నితీష్ కుమార్ యూటర్న్ రాజకీయం.. బీజేపీకి మళ్లీ షాక్ ఇస్తారా?

Nitish Kumar retakes U-turn Will he Dump BJP
x

నితీష్ కుమార్ యూటర్న్ రాజకీయం.. బీజేపీకి మళ్లీ షాక్ ఇస్తారా?

Highlights

ఇంతకీ నితీశ్‌కుమార్‌ ఎన్డీఏతోనే ఉంటారా? మళ్లీ ఇండియా కూటమిలోకి వెళతారా? బీహార్ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆయన ఏ కూటమిలో ఉంటారో తెలియని పరిస్థితి.

ఇంతకీ నితీశ్‌కుమార్‌ ఎన్డీఏతోనే ఉంటారా? మళ్లీ ఇండియా కూటమిలోకి వెళతారా? బీహార్ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆయన ఏ కూటమిలో ఉంటారో తెలియని పరిస్థితి. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన జేడీయూ.. కాసేపటికే యూటర్న్ తీసుకుంది. తాము తాము ఎన్డీఏలోనే ఉన్నామని స్పష్టం చేసింది. దీంతో నితీష్ మీద మరోసారి అనుమానాలు మొదలయ్యాయి. బీహార్ రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అంటున్నారు విశ్లేషకులు.

జనతాదళ్ యునైటెడ్ పార్టీ నుంచి వెలువడిన ప్రకటనతో దేశ రాజకీయాలు మరోసారి ఆసక్తిగా మారాయి. అంతలోనే అంతా ఉత్తదేనని ఆ పార్టీ యూ టర్న్ తీసుకుంది.. గత అనుభవాల దృష్ట్యా బీజేపీ శ్రేణులు జేడీయూను మరోసారి అనుమానంగా చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనంతటికీ కారణం తమ జేడీయూ మణిపూర్ విభాగం.. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు ఆ రాష్ట్రానికి చెందిన జేడీయూ అధ్యక్షుడు క్షేత్రమయుం బీరేన్ సింగ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. జేడీయూ ఏకైక ఎమ్మెల్యే అబ్దుల్ నాసిర్ ఇక నుంచి ప్రతిపక్షంలో కూర్చుంటారని తెలిపారు.

ఈ ప్రకటనతో భాజపాతో ఆ పార్టీ పొత్తుపై కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రెండు పార్టీలకు ఎక్కడ చెడిందనే చర్చ మొదలైంది. అయితే కొద్ది గంటల్లో జేడీయూ జాతీయ నాయకత్వం స్పందించింది. ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని జేడీయూ జాతీయ ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ వివరణ ఇచ్చారు. పార్టీ జాతీయ నాయకత్వాన్ని సంప్రదించకుండా మణిపూర్ జేడీయూ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు క్షేత్రమయుం బీరేన్ సింగ్ సొంతంగా ప్రకటన చేసినట్టు చెప్పారు. బీరేన్‌సింగ్‌ను క్రమశిక్షణారాహిత్యం కింద పదవి నుంచి తొలగించినట్టు వెల్లడించారు.

మణిపూర్‌ అసెంబ్లీకి 2022లో జరిగిన ఎన్నికల్లో జేడీయూ 6 స్థానాలను గెలుచుకుంది, అయితే ఎన్నికలు ముగిసిన నెలల తర్వాత ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్‌ సారథ్యంలోని BJPకి మారారు. 60 మంది సభ్యుల అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనికి నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు మద్దతుగా నిలిచారు. మణిపూర్‌లో గత రెండేళ్లుగా జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్‌ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత పెరిగింది. మణిపూర్‌లో మైతీలు, కుకీల మధ్య జాతి హింస కొనసాగుతున్న నేపథ్యంలో కాన్రాడ్ సంగ్మాకు చెందని నేషనల్ పీపుల్స్ పార్టీ అక్కడి ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. మరో మిత్రపక్షం - కుకీ పీపుల్స్ అలయన్స్ - ఎన్‌డిఎ నుండి వైదొలిగింది. తాజాగా జేడీయూ కూడా మద్దతు ఉపసంహరించుకోవడం కొంత సంచలనం సృష్టించినా, అదేమీ లేదని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం స్పష్టం చేసింది. ఒకవేళ జేడీయూ మద్దతు ఉపసంహరించుకున్నా మణిపూర్ బీజేపీ ప్రభుత్వానికి వచ్చే ముప్పు ఏమీ లేదు.

ప్రస్తుతానికి తాము బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోనే ఉన్నామని జేడీయూ జాతీయ నాయకత్వం స్పష్టమైన వివరణ ఇచ్చినా అనుమానాలు మాత్రం కొనసాగుతూ ఉన్నాయి. ఇటు బీహార్‌లోనూ, అటు కేంద్రంలోని ఎన్డీయేలోనూ జేడీయూ భాగస్వామిగా ఉంది. దీనికితోడు బీహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉన్నాయి. ఈ నేపథ్యంలో మణిపూర్‌లోని బీజేపీ సర్కార్‌కు జేడీయూ మద్దతు ఉపసంహరించుకందంటూ ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రకటించడం సంచలనమైంది. జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష‌ కుమార్ నిలకడ లేని రాజకీయాలు మరోసారి తెర మీదకు వచ్చాయి. ఆయన పార్టీకి సొంతంగా మెజారిటీ లేకున్నా కొంత కాలం బీజేపీతోనూ, మరికొంత కాలం లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీతోనూ పొత్తు పెట్టుకొని ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటముల మద్య దోబూచులాట ఆడుతున్నారు.

నితీష్ కుమార్ నాయకత్వలోని జేడీయూ 2013లో తొలిసారిగా నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత బీజేపీతో జేడీయూ పొత్తును తెంచుకొని ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది. ఈ నిర్ణయం మతతత్వానికి వ్యతిరేకంగా పోరాటం అని ప్రకటించుకున్నారాయన. ఆ తర్వాత లాలూ ప్రసాద్ ఆర్జేడీ, కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు.. 2017లో ఆర్జేడీ, కాంగ్రెస్‌తో దోస్తీకి గుడ్‌బై చెప్పి మరోసారి బీజేపీతో చేతులు కలిపారు నితీష్ కుమార్. బీజేపీ, జేడీయూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నితీశ్‌ కుమార్‌ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆగస్టు 2022లో జేడీయూ మరోసారి బీజేపీతో పొత్తును తెంచుకుంది. నితీష్ కుమార్ దీనిని బీజేపీ కుట్ర, ఒత్తిడి రాజకీయం అని అభివర్ణించారు. దీని తర్వాత జేడీయూ ఆర్జేడీ, కాంగ్రెస్ తదితర పార్టీలతో కలిసి మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొద్ది కాలానికే మళ్లీ నితీష్ కుమార్ మళ్లీ ఎన్డీఏలోకి వచ్చారు. జాతీయ స్థాయిలో కొత్తగా ఏర్పడ్డ విపక్ష ఇండియా కూటమి నాయకత్వ బాధ్యతలు దక్కక పోవడమే కారణమని అంటారు విశ్లేషకులు.

ఎన్డీఏలోకి తిరిగి వచ్చిన నితీష్ కుమార్ తాను బీజేపీతో ఎప్పటికీ స్నేహాన్ని వీడబోనని ప్రకటించారు. తన ప్రాణం పోయే వరకూ ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేయారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని 40 సీట్లుకు గానూ బీజేపీ 17, జేడీయూ 16 గెలుచుకున్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీకి సీటు తగ్గడంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి జేడీయూ మద్దతు కీలకంగా మారింది. ఈ ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ ఎన్డీఏతో ఉంటారా? లేక ఇండియా కూటమిలో చేరిపోతారా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఆయన ఏ కూటమిలో ఉన్నా ముఖ్యమంత్రి సీటు మాత్రం ఆయనదే.. బీహార్ రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అంటున్నారు విశ్లేషకులు. కానీ నితీష్ కుమార్ కూటమి మారితే జాతీయ స్థాయిలో ఆయన విశ్వసనీయత మరోసారి ప్రశ్నార్థకంగా మారడం ఖాయం.

Show Full Article
Print Article
Next Story
More Stories