జీవితాలను నిలబెట్టే అవయవ దానం!

జీవితాలను నిలబెట్టే అవయవ దానం!
x
Highlights

అవయవ దానం అనేది కొత్త జీవితాలను ప్రసాదించే గొప్ప వైద్య ప్రక్రియ. శరీరంలో ఒక అవయవం దెబ్బతిని, అవయవ మార్పిడి కోసం ఎదురు చూసేవారికి ఇది కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది.

అవయవ దానం అనేది కొత్త జీవితాలను ప్రసాదించే గొప్ప వైద్య ప్రక్రియ. శరీరంలో ఒక అవయవం దెబ్బతిని, అవయవ మార్పిడి కోసం ఎదురు చూసేవారికి ఇది కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది. దాత మరణించిన తర్వాత అతని శరీరం నుంచి గుండె, కాలేయం, మూత్రపిండాలు, ప్రేగులు, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్.. వంటి అవయవాలను భద్రపరుస్తారు. వాటిని ఒక అవయవం యాత్రమే అవసరం ఉన్న ఇతర వ్యక్తులకు మార్పిడి చేస్తారు. అవయవ దానం అనేది మరణానికి మించి జీవించడమే. బ్రెయిన్ డెడ్ అయిన లేదా మరణించిన ఒక వ్యక్తి అవయవాలు 8 మంది ప్రాణాలను కాపాడతాయి. ప్రపంచంలోనే జనాభాలో రెండవ స్థానంలో ఉన్న మన దేశంలో అవయవ దానం చేసేవారు చాలా తక్కువగా ఉన్నారు. అవయవ దాతలు ముందుకు రాకపోవడం వల్ల దేశ వ్యాప్తంగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది అవయవ వైఫల్యంతో చివరి దశలో బాధపడుతున్నారని ఒక అంచనా. ప్రతి రోజు కనీసం 15 మంది రోగులు ఒక అవయవం కోసం ఎదురు చూస్తూ మరణిస్తున్నారు. ప్రతి 10 నిమిషాలకు ఒక కొత్త పేరు అవయవం కోసం వెయిటింగ్ లిస్ట్‌లో చేరుతోంది. ఇటీవల కాలంలో సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు ఈ ఉద్యమానికి మద్దతు పలకడంతో అవయవ దాతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయినా, ఏటా నాలుగు వేల లోపే అవయవ మార్పిడులు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో గూడూరు సీతామహాలక్ష్మి అవయవ దాన ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

అవయవాలు దానం చేయడం అంటే, మన అవయవాలకు అత్యంత గౌరవం ఇచ్చినట్లుగా భావించాలి. 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా తమ అవయవాలను దానం చేయడానికి అంగీకారం తెలుపవచ్చు. అవయవ దానం చేయాలనుకునే వారు నేషనల్‌ ఆర్గాన్‌ అండ్‌ టిష్యూ, ట్రాన్స్‌ ప్లాంట్‌ అసోసియేషన్‌లో లేదా ప్రాంతీయ స్థాయిలో జీవనదాన్‌ కార్యక్రమంలో తమ పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. తర్వాత, ప్రత్యేక నంబరుతో ఆ వ్యక్తికి గుర్తింపు కార్డు వస్తుంది. తను నమోదు చేయించుకున్న విషయం ఆ వ్యక్తి తమ కుటుంబ సభ్యులకు, ఆప్తమిత్రులకు తప్పనిసరిగా తెలియజేయాలి. కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ అసోసియేషన్‌ పనిచేస్తోంది. అవయవ దాతలకు ఏపీ ప్రభుత్వం సమచిత స్థానం కల్పిస్తోంది. అవయవ దాన ఉద్యమానికి మద్దతు పలుకుతోంది. అవయవదానంపై ఏపీ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. బ్రెయిన్ డెడ్ కేసుల అవయవాల సేకరణపై తాజా మార్గదర్శకాలను పాటించాలని అధికార యంత్రాంగానికి ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఆస్పత్రిలోని డీన్, మెడికల్ సూపరింటెండెంట్‌ లేదా జీవన్ దాన్ కార్యక్రమంలో నమోదైన ఆస్పత్రుల నుంచి అవయవదానానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని స్పష్టం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎక్కువ మంది అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపడానికి వీలవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుతో అవయవ దాన ఉద్యమం ఊపందుకుంటోంది. తాను కూడా అవయవ దానం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పుడు రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల మంది అవయవ దానానికి ముందుకు వచ్చారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో ఈ ఉద్యమం ముందుకు సాగుతోంది. సేకరించిన అవయవాలను, వాటి కోసం ఎదురుచూస్తున్న ఆస్పత్రికి వీలైనంత త్వరగా తరలించే సమయాలో పౌరుల సహకారంతో ట్రాఫిక్ పోలీసులు, ప్రభుత్వ సంస్థలు కలిసి ప్రత్యేక మార్గాలు గ్రీన్ కారిడార్‌లను ఏర్పాటు చేస్తాయి.

అవయవ దానాన్ని ప్రోత్సహించడంలో తమిళనాడు ప్రభుత్వం ముందుంది. బ్రెయిన్ డెత్‌(మొత్తం మెదడు పనితీరు తిరిగి పొందలేని విధంగా కోల్పోవడం)ను తప్పనిసరి చేసిన దేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఇదే. అవయవ మార్పిడిని ప్రోత్సహించేందుకు బీమా కంపెనీల నుంచి ఇబ్బందులు లేకుండా కేంద్ర ప్రభుత్వం ‘ఒన్ నేషన్ ఒన్ పాలసీ’ విధానాన్ని తీసుకువచ్చింది. దేశలో అవయవ మార్పిడి సేవలను 750 సంస్థలు మాత్రమే అందిస్తున్నాయి. ఇతర సంస్థలు కూడా ఇలాంటి సేవలు అందించేందుకు ముందుకు రావలసిన అవసరం ఉంది. బతికి ఉన్నప్పుడు సజీవ దానం 18 ఏళ్లు నిండిన ఎవరైనా చేయవచ్చు. జీవన్మృతులు (బ్రెయిన్‌డెడ్‌) విషయంలో లింగ భేదం, వయోభేదం లేదు. చనిపోయిన తర్వాత అవయవాల మార్పిడి గంటల్లో జరిగిపోవాలి. గుండె ఆగి చనిపోతే కళ్లు, గుండె, కవాటాలు వంటి వాటిని 6 నుంచి 24 గంటల్లో సేకరించవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన కేసుల్లో ఎక్కువగా బ్రెయిన్‌డెత్‌గా ప్రకటిస్తారు. వీరి నుంచి గుండె నాలుగు గంటలు, కాలేయం 8 నుంచి 10 గంటలు, మూత్ర పిండాలు 24 గంటల్లో సేకరించాల్సి ఉంటుంది.

ఫ్రాన్స్‌ అవయవదానాన్ని తప్పనిసరి చేసింది. ఇష్టం లేదని ప్రభుత్వానికి ముందు తెలియజేయకపోతే వైద్యులు అవయవాలు సేకరిస్తారు. మిగిలిన దేశాలు ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయి. భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన పెంచడానికి నమోదు వంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. పలు రకాల అపోహల వల్ల కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడం వల్ల దేశంలో అవయవ దాతల కొరత ఏర్పడింది. 1994లో మానవ అవయవాలు, కణజాలాల మార్పిడి చట్టం తెచ్చారు. 2011లో దానికి సవరణలు చేశారు. అవయవ, కణజాల మార్పిడి సంస్థ ఎన్‌ఓటీటీఓ ఈ ప్రక్రియలను పర్యవేక్షిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో జీవన్‌దాన్‌, ఇంకా మరి కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు దశాబ్ద కాలంగా అవయవదానంపై పనిచేస్తున్నాయి. కేంద్రం ప్రభుత్వం అవయవాలను త్వరితగతిన తరలించేం దుకు గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు ప్రభుత్వాలు దాతల అంత్య క్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని నిర్ణయించాయి. దీనికి జిల్లా కలెక్టర్‌ లేదా ప్రభుత్వ ప్రతినిధి హాజరవుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories