Maharashtra: మహారాష్ట్ర 'లేడీ సింగమ్‌'ఆత్మహత్య

Maharashtras Lady Singham Found Dead
x

మహారాష్ట్ర:(ఫైల్ ఇమేజ్)

Highlights

Maharashtra: మహారాష్ట్ర ‘లేడీ సింగమ్‌’గా గుర్తింపు పొందిన అటవీ అధికారిణి లైంగిక వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నారు.

Maharashtra: మహిళలను దైవంగా కొలిచే దేశంలో వారిపై లైంగిక దాడులు, దౌర్జన్యాలు, హింస నిత్యకృత్యమయ్యాయి. పోలీసులున్నారు. చట్టాలున్నాయి. కానీ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. అర్ధరాత్రి స్త్రీలు స్వేచ్ఛగా సంచరించినప్పుడే నిజమైన స్వాతంత్య్రం అని మహాత్మాగాంధీ ఉద్ఘాటించారు. మహాత్ముడు అర్థరాత్రి అన్నాడు. కానీ పట్టపగలే తిరగలేని పరిస్థితి దాపురించింది. అన్నింటిని దాటుకుని మంచి చదువు, అనుకున్న ఉద్యోగం సాధించి స్థిరపడాలన్న ఆశలు అడియాశలు అవుతున్నాయి. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత సైతం అత్యాచార ఘటనలు లేకుండా ఒక్క రోజైనా గడవటం లేదు. గృహ హింస చట్టం, వరకట్న నిషేధ చట్టం, కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నిషేధ చట్టం.. ఇలా మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు వచ్చాయి. కానీ మహిళల భద్రతకు మాత్రం హామీ లభించట్లేదు. భారతదేశంలో ప్రతీ గంటకు ఇద్దరు మహిళలు అత్యాచారానికి గురికావడం దేశంలో నెలకొన్న పరిస్థితి ఎంత విషమంగా ఉందో చెబుతోంది.

తాజాగా మహారాష్ట్ర 'లేడీ సింగమ్‌'గా గుర్తింపు పొందిన అటవీ అధికారిణి దీపాలీ చవాన్‌(28) ఆత్మహత్య చేసుకున్నారు. భారత అటవీ సర్వీస్‌(ఐఎఫ్‌ఎస్‌) అధికారి ఒకరు తనను లైంగికంగా తీవ్ర వేధింపులకు గురిచేశాడని, ఆయన చేతిలో తాను చిత్రహింసలకు గురయ్యానంటూ ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన నాలుగు పేజీల లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది. మెల్గాట్‌ టైగర్‌ రిజర్వు(ఎంటీఆర్‌) సమీపంలోని హరిసాల్‌ గ్రామంలోని తన అధికారిక నివాసం(క్వార్టర్స్‌)లో గురువారం రాత్రి పొద్దుపోయాక ఆమె సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. ధైర్య సాహసాలతో అటవీ మాఫియా ఆటలు కట్టించిన దీపాలీ చవాన్‌ 'లేడీ సింగమ్‌'గా పేరు సంపాదించుకున్నారు. ఆమె భర్త రాజేశ్‌ మొహితే చిఖల్‌ధారలో ట్రెజరీ అధికారి. దీపాలి తల్లి తన సొంతూరైన సతారాకు వెళ్లిన సమయంలో ఆమె ఈ తీవ్ర చర్యలకు పాల్పడ్డారు.

దీపాలీ ఆత్మహత్య లేఖలో పేర్కొన్న ఐఎఫ్‌ఎస్‌ అధికారి, అటవీశాఖ డిప్యూటీ కన్జర్వేటర్‌(డీసీఎఫ్‌) వినోద్‌ శివకుమార్‌ను పోలీసులు నాగ్‌పుర్‌ రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకుని అమరావతికి తరలించి కేసు నమోదు చేశారు. శివకుమార్‌ తనను కొన్ని నెలలుగా లైంగికంగా, మానసికంగా ఎలా వేధించిందీ దీపాలీ ఆ లేఖలో వివరించారు. శివకుమార్‌ ఆగడాలపై పలుమార్లు ఆయన సీనియర్‌, ఎంటీఆర్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఎన్‌.శ్రీనివాస్‌ రెడ్డికి ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి మొదట్లో గర్భవతిగా ఉన్న దీపాలీని మూడు రోజుల పాటు పెట్రోలింగ్‌ నిర్వహించాల్సి ఉందంటూ శివకుమార్‌ తనతో పాటు బలవంతంగా అడవిలోకి తీసుకెళ్లాడని ఆమె సన్నిహితురాలు ఒకరు తెలిపారు. గర్భిణి అన్న విషయం తెలిసి కూడా కిలోమీటర్ల దూరం నడిపించాడని, గర్భస్రావం కావడంతో దీపాలీ తీవ్ర మనోవేదనకు గురైందని వివరించారు. దీపాలి లేఖలోని ఆరోపణలపై ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ మాట్లాడుతూ... అన్ని కోణాల్లో విచారణ జరిపిస్తామని, నిందితులను వదిలిపెట్టబోమన్నారు. నిందితుడు శివకుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ అటవీశాఖ ముఖ్య కన్జర్వేటర్‌(మంత్రాలయ) అరవింద్‌ ఆప్టే శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంటీఆర్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఎన్‌.శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలను మరొక అధికారికి బదిలీ చేసినట్లు అరవింద్‌ ఆప్టే వెల్లడించారు. అంతా అయిపోయాక బీద అరుపులు అరుస్తారు ప్రభుత్వ అధికారులు. ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతామంటూ గొప్పలు చెబుతారు. ఈ సంఘటనలు ఎప్పటికి ఫుల్ స్టాప్ పడుతుందో చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories