జలదిగ్బంధంలో ముంబై మహానగరం..ముంబై అంతటా ఆరెంజ్ హెచ్చరిక జారీ

జలదిగ్బంధంలో ముంబై మహానగరం..ముంబై అంతటా ఆరెంజ్ హెచ్చరిక జారీ
x
Highlights

కుండపోత వర్షాలతో ముంబై మహానగరం అతలాకుతలమవుతోంది. కొద్దిరోజులుగా కురుస్తోన్న అతి భారీ వర్షాలతో దేశ ఆర్ధిక రాజధాని జలదిగ్బంధంలో చిక్కుకుంది. రోడ్లన్నీ...

కుండపోత వర్షాలతో ముంబై మహానగరం అతలాకుతలమవుతోంది. కొద్దిరోజులుగా కురుస్తోన్న అతి భారీ వర్షాలతో దేశ ఆర్ధిక రాజధాని జలదిగ్బంధంలో చిక్కుకుంది. రోడ్లన్నీ కాలువలుగా, కాలనీలు సరస్సులుగా మారిపోయాయి. రహదారులపై మోకాళ్ల లోతు వరకు నీరు చేరడంతో పలుచోట్ల వాహన రాకపోకలు స్తంభించిపోయాయి. ఇక సామాన్య ప్రజానీకం ఎటూవెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడ వరద నీరు చుట్టుముట్టడంతో బయటికి రాలేక మూడ్రోజులుగా ఇళ్లల్లోనే మగ్గిపోతున్నారు.

కుండపోత వర్షాలతో వరద నీరు పోటెత్తడంతో ముంబైలోని పాల్గార్‌, రాయగడ్‌, రత్నగిరి, సియాన్‌, పరేల్‌, దాదర్‌, బైకుల్లా ప్రాంతాలు నీట మునిగాయి. అలాగే కింగ్ సర్కిల్‌, రైల్వే స్టేషల్‌, గాంధీ మార్కెట్ ప్రాంతాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలుచోట్ల వాహనాలు వరద నీటిలో ఇరుక్కుపోయాయి.

ముంబైలో జలవిలయంతో ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించగా, టేక్ కేర్ ముంబై అంటూ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మరో మూడు నాలుగు రోజులపాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ముంబై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే, పోలీసులకు కాల్ చేయాలంటూ ఎమర్జెన్సీ టోల్ ప్రీ నెంబర్స్‌ను ఏర్పాటు చేశారు.

ముంబైలో ప్రధాన ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాలనీలకు కాలనీలు నీట మునిగాయి. పెద్దపెద్ద అపార్ట్‌మెంట్లలోకి సైతం వరద నీరు పోటెత్తింది. బిగ్‌ బి అమితాబ్ బచ్చన్ బంగ్లాలోకి కూడా వరద నీరు ప్రవేశించింది. భట్సా, క్రాంతినగర్‌, కుర్లా తదితర ప్రాంతాల్లోకి వరద నీరు పోటెత్తడంతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్‌, నేవీ సిబ్బంది ప్రజలను కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

కుండపోత వర్షాలు, వరద బీభత్సంతో ప్రజారవాణా స్తంభించింది. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా, బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అలాగే విమాన రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతోంది. మరోవైపు సియోన్ రైల్వే స్టేషన్‌లోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

ముంబైను భారీ వర్షాలు ముంచెత్తతుండటంతో భారత వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మరో మూడ్రోజులపాటు వర్ష బీభత్సం కొనసాగుతుందన్న ఐఎండీ ముంబై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రికార్డుస్థాయిలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అకాశమున్నందున ఇళ్ల నుంచి బయటికి రావొద్దంటూ భారత వాతావరణశాఖ హెచ్చరించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories