
ప్రాణాంతక క్యాన్సర్‌కు చెక్..1.15 కోట్ల మంది బాలికలకు రక్షణ కవచం..ప్రధాని కీలక నిర్ణయం
HPV Vaccine : భారతదేశంలో మహిళల ఆరోగ్య పరిరక్షణ దిశగా కేంద్ర ప్రభుత్వం నేడు ఒక చారిత్రాత్మక ముందడుగు వేసింది. ప్రాణాంతకమైన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్మూలనకు గాను దేశవ్యాప్త హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని అజ్మీర్ వేదికగా శనివారం ప్రారంభించారు. ఈ భారీ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 1.15 కోట్ల మంది 14 ఏళ్లలోపు బాలికలకు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా గార్డాసిల్-4 టీకాలను పంపిణీ చేయనున్నారు. మన దేశంలో మహిళలు ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య ముప్పుల్లో గర్భాశయ క్యాన్సర్ ఒకటి. ఏటా దాదాపు 80 వేల మంది కొత్తగా ఈ వ్యాధి బారిన పడుతుండగా, సుమారు 42 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణమృదంగాన్ని అడ్డుకోవడమే ఈ జాతీయ టీకా కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
అసలు ఈ HPV వ్యాక్సిన్ ఎందుకు అంత కీలకం అంటే.. ఇది గర్భాశయ క్యాన్సర్ రాకుండా దాదాపు 98 శాతం వరకు రక్షణ కల్పిస్తుంది. ముఖ్యంగా 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న బాలికలకు శరీరంలో రోగనిరోధక శక్తి చురుకుగా ఉంటుంది. కాబట్టి ఈ వయసులో ఇచ్చే ఒకే ఒక్క డోస్ జీవితకాలం రక్షణనిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ 15 ఏళ్లు దాటిన వారు టీకా తీసుకోవాలంటే మాత్రం 2 నుంచి 3 డోసులు అవసరమవుతాయి. 26 ఏళ్ల వయసు వరకు ఈ వ్యాక్సిన్ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆపై వయసున్న మహిళలు కూడా డాక్టర్ల సలహా మేరకు దీనిని తీసుకోవచ్చు. ఈ టీకా కేవలం గర్భాశయ క్యాన్సర్ మాత్రమే కాకుండా, గొంతు, మరికొన్ని రకాల క్యాన్సర్ల నుండి కూడా కాపాడుతుంది.
క్యాన్సర్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉండటం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, చిన్న వయసులోనే గర్భం దాల్చడం, ధూమపానం వంటి అలవాట్లు గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. 30 ఏళ్లు దాటిన మహిళలు క్రమం తప్పకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే ఈ క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. ముందస్తుగా గుర్తిస్తే చిన్నపాటి సర్జరీతో నయం చేయవచ్చని, అడ్వాన్స్డ్ స్టేజ్‌కు వెళ్తే కీమోథెరపీ వంటి క్లిష్టమైన చికిత్సలు అవసరమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
గర్భాశయ క్యాన్సర్ వచ్చే ముందు శరీరం కొన్ని హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది. శృంగారం తర్వాత రక్తస్రావం కావడం, పీరియడ్స్ మధ్యలో అసహజంగా రక్తం కనిపించడం, జననాంగాల నుంచి దుర్వాసనతో కూడిన నీరు లేదా రక్తం స్రవించడం, మెనోపాజ్ తర్వాత కూడా బ్లీడింగ్ కావడం వంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇలాంటి పరిస్థితిలో వెంటనే డాక్టరును సంప్రదించాలి. తల్లిదండ్రులందరూ తమ 14 ఏళ్లలోపు కుమార్తెలకు ఈ ఉచిత HPV టీకాను ఇప్పించి, వారి బంగారు భవిష్యత్తుకు ఆరోగ్య రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కోరుతోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




