Underwater Metro: ఇవాళ భారత్‌లో తొలి అండర్ వాటర్ మెట్రో ప్రారంభం

PM Modi to inaugurate India first underwater metro service in Kolkata  Today
x

Underwater Metro: ఇవాళ భారత్‌లో తొలి అండర్ వాటర్ మెట్రో ప్రారంభం

Highlights

Underwater Metro: రూ.120 కోట్లతో కోల్‌కతాలో నిర్మించిన ప్రభుత్వం

Underwater Metro: భారత్‌లో తొలి అండర్‌ వాటర్‌ మెట్రో పరుగులకు సిద్ధమైంది. బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో నిర్మించిన ఈ మెట్రో టన్నెల్‌ మార్గాన్ని ప్రధాని మోడీ ఇవాళ ప్రారంభించనున్నారు. కోల్‌కతా ఈస్ట్‌- వెస్ట్‌ మెట్రో కారిడార్‌ కింద దాదాపు 120 కోట్ల రూపాయల వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది కింద నిర్మించారు. ఈ అండర్ టన్నెల్‌ మెట్రో మార్గం పొడవు 16.6 కిలోమీటర్లు కాగా.. 10.8 కిలోమీటర్ల భూగర్భంలో ఉంటుంది.

ఈ ప్రాజెక్టులో హావ్‌డా మైదాన్‌ నుంచి ఎస్‌ప్లెనెడ్‌ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఉన్న లైనులో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్‌వాటర్‌ మెట్రో టన్నెల్‌ నిర్మించారు. నదిలోని ఈ దూరాన్ని మెట్రో రైలు 45 సెకన్లలో దాటనుంది. అండర్ వాటర్ టన్నెల్‌ నదీగర్భానికి 16 మీటర్ల దిగువన, భూమి లోపలికి 32 మీటర్ల లోతులో నిర్మించారు. ప్రస్తుతం హావ్‌డా నుంచి సీల్దాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గరిష్ఠంగా 90 నిమిషాల సమయం పడుతోంది. అండర్‌వాటర్‌ మెట్రో మార్గం ఏర్పాటుతో ఈ ప్రయాణ సమయం 40 నిమిషాలకు తగ్గనుంది. ఈ కారిడార్‌ పరిధిలో ఎస్‌ప్లెనెడ్‌, మహాకారణ్‌, హావ్‌డా, హావ్‌డా మైదాన్‌ స్టేషన్లు ఉన్నాయి.

మెట్రో టన్నెల్‌ లోపలికి నీరు వెళ్లకుండా 1.4 మీటర్ల కాంక్రీటు రింగులను అమర్చారు. నీటిని పీల్చుకునేలా వాటికి హైడ్రోఫిలిక్‌ గాస్కెట్లను ఏర్పాటు చేశారు. ఈ తరహా సాంకేతికతను యూరోస్టార్‌ అనే కంపెనీ లండన్‌, ప్యారిస్‌ నగరాల మధ్య రాకపోకల కోసం అభివృద్ధి చేసింది. ప్రతిష్ఠాత్మక హుగ్లీ అండర్‌వాటర్‌ మెట్రో ప్రాజెక్టుతో భారత్‌కూ ఈ ఘనత దక్కింది. జర్మనీలో రూపొందించిన టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ సహాయంతో నిర్మాణపనులు చేపట్టగా.. కేవలం 66 రోజుల్లోనే ఆ యంత్రం సొరంగాన్ని తవ్వింది. ఈస్ట్‌ - వెస్ట్‌ మెట్రో కారిడార్‌ పనులు 2009లో మొదలుకాగా, హుగ్లీ నదిలో టన్నెల్‌ నిర్మాణపనులు 2017లో ప్రారంభించారు.

ఇక సాంకేతిక కారణాల వల్ల మెట్రో ఆగిపోయినా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ప్రత్యకే ఏర్పాట్లు చేశారు. టన్నెల్‌లో ట్రాక్ పక్కనే నడక మార్గం నిర్మించారు. ప్రతిరోజు కనీసం 7 లక్షల మంది ప్రయాణికులు అండర్‌వాటర్‌ మెట్రోలో ప్రయాణిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దేశంలో తొలిసారి 1984లో మెట్రో రైలు సేవలు కోల్‌కతాలోనే మొదలవగా... అండర్ వాటర్ టన్నెల్‌ మెట్రో రైలు కూడా ఇక్కడే మొదలవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories