Mangaluru: నెలకు లక్ష రూపాయలు వచ్చే ఐటీ ఉద్యోగాన్ని వదిలి... గాడిదలు కాస్తున్నాడు...

Man Quits IT Job to Open Donkey Milk Farm in Mangaluru | Karnataka News
x

Mangaluru: నెలకు లక్ష రూపాయలు వచ్చే తన ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి... గాడిదలు కాస్తున్నాడు...

Highlights

Mangaluru: రూ.42లక్షలతో 20 గాడిదల కొనుగోలు

Mangaluru: గంగి గోవు పాలు గిరిటెడైనా చాలు కవడైననేమి కరము పాలు అన్నారు వేమన. అంటే శ్రేష్ట్రమైన ఆవు పాలు గుక్కెడైనా చాలు గాడిద పాలు కడవ నిండా ఉన్నా ఏం లాభమని దీని అర్థం. అయితే ఇప్పుడు ఈ అర్థం మారిపోతోంది. గాడిద పాలకు డిమాండ్‌ విపరీతంగా పెరుగుతోంది. అదే గరిటె పాల ధర ఏకంగా 150 రూపాయల పైనే పలుకుతోంది. ఇది గమనించిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు ఏకంగా గాడిదల పెంపకానికి శ్రీకారం చేపట్టాడు. హాయిగా ఏసీ రూముల్లో కూర్చుని చేసే జాబును వదులుకుని గాడిదల పెంపకానికి శ్రీకారం చుట్టి శ్రీనివాస్‌ గౌడ్‌ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. శ్రీనివాస్‌ గౌడ్‌ విషయం తెలిసిన తరువాత ఏరా గాడిదలు కాస్తున్నావా? అనే నోళ్లకు తాళాలు పడ్డాయి.

గాడిదలు ఇదివరకు కేవలం రవాణా సాధనాలుగా మాత్రమే ఉపయోగపడేవి. కానీ వాటి పాలలో ఉన్న ఔషధ గుణాలు, సౌందర్య ఉత్పత్తుల్లో వాడకం పెరిగింది. దీంతో గాడిద పాలకు డిమాండ్‌ బాగా పెరిగింది. గాడిద పాలు మానవ రొమ్ము పాలతో సమానమైన ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. వీటిని తాగితే శరీరానికి కేలరీలు, విటమిన్‌-డి ఎక్కువగా అందుతాయి. ఇవి లాక్టోస్‌ రూపంలో ఉంటాయి. గాయాల చికిత్సకు కూడా వీటిని వాడుతారు. ఆహారంగా కంటే ఇవి ఎక్కువ సౌందర్య సాధనంగానే భాగా పని చేస్తాయి. ఇవి శరీరానికి అద్భుతమైన మాయిశ్చరైజర్‌గా పని చేస్తాయి. సౌందర్య ఉత్పత్తులైన స్కిన్‌, ఫేస్‌ క్రీమ్‌లతో పాటు సబ్బులు, షాంపుల్లో తయారుచేస్తారు.

ప్రస్తుతం 30 మిల్లీ లీటర్ల ధర 150 రూపాయలు పలుకుతోంది. అంటే ఒక మిల్లీ లీటరు 5 రూపాయలన్నమాట. ఈ లెక్కన లీటరు గాడిద పాలు 5వేల రూపాయలు పలుకుతోంది. ఇది గమనించిన మంగళూరుకు చెందిన శ్రీనివాస్ గౌడ్‌ నెలకు లక్ష రూపాయలు వచ్చే తన ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి.. గాడిదల పెంపకం ప్రారంభించారు. 2020 వరకు సాఫ్ట్‌వేర్ సంస్థలో పని చేసిన శ్రీనివాస్‌ గౌడ్‌ 42 లక్షల రూపాయల పెట్టుబడితో 20 గాడిదలను కొనుగోలు చేసి వాటిని పెంచుతున్నారు. గాడిద పాలతో అనేక ప్రయోజనాలున్నాయని గుర్తించినట్టు శ్రీనివాస్‌గౌడ్‌ చెబుతున్నారు. సామాన్యులకు వాటి పాలను అందుబాటులో ఉంచడమే తన లక్ష్యమని తెలిపారు. గాడిద పాలు ఔషధ ఫార్ములా అని పేర్కొన్నారు. అంతేకాదు గాడిద జాతుల సంఖ్య తగ్గముఖం పట్టిందని ఈ పెంపకంతో ఆ జాతిని కాపాడినట్టు కూడా ఉంటుందని శ్రీనివాస్‌ చెబుతున్నారు.

గాడిద పాల ప్యాకెట్లను మంగళూరులోని సూపర్‌ మార్కెట్లు, షాపింగ్‌మాల్స్‌లో శ్రీనివాస్‌ అందుబాటులోకి తెచ్చారు. 30 మిల్లీ లీటర్ల పాలను 150 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇప్పటికే 17లక్షల రూపాయల విలువైన పాల ఆర్డర్లు వచ్చినట్టు శ్రీనివాస్‌ చెబుతున్నారు. శ్రీనివాస్‌ చేపట్టిన గాడిదల పెంపకం, శిక్షణ కేంద్రం దేశంలో ఇదే మొదటి కావడం విశేషం. గతంలో కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో గాడిదల పెంపకానికి ఓ వ్యవసాయ క్షేత్రాన్ని ప్రారంభించారు. శ్రీనివాస్‌ గాడిదల పెంపకం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శ్రినివాస్‌ గురించి సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఏరా గాడిదలు కాస్తున్నావా? అనే వారి నోళ్లకు ఇక నుంచి తాళాలు పడుతాయని నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories