Mother Tongue Day: ఆత్మవిశ్వాసాన్ని పెంచే మాతృభాష

International Mother Language Day 2021
x

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 

Highlights

Mother Tongue Day: అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్బంగా భాషాభిమానులకు, మాతృభాషా పరిరక్షకులకు అభినందనలు

మాతృభాషలో మాట్లాడటంలో ఉండే సంతృప్తి.. ఇక ఏ భాషలో మాట్లాడినా రాదు. మాతృభాషలు మృతభాషలుగా మారిపోతున్న వేళ.. అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా మన మాతృ భాష తేట తెలుగు తీయదనాన్ని అందరికీ తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. అమ్మ ఒడిలో అందుకున్నప్పుడు ఎంత సంతోషం ఉంటుందో అమ్మ భాషలో మాట్లాడటంలో అంత ఆనందం ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికీ అనుభవమే. కానీ, పరాయి భాషా మోజులో అమ్మ భాషను మర్చిపోతున్న ఈ తరానికి తప్పనిసరి పరిస్థితిలో ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదు. కానీ.. సాధారణ వ్యవహారికంలో తెలుగులోనే మాట్లాడుదాం అనే విధానాన్ని తెలియచెప్పడం మాతృ భాషాభిమానులు చేయాల్సిన పని. అందరూ తెలుగులోనే (మాతృ భాష) లోనే మాట్లాడుదాం. మన భాషను సజీవంగా ఉంచుకుందాం. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా hmtv అందిస్తున్న ప్రత్యెక కథనం.

"చక్కని పలుకుబడులకు, నుడికారములకు తెలుగు బాషయే పుట్టినిల్లు ". మన తెలుగు బాష దేశ బాషలలో గొప్పది. దేశబాషలందు తెలుగులెస్స, అని శ్రీకృష్ణదేవరాయలు తన "ఆముక్తమాల్యద" లో ఆంధ్రమహావిష్ణువు చే చెప్పించాడు. ఈ మాట ప్రతి తెలుగు వారి గుండెలలో నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. రాయల పైమాట తెలుగు వారి యెక్క మాతృబాషాభిమానానికి మేలుకొలుపు పాట అయ్యింది. చక్కని కవితలల్లిక లో జిగిబిగిని ప్రదర్శించిన నేర్పు ఈ బాషలోనే వీలైనది. బహుబాషా కోవిదుడైన రాయలు, ఆ బాష లోతుపాతులనెరిగి, మధించి భువన విజయ వికమాదిత్య న్యాయాధిపతిగా చెప్పిన తీర్పు దేశబాషలందు తెలుగులెస్స అన్న మాట.

శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందే క్రమంలో, మనకు తెలియకుండానే మనం చేస్తున్న పొరపాటు మాతృభాషను విస్మరించడం. భాషను కాపాడుకోవడం ద్వారా సాంస్కృతి వైవిధ్యాన్ని, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో లాంటి అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నారు.

అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని 1999 నవంబరు 17న యునెస్కో ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతోంది.శతాబ్దాలుగా మన దేశం వందలాది భాషలు, మాండలికాల ఘనమైన సంపదకు చిరునామాగా నిలిచింది. ఆయా భాషలు భారతీయ సాంస్కృతిక విభాగంలో శక్తిమంతమైన పాత్రను పోషించాయి.

మాతృభాషను కాపాడుకునేందుకు ప్రభుత్వం, ప్రజలు కృషి చేయాల్సిన అవసరమున్నది. ఇంగ్లీషు చదివితేనే ఉద్యోగం దొరుకుతుందనేది కోట్లాది తెలుగు పిల్లల భ్రమ. గతంలో టెన్త్​ వరకు ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియంలో చదివిన ఎంతోమందికి ఉద్యోగాలు లభించాయన్న విషయాన్ని మరవద్దు. మాతృభాష పట్ల ప్రేమను పెంచుకోవడం అంటే, ఇతర భాషలను నేర్చుకోవద్దని కాదు. మీరు కోరినన్ని భాషలు నేర్చుకోండి. కానీ మాతృభాషను మీ రక్తంలో నింపుకోండి. ఎవరైతే మాతృభాషను సరిగా నేర్చుకుంటారో వారు ఇతర భాషలను కూడా అదే స్థాయిలో నేర్చుకుని నిష్ణాతులు కాగలరని పరిశోధనలు చెబుతున్నాయి.ఈ విషయంలో ఉపాధ్యాయులతో పాటు ముఖ్యంగా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాల్సిన అవసరం వుందని నిపుణులు సూచిస్తున్నారు.

మాతృభాషలో చదువు చెప్పడం సహజమైనది. ప్రాధమిక విద్య వరకు అయినా.. తెలుగులో పాఠాలు చెప్పాలి. మన యాస, భాషను కాపాడుకునేందుకు అందరూ కృషి చేయాలి. ప్రభుత్వ పరిపాలన కూడా తెలుగులోనే జరిగితే ప్రజాస్వామ్యానికి బలం చేకూరుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం వాళ్ల భాషలోనే చదువు చెప్తారు. మన దగ్గర సర్కారీ ఆఫీసుల్లో తెలుగులోనే కార్యకలాపాలు జరగాల్సిన అవసరముంది. తెలుగు అధికార భాషా సంఘానికి పూర్తి అధికారం ఇస్తే మాతృభాష మరింత తేజంతో వృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి.

మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగులోనే మాట్లాడతాం.. తెలుగులోనే వ్యవహారాలు నేరవేరుస్తాం అనే సంకల్పం తీసుకుందాం!

Show Full Article
Print Article
Next Story
More Stories