చంద్రబాబు పాలనపై మోదీ పొగడ్తలు

ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పొగడ్తలతో ముంచెత్తారు.

Siramdasu Nagarjuna
Published on: 11 Dec 2025 3:08 PM IST
చంద్రబాబు పాలనపై మోదీ పొగడ్తలు
X

న్యూఢిల్లీ: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పొగడ్తలతో ముంచెత్తారు. ఈరోజు ఉదయం ఢిల్లీలో ఏపీ , తెలంగాణ ఎన్డీయే ఎంపీలతో కలిసి ప్రధాని మోదీ అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో చంద్రబాబు పాలన చాలా బావుందని కితాబిచ్చారు. ఈరోజు ఉదయం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎంపీలకు ప్రధాని మోదీకి అల్పాహార విందు ఇచ్చారు. ఎంపీలతో సుమారు అరగంట పాటు మోదీ మాట్లాడారు. ఏపీలో చంద్రబాబుతో కలిసి ముందుకు సాగడం మంచి పరిణామమని, ఆయన పాలన బేషుగ్గా ఉందని కొనియాడారు. పూర్తి సమన్వయంతో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. చంద్రబాబు పరిపాలనపై కూడా మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందన్నారు. ఏపీకి ఎక్కువగా పెట్టుబడులు వెళ్తున్నాయని, ఇది శుభపరిణామమన్నారు. రాబోయే రోజుల్లో ఏపీ చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసీపీ, ఆ పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలకు బీజేపీ నేతలు కూడా ధీటుగా కౌంటర్ ఇవ్వాలని ప్రధాని చెప్పారు.

తెలంగాణలో బీజేపీ ఎంపీలు సరైన ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని ఎంపీలకు ప్రధాని మోదీ హితవుపలికారు. తెలంగాణలో ఓవైసీ సోషల్ మీడియా కంటే బీజేపీ సోషల్ మీడియా చాలా తక్కువగా ఉందని, బీజేపీ నేతలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఎందుకు ఉండటం లేదని తెలంగాణ బీజేపీ ఎంపీలపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా సరిగ్గా పోషించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ పెరగడానికి మంచి అవకాశం ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించుకోవడంలో విఫలం అవుతున్నారని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

Siramdasu Nagarjuna

Siramdasu Nagarjuna

Next Story