New Income Tax Bill: ఐటి అధికారుల చేతుల్లో మీ ఈమెయిల్స్, బ్యాంక్ ఎకౌంట్స్, సోషల్ మీడియా

IT officials to check your emails, social media accounts, bank accounts, online trading accounts with this 247 clause in New Income Tax Bill
x

New Income Tax Bill: ఐటి అధికారుల చేతుల్లో మీ ఈమెయిల్స్, బ్యాంక్ ఎకౌంట్స్, సోషల్ మీడియా

Highlights

247 clause in New Income Tax Bill: కొత్తగా తీసుకొస్తున్న ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లులో ఈ వర్చువల్ డిజిటల్ స్పేస్‌ను (VDS)..

New Income Tax Bill and it's new powers: ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ వచ్చిన తర్వాత మనిషికి గోప్యత అనేదే లేకుండా పోయిందనే భయాందోళన వెంటాడుతోంది. ఫోన్లు, ల్యాప్‌టాప్స్ మనిషి మాటలను రికార్డు చేసి వాటిని సంబంధిత కార్పొరేట్ సంస్థలకు చేరవేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ ఏఐతో వచ్చిన తలనొప్పి ఇలా ఉండగానే ఇక ఇప్పుడు ఇన్‌కమ్ ట్యాక్స్ వాళ్లు కూడా జనం జీవితాల్లోకి చొచ్చుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు.

ఇప్పటివరకు ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు టాక్స్ ఎగ్గొట్టారని అనుమానం వచ్చిన వారి ఇళ్లు, ఆఫీసులపైనే భౌతికంగా సోదాలు జరిపారు. కానీ ఇప్పుడు సోదాలకంటే ముందుగా అనుమానితుల పర్సనల్ ఈమెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్లు, ట్రేడింగ్ అకౌంట్స్ చెక్ చేయనున్నారు.

ఎవరైనా ఇన్‌కమ్ ట్యాక్స్ ఎగ్గొడుతున్నారని అనుమానం వచ్చినా.. లేదా వారి వద్ద ఆదాయ పన్ను విభాగానికి లెక్కలు చూపించని ఆస్తులు ఏమైనా ఉన్నాయని అనుమానం వచ్చినా... వారి ఈమెయిల్స్, బ్యాంక్ ఎకౌంట్స్, సోషల్ మీడియా ఖాతాలు చెక్ చేయనున్నారు.

సాధారణంగా ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 లోని సెక్షన్ 132 ప్రకారం అనుమానితుల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేసే అధికారం ఐటి అధికారులకు ఉంది. ఇంకా అనుమానం వస్తే వారి ఇంటి తాళాలు, బ్యాంక్ లాకర్ తాళాలు, ఏదైనా సీక్రెట్ ప్లేస్ తాళాలు పగలగొట్టి మరీ చెక్ చేసే అధికారం ఐటి అధికారులకు ఉంది. అయితే, కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు ప్రకారం అలా తాళాలు పగలగొట్టి మరీ చొచ్చుకెళ్లేందుకు వారికి మరిన్ని అధికారాలను ఇచ్చారు. అందులో భాగంగానే ఇలా మీ వర్చువల్ డిజిటల్ స్పేస్‌ను కూడా తనిఖీ చేసే అధికారం వారి చేతికి ఇస్తున్నారు.

కొత్తగా తీసుకొస్తున్న ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లులో ఈ వర్చువల్ డిజిటల్ స్పేస్‌ను కూడా చేర్చారు. డిజిటల్, కంప్యూటర్ నెట్‌వర్క్స్, కంప్యూటర్ స్టోరేజ్, ఆన్‌లైన్ స్టోరేజ్, అన్నిరకాల సమాచార మార్పిడి సాధనాలు అందులోకే వస్తాయి. ఇవేకాకుండా ఇంటర్నెట్, వెబ్‌సైట్‌తో పాటు ఎలక్ట్రానిక్ పరిజ్ఞానంతో రూపొందిన ఏ డేటాను అయినా ఐటి అధికారులకు చెక్ చేసేందుకు అధికారం ఉంటుంది.

ఇంకా వివరంగా చెప్పాలంటే ఈమెయిల్ సర్వర్స్, సోషల్ మీడియా ఎకౌంట్స్, ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ ఎకౌంట్, ట్రేడింగ్ ఎకౌంట్, బ్యాంక్ ఎకౌంట్ మొదలైనవి ఐటి అధికారులకు చెక్ చేసే అధికారం కల్పించనున్నారు. ఇవే కాకుండా అనుమానితుల డేటాకు సంబంధించి వెబ్‌సైట్స్, రిమోట్ సర్వర్స్, క్లౌడ్ సర్వర్స్, డిజిటల్ అప్లికేషన్ ప్లాట్‌ఫామ్స్‌ను కూడా వారు చెక్ చేయడానికి ఆస్కారం ఉంది.

అనుమానితులు వారి తాళంచెవి ఇవ్వకపోయినా ప్రస్తుత ఆదాయపన్ను చట్టం అధికారులకు తాళం పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు అనుమతిస్తోంది. అలాగే అనుమానితులు డిజిటల్ యాక్సిస్ ఇవ్వకపోయినా యాక్సెస్ కోడ్ ద్వారా ఓవర్‌రైడ్ చేసి మరీ వారి ఈమెయిల్స్, ఇతర ఆన్‌లైన్ ఎకౌంట్స్ చెక్ చేసేందుకు కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లులోని 247 క్లాజ్ అధికారాలు కల్పిస్తోంది.

ఏయే అధికారులకు ఈ అనుమతి ఉంటుంది?

కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లులో ఉన్న వివరాల ప్రకారం ఏయే అధికారులకు ఈ అనుమతి ఉందంటే...

1) జాయింట్ డైరెక్టర్ లేదా అడిషనల్ డైరెక్టర్

2) జాయింట్ కమిషనర్ లేదా అడిషనల్ కమిషనర్

3) అసిస్టెంట్ డైరెక్టర్ లేదా డిప్యూటీ డైరెక్టర్

4) అసిస్టెంట్ కమిషనర్ లేదా డిప్యూటీ కమిషనర్

5) ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లేదా ట్యాక్స్ రికవరి ఆఫీసర్

కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లుపై విమర్శలు

కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లుపై కొంతమంది నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆదాయ పన్ను పేరుతో వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూడటం ఏమేరకు సబబు అని వారు ప్రశ్నిస్తున్నారు. చట్టం పేరుతో తీసుకొచ్చే ఈ అధికారం దుర్వినియోగం కాదనే గ్యారెంటీ ఏముందనేది కొంతమంది ప్రశ్న. అవసరానికి మించి వ్యక్తిగత డేటా సేకరించరని గ్యారెంటీ ఏంటనేది ఇంకొంతమంది ప్రశ్న.

హద్దులు లేకుండా జరిగే ఈ డిజిటల్ చెకింగ్ ప్రాసెస్‌కు అంతం ఎక్కడుంటుంది? ఒక ట్యాక్స్ పేయర్ డేటా చెక్ చేయడం కోసం వారు పని చేసే సంస్థల డిజిటల్ డేటాను కూడా యాక్సెస్ చేస్తారా? గోప్యతకు భంగం కలిగించే ఈ అధికారాలు రాజ్యంగాన్ని ఉల్లఘించడం కిందకు రావా? కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లుపై ఇలా ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుండి ఈ అమలులోకి వస్తుందని తెలుస్తోంది. అంతకంటే ముందుగా ఈ ప్రశ్నలన్నింటికి కేంద్రం ఏమని సమాధానం చెబుతుందో వేచిచూడాల్సిందే మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories