కాంగ్రెస్ పార్టీలో ఐక్యత ఎండమావేనా? పార్టీని ఒక్క తాటిపై నడపడంలో హై కమాండ్ ఫెయిల్?

No Unity in Congress Party Hicommand Failed to Create Unity in Party | Live News
x

కాంగ్రెస్ పార్టీలో ఐక్యత ఎండమావేనా? పార్టీని ఒక్క తాటిపై నడపడంలో హై కమాండ్ ఫెయిల్?

Highlights

Congress: నిత్యం అసమ్మతి సెగ.. తిరుగుబాట్లు, ఫిరాయింపులు...

Congress: సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్నాయ్.. పార్టీలు అస్త్ర శస్త్రాలతో రెడీ అవుతున్నాయ్..కానీ వందేళ్ల వయసున్న కాంగ్రెస్ పార్టీలో మాత్రం ముఠా తగాదాలు, సిగపట్టు రాజకీయాలు, వార్ రూమ్ భేటీలు కొనసాగుతున్నాయ్ . పార్టీలో ఐక్యతకోసం పీసీసీ చీఫ్ లు చేసే ప్రయత్నాలు మూడడుగులు ముందుకు.. నాల్గడుగులు వెనక్కీ జారుతున్నాయి.. కాంగ్రెస్ పార్టీలో ఐక్యత ఎండమావేనా? ఈ జారుడు బండ రాజకీయాలు ఎన్నాళ్లు?

శత వసంతాల వయసున్న కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఓటమి భారంతో నెట్టుకొస్తోంది. ఒకప్పుడు మెజారిటీ రాష్ట్రాలను ఏలిన పార్టీ కళ్ల ముందే ఆ వైభవాన్ని కోల్పోయింది. బీజేపీ దూకుడు, మోడీ ఇమేజ్ ముందు కాంగ్రెస్ పార్టీ సాగిలపడిపోయింది. దీనికి తోడు రాష్ట్రాలలో పార్టీ నేతల సిగపట్లు, వర్గ పోరు పార్టీకి అశని పాతంలా దాపురించాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పీసీసీ చీఫ్ లకు పార్టీలో ఇతర వర్గాల నుంచి వ్యతిరేకత కనిపిస్తోంది.

చీటికి మాటికి చిల్లర తగవులతో నేతలు ఢిల్లీకి పరుగులు తీయడం కూడా పార్టీ పరువును దిగజారుస్తోంది. సీనియర్ నేతల దిశానిర్దేశం కరువవడం, పార్టీని చేయిపట్టి నడిపించిన నేతలంతా కాలక్రమంలో కన్నుమూయడం.. పార్టీకి డెడికేటెడ్ గా పని చేసే వారు లేకపోవడంతో హస్తం పార్టీ అస్తవ్యస్తమైపోతోంది. సోనియా కుటుబానికి వ్యతిరేకంగా గళమెత్తిన జీ 23 సీనియర్లు కూడా హై కమాండ్ బుజ్జగింపులకు తలొగ్గారు.. గాంధీలతో తమకు ఎలాంటి ఇబ్బంది లేవని పార్టీకి వారే దిక్కు, మొక్కు అని తేల్చేశారు.. పార్టీలో పూర్తి స్థాయి తిరుగుబాట్లూ లేవు..అలాగని ఒక్కతాటిపై నడిచే వాతావరణమూ కనిపించడం లేదు..

గతంలో సోనియాకు సహాయకుడుగా ఉన్న అహ్మద్ పటేల్ మరణం పార్టీకి నిజంగా పూడ్చలేని లోటేనని సీనియర్లు అంటున్నారు. సోనియాకు సరైన సలహాలు, సూచనలు ఇచ్చేవారు లేకపోవడం, అధినేత్రికి అనారోగ్యం కారణంగా పార్టీపై పట్టు తగ్గింది.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నేతలకు, ఆ కింది స్థాయి నేతలకు సరైన సమన్వయం ఉండటం లేదు.. రాష్ట్రాల పీసీసీ చీఫ్ లకు రాష్ట్రాల ఇన్చార్జులకు మధ్య ఉన్న సమన్వయం.. పార్టీలో కింది స్థాయి నేతలకు, క్షేత్ర స్థాయి కార్యకర్తలకు మధ్య ఉండటం లేదు.

గుర్తింపు లేదని, ప్రాధాన్యత లేదని, టిక్కెట్లు ఇవ్వరనీ సీనియర్లు అలకపాన్పు ఎక్కడం.. ముఠాలుగా ఏర్పడి పీసీసీ చీఫ్ లకు తిరగబడటం అన్ని పార్టీల్లో ఉండేదే అయినా.. కాంగ్రెస్ పార్టీలోఈ అసంతృప్తి సెగలు మోతాదు మించి కనిపిస్తున్నాయి.. ఛత్తిస్ గఢ్, పంజాబ్ కాంగ్రెస్ వర్గాల్లో నెలల తరబడి కుమ్ములాటలు, అంతర్గత విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ప్రతీ నెలా సోనియా గాంధీ, రాహుల్ లతో భేటీలు, నాన్ స్టాప్ గా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.. ఒక్కో రాష్ట్రంది ఒక్కో సమస్య.. బుజ్జగింపులు,అలకలు, అసంతృప్తులు కాంగ్రెస్ లో 365 రోజులూ ఏదో ఓ రాష్ట్రంలో కొనసాగుతూనే ఉంటాయి.

కేవలం కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ లలో పీసీసీ చీఫ్ లు మాత్రమే తీవ్రమైన వ్యతిరేకత మధ్యా ఎలాగోలా నెట్టుకొస్తున్నారు.. ప్రజల్లో పాదయాత్రలు, ర్యాలీలు, నిరసనలతో ప్రజాక్షేత్రంలో హోరెత్తిస్తున్నారు..పార్టీ ప్రతిష్ట ఇనుమడించేలా కేడర్లో జోష్ నింపేలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు... ప్రజల మధ్య వీరి పలుకుబడి పెరిగినా.. పార్టీలో అసంతృప్తి గళాలు ఈ నేతలకు సవాళ్లుగా మారుతున్నాయి. ఇక మహారాష్ట్రలో నానా పటోల్ ను పీసీసీ చీఫ్ గా నియమించడంపై మొదట్లో పార్టీనేతలు సైలెంట్ గా ఉన్నా ఆ తర్వాత అసంతృప్తి గళం ఢిల్లీకి క్యూ కట్టింది. సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగుతున్న వారు పార్టీ నేతలకు విలువనివ్వడంలేదంటూ కంప్లైంట్లు చేశారు.

జార్ఖండ్ లోనూ ఇదే పరిస్థితి.. హేమంత్ సోరెన్ ప్రభుత్వంలోని 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాహాటంగా తిరుగుబాటు ప్రకటించారు. ఒక లీడర్ కు ఒకే పదవి ఉండాలంటూ కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు.పీసీసీ చీఫ్ కూడా ప్రభుత్వంలో మంత్రిపదవి తీసుకోడంపై కార్యకర్తలు రగిలిపోతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో రాష్ట్రానిది ఒక్కో కష్టం.. కొన్ని రాష్ట్రాల్లో డైనమిక్ నేతలున్నా..వారికి పార్టీలో అందరి ఆమోద ముద్ర లేదు.. అలాగే అందరి ఆమోద ముద్ర ఉన్నవారిలో నాయకత్వ లక్షణాలు లేవు. కార్యకర్తల ఆమోదం, డైనమిజం కలగలిపిన నేతలు కరువవుతున్నారు.

బీజేపి రాష్ట్రాల వారీగా,జిల్లాల వారీగా ప్రజాక్షేత్రంలో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ వార్ రూమ్ పంచాయతీలతో సతమతమవుతోంది. రాష్ట్రాల వారీగా భేటీలు, సర్ది చెప్పటాలతోనే కాంగ్రెస్ హై కమాండ్ కు కాలం గడిచిపోతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి భారంతో ఆగ్రహంతో ఉన్న సోనియా పార్టీ పగ్గాలను మళ్లీ తన చేతుల్లోకి తీసుకున్నారు.. ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్ లపై వేటేశారు.. అందరూ ఒక్క మాటపై ఒక్కతాటిపై నడవాలని, విభేదాలు పక్కనపెట్టి పార్టీ కోసం పనిచేయాలనీ సీరియస్ గానే చెప్పారు.. జీ 23 నేతలను కూడా ఇంటికి పిలిపించుకుని మరీ ఓ మాదిరి వార్నింగ్ సంకేతాలిచ్చారు..

అప్పటికప్పుడు నేతలు సరేనన్నా.. మళ్లీ ఢిల్లీ పంచాయతీలు మామూలుగానే కొనసాగుతున్నాయి.. కాంగ్రెస్ దారిన పడేదెప్పుడు?మళ్లీ పునర్వైభవాన్ని సాధించేదెప్పుడు?

Show Full Article
Print Article
Next Story
More Stories