హింసాత్మకంగా ఢిల్లీ సీఏఏ ఆందోళనలు.. 13 మంది మృతి..

హింసాత్మకంగా ఢిల్లీ సీఏఏ ఆందోళనలు.. 13 మంది మృతి..
x
Highlights

దేశ రాజధాని ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నిరసనలు హింసాత్మకంగా మారాయి. మౌజ్‌పూర్‌, జఫ్రాబాద్‌, భజల్ పూర్, ఛాంద్ బాగ్, కారావల్ నగర్, బాబర్ పూర్ ,...

దేశ రాజధాని ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నిరసనలు హింసాత్మకంగా మారాయి. మౌజ్‌పూర్‌, జఫ్రాబాద్‌, భజల్ పూర్, ఛాంద్ బాగ్, కారావల్ నగర్, బాబర్ పూర్ , గోకుల్‌పురి ప్రాంతాల్లో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు.. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందగా.. మంగళవారం రాత్రికల్లా మొత్తం 13 మంది మృతి చెందారు. ఇందులో హెడ్ కానిస్టేబుల్ తీవ్ర గాయాలతో మరణించాడు.. మిగిలిన మృతుల్లో 12 మంది పౌరులు ఉన్నారు, వీరిలో ఎక్కువ మంది బుల్లెట్ గాయాలతో మరణించారు. మొదట సోమవారం నిరసనకారులు స్థానిక ఇళ్లకు, వాహనాలకు నిప్పు పెట్టడంతో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది.

ఢిల్లీలో పరిస్థితి అదుపుతప్పడంతో.. కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. ఈశాన్య ఢిల్లీప్రాంతంలో 144 సెక్షన్ విధించింది. 35 కంపెనీల పారామిలిటరీ బలగాలు, క్రైమ్ బ్రాంచ్, ఢిల్లీ పోలీసులను మోహరించారు. నిరసనల పేరుతో పెద్దయెత్తున ఆస్తులను ధ్వంసం చేస్తుండటంతో.. నేర పరిశోధన విభాగం దీనిని నిశితంగా పరిశీలిస్తోంది. హోంమంత్రి అమిత్ షా కూడా తన పర్యటనను సైతం రద్దు చేసుకొని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ సమీక్షలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, సీఎం అరవింద్ కేజ్రీవాల్, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆర్మీని దింపాలని సీఎం కేజ్రీవాల్ అమిత్ షా ను కోరినట్టు ప్రచారం జరుగుతోంది.. అయితే ఆర్మీని దింపే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్లలేకపోయారని అరవింద్ కేజ్రీవాల్.. కేంద్రానికి వివరించారు. నిరసన కారులపై లాఠీఛార్జీ చేయాలా, బాష్పవాయువులు ప్రయోగించాలో తేల్చుకోలేక పోయారని అమిత్ షా జరిపిన సమీక్షా సమావేశంలో చర్చించారు. ఈ క్రమంలోనే నిరసనలు మరింత ఉద్రిక్తంగా మారినట్లు ఆయన కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు.

మరోవైపు ఉత్తరప్రదేశ్ లోని అలీఘడ్ లో సీఏఏ వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అలీఘడ్ నగరంలో ఈరోజు అర్దరాత్రి వరకు ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు జిల్లా మేనేజరు మనోజ్ రాజ్‌పుత్ చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories