబర్ లో బెంగాల్ లో జరిగిన మూడు ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. మమతా బెనర్జీని ఎదుర్కొనే దీటైన నాయకులు బీజేపీలో లేకపోవడం తృణమూల్ కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్ గా మారనుంది. కాకపోతే ఓటుబ్యాంకు రాజకీయాలను కొనసాగించడం జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడంలో మమతాబెనర్జీకి సవాళ్ళు ఎదురుకానున్నాయి.

ఢిల్లీ లో కేజ్రీవాల్ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పేరుకు ఆయన సీఎం అయినా అధికారాలు మాత్రం అంతంతమాత్రమే. ఢిల్లీ పై పెత్తనమంతా కేంద్రప్రభుత్వానిదే. ప్రతీ చిన్న విషయంలోనూ కేజ్రీవాల్ ను అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీ ఎత్తుగడలు ఎలా ఉన్నప్పటికీ విద్య, వైద్యం తదితరాలను ప్రజలకు చేరువ చేయడంలో కేజ్రీవాల్ విజయం సాధించారు. మహిళలకు ఉచిత ప్రయాణాలు, ఉచిత వైఫై, పేదలకు దాదాపు ఉచితంగా మంచినీరు, అతి తక్కువ విద్యుత్ చార్జీలు వంటివి కేజ్రీవాల్ ప్రతిష్టను పెంచాయి. ఢిల్లీలో స్థలం సమస్య కారణంగా వీధి దీపాల ఏర్పాటు పెద్ద సమస్యగా ఉంది. ఇలాంటి స్థానిక అంశాలే ఢిల్లీ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. అవే కేజ్రీవాల్ కు సవాల్ గా నిలుస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ 2020లో పెను సవాళ్ళనే ఎదుర్కోనున్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. మరో వైపున అయోధ్యలో రామాలయ నిర్మాణ అంశం త్వరలోనే తెరపైకి రానుంది. ఆలయ నిర్మాణంలో తమకే ప్రాధాన్యం ఇవ్వాలని వివిధ హిందూ వర్గాలు కోరుతున్నాయి. వాటిని ఏకతాటి పైకి తీసుకురావడం ఓ పెద్ద సవాల్. లక్షలాది పేదలకు ఇళ్ల నిర్మాణం, శాంతిభద్రతల అంశాలు కూడా యోగి ఆదిత్యనాథ్ కు సవాల్ గా మారనున్నాయి. పోలీస్ ఎన్ కౌంటర్లు, అవినీతి, కులతత్వం వంటి సమస్యలు కూడా ఎదురుకానున్నాయి.

మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పి అధికారంలో వాటా పొందారు ఎన్సీపీ నేత శరద్ పవార్. కాకపోతే ఆ అధికారాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రం ఎన్నో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆయన మాటలకు ప్రస్తుతానికి శివసేన ఎదురు చెప్పనప్పటికీ అదే పరిస్థితి ఎంత కాలం ఉంటుందో తెలియదు. ఇక కాంగ్రెస్, శివసేన రెండూ కూడా విభిన్న భావజాలాలకు చెందిన పార్టీలు. ఆ రెండిటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం శరద్ పవార్ కు ఓ పెద్ద సవాల్ గా మారనుంది.

మొత్తం మీద 2020 అన్ని పార్టీల నేతలకూ కీలకంగా మారనుంది. రాజకీయాలతో పాటు ఆర్థిక, సామాజిక సమస్యలు భారీగా తెరపైకి రానున్నాయి. 2020 విసురుతున్న ఈ సవాళ్లు ఆయా నేతలశక్తిసామర్థ్యాలకు పరీక్షగా మారాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories