మే 30న ఏపీపై 'ఫొని' తుఫాను ప్రభావం

మే 30న ఏపీపై ఫొని తుఫాను ప్రభావం
x
Highlights

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తుపానుగా బలపడింది. దీనికి 'ఫొని' అని నామకరణం చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఇది శనివారం అర్ధరాత్రి తీవ్రతుపానుగా...

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తుపానుగా బలపడింది. దీనికి 'ఫొని' అని నామకరణం చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఇది శనివారం అర్ధరాత్రి తీవ్రతుపానుగా మారి 29న అతి తీవ్ర తుపానుగా బలపడుతుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మే రెండో తేదీ వరకూ అతి తీవ్ర తుపానుగా కొనసాగుతుందని అంచనా వేయడంతోపాటు.. ఈ నెల 30న తన దిశను మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ తుపాను గంటకు 9 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదులుతోంది. శనివారం రాత్రికి ఈ తీవ్ర తుపాను చెన్నైకి ఆగ్నేయంగా 1,200 కిలోమీటర్లు, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1,390 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 30వ తేదీ నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరం వైపు పయనిస్తుంది. అనంతరం ఈశాన్య దిశగా మలుపు తిరిగి బంగ్లాదేశ్‌ వైపు మళ్లే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడిస్తోంది. తుఫాను ప్రభావంతో విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండో నెంబరు ప్రమాద హెచ్చరికలను జారీ చేసినట్టుగా విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.

కాగా ఆదివారం నుంచి మంగళవారం వరకు తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రల్లో గంటకు 50–70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో మే 2వ తేదీ వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు శనివారం విశాఖ జిల్లాలో పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. వర్షంతోపాటు ఈదురు గాలుల ధాటికి విద్యుత్‌ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకూలాయి. మామిడి పంట నేల రాలడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. విద్యుత్‌ తీగలు తెగిపడడంతో పలు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంత ప్రజలను ప్రభుత్వ అధికారులు అప్రమత్తం చేశారు. సముద్రంలో అలల ఉధృతి తీవ్రంగా ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో ఎప్పుడేం జరుగుతుందోనని తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories