logo
జాతీయం

మనమంతా డేంజర్‌ జోన్‌లో ఉన్నామా.. వరుస భూకంపాలు ఇస్తున్న మెసేజేంటి?

Is Series of Earthquakes is Hint for Threats
X

మనమంతా డేంజర్‌ జోన్‌లో ఉన్నామా.. వరుస భూకంపాలు ఇస్తున్న మెసేజేంటి?

Highlights

Earthquake: 'దేవుడు మనల్ని డేంజర్ జోన్‌లో పడేశాడు'. ఇదేదో సినిమా డైలాగ్ అనుకోకండి ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితులు అలాంటి ఇండికేషన్లే ఇస్తున్నాయి.

Earthquake: 'దేవుడు మనల్ని డేంజర్ జోన్‌లో పడేశాడు'. ఇదేదో సినిమా డైలాగ్ అనుకోకండి ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితులు అలాంటి ఇండికేషన్లే ఇస్తున్నాయి. కోవిడ్ నుంచి తేరుకున్నాం అనుకునే లోనే యుద్ధం వచ్చి మీదపడింది. సరే దీన్నుంచి కూడా మెల్లగా బయటకొస్తున్నాం అంటే ఊహించని ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచం నడ్డి విరిచేస్తున్నాయి. పది రోజుల్లో పదికిపైగా భూప్రకంపాలు మనమంతా డేంజర్‌ జోన్‌లో ఉన్నామనే సంకేతాలే ఇస్తున్నాయి. ఇండోనేషియా, టర్కీ, నేపాల్, మెక్సికో.. ఇలా చెప్పుకుంటూపోతే రోజూ ఏదో చోట కంపిస్తున్న భూమి ఏదో జరగబోతోందనే సంకేతాలే ఇస్తోంది. ఇక భారత్‌లోనూ భూప్రకపంనల లెక్కలు ఇటీవలి కాలంలో పెరుగుతూనే ఉన్నాయి. అన్నింటికీమించి హిమాలయాలు ఎప్పుడైనా కదిలిపోవచ్చనే అంచనాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఇంతకూ, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రకపంనలు ఎలాంటి సంకేతాలిస్తున్నాయి? 2004 సునామీ విధ్వంసం మరోసారి రిపీట్ కాబోతోందా? హిమాలయాలు కంపిస్తే 8లక్షల మంది ప్రాణాలు కోల్పోవాల్సిందేనా?

2020 నుంచి ఎదురవుతున్న పరిస్థితులు మాత్రం కాస్త ఆందోళన కలిగించేవిగానే కనిపిస్తున్నాయి. అప్పటి వరకూ సాఫీగా సాగిపోతున్న చైనా ఘనకార్యంతో ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి అతలాకుతలం చేసేసింది. రెండేళ్లపాటు వాళ్లూ వీళ్లూ అనే తేడా లేకుండా ప్రతిఒక్కరితో నరకానికి స్పెల్లింగ్ రాయించింది. ఇప్పటికీ డ్రాగన్ కంట్రీ దాని ప్రతిఫలాన్ని అనుభవిస్తూనే ఉంది. పోనీ, కోవిడ్ నుంచి బయటపడుతున్నాం అనుకునేలోపే ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం వచ్చి పడింది. దీనిదెబ్బకు శ్రీలంక లాంటి చాలా దేశాలు ఆర్ధిక పతనానికి స్వాగతం చెప్పాల్సి వచ్చింది. దీన్ని కూడా తట్టుకుని ముందుకెళ్దాం అనుకుంటున్న వేళ.. అకాల వరదలు చాలా దేశాలను కుదిపేశాయి. రీసెంట్‌ టైంలో సగం పాకిస్తాన్ వరదల దెబ్బకు తుడిచిపెట్టుకుపోయింది. కట్‌చేస్తే.. ఇప్పుడు భూకంపాల వంతొచ్చింది. ఇండోనేషియా, టర్కీ, నేపాల్, సోలొమన్ ఐలాండ్స్, మెక్సికో అంటూ రోజుకో చోట వచ్చే భూ ప్రకంపనలు లెక్కకుమించిన ప్రాణాలను మింగేస్తున్నాయి. ఈ ప్రకంపనలన్నీ ఎక్కడో జరుగుతున్నవే అనుకోడాని లేదు. ఎందుకంటే భారత్‌లోనూ ఇటీవలి కాలంలో భూమి కంపిస్తోంది. దేశ రాజధాని సహా మేఘాలయా లాంటి ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో మనమంతా ప్రమాదంలో ఉన్నామనే అనుమానాలకు బలం చేకూరుతోంది.

నిజానికి ఈ భూమిపై భూకంపం రాని ప్లేస్ అంటూ ఏదీ లేదు. భూమిలోపల నిరంతరం కదలికలు వస్తూనే ఉంటాయి. అందువల్ల భూకంపం వస్తే.. మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో కచ్చితంగా తెలిసి ఉండాలి. అలా తెలియాలంటే.. భూకంపంపై మన అవగాహన పెంచుకోవాలి. భూకంపం ప్రధానంగా రెండు కారణాలతో సంభవిస్తుంది. వాటిలో మొదటిది అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు. ఇక రెండోది భారీ ఉల్కలు భూమిని తాకినప్పుడు. అయితే చాలా భూకంపాలకు కారణం భూమిలోపలి పలకల్లో వస్తున్న కదలికలే కారణం. భూ ఉపరితలంపై దాదాపు 20 రకాల పలకలు ఉన్నాయి. ఇవి నిరంతరం కదులుతూనే ఉంటాయి. అలా కదిలినప్పుడు వీటి నుంచి వచ్చే ఒత్తిడితో భూ ఉపరితలం ముక్కలవుతుంది. అలా జరిగే ప్రక్రియే భూకంపం. భూమి ముక్కలైనప్పుడు లోపలి నుంచి వచ్చిన ఒత్తిడి తరంగాల రూపంలో బయటకు పోతుంది. ఆ సమయంలో భారీగా ప్రకంపనలు జరుగుతాయి.

సాధారణ ప్రదేశాల్లో భూకంపంపై వచ్చినప్పుడు మనుషులు చనిపోయే అవకాశాలు తక్కువ. అదే ఇళ్లు, భవనాలు ఉన్న చోట వస్తే అవి కూలిపోవడం వల్ల మరణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సునామీలు, మంచు తుఫాన్లు, కొండరాళ్లు విరిగిపడినప్పుడు ప్రాణహాని మరింత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల భూకంపం వస్తే.. విశాలమైన ప్రదేశాలకు వెళ్లిపోవాలి. అలాగే, భూకంపాలను నేషనల్ ఎర్త్ క్వేక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నమోదు చేస్తోంది. ఏటా సగటున 20వేల భూకంపాలు వస్తున్నాయి. అంటే సగటున రోజుకు 50 ప్రకంపనలు. ఇంకా రికార్డులకు ఎక్కని భూకంపాల సంఖ్య వేలల్లోనే ఉంటుంది. ఎందుకంటే అవి వచ్చినట్టు కూడా తెలియనంత చిన్నవి కాబట్టి. ఇక ఉత్తర అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఏటా దాదాపు 10వేల భూకంపాలు వస్తుంటాయి. వాటిలో చాలా వాటిని లెక్కలోకి తీసుకోరు. అయితే ఓ భారీ భూకంపం వచ్చాక మళ్లీ అక్కడే భూకంపం వస్తే ఆ తర్వాత కొన్ని నెలలపాటూ ప్రకంపనలు వస్తూనే ఉంటాయి.

మరోవైపు భూకంపాల్లో 80 శాతం పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లోనే వస్తున్నాయి. దీన్నే రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. భూమి చుట్టూ ఉండే ఈ రింగ్ ప్రాంతంలో.. 452 అగ్ని పర్వతాలు ఉన్నాయి. అంటే ప్రపంచంలోని అగ్నిపర్వతాల్లో 75 శాతం ఈ రింగ్ దగ్గర్లోనే ఉన్నాయి. వీటి వల్లనే భూకంపాలు వస్తున్నాయి. అమెరికాలో ఇప్పటివరకూ వచ్చిన భూకంపాల్లో నమోదైన, అతి పెద్దది 1964 మార్చి 28న సంభవించింది. అలస్కాలోని ప్రిన్స్ విలియం సౌండ్ ప్రాంతాన్ని వణికించిన ఆ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 9.2గా నమోదైంది. ఇక.. ప్రపంచంలో ఇప్పటివరకూ వచ్చిన భూకంపాల్లో నమోదైన అతిపెద్దది దక్షిణ అమెరికా దేశం చిలీలో 1960 మే 22న వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 9.5గా నమోదైంది. ఈ భారీ భూకంపం వల్ల దూసుకొచ్చిన తరంగాలు భూమి మొత్తం ప్రయాణించాయి. కొన్ని రోజులపాటూ అవి భూమి మొత్తాన్నీ వణికించాయి. ఇక ప్రపంచంలో భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రాంతం అలస్కా. ఇక్కడ ఏటా రిక్టర్ స్కేల్‌పై 7 తీవ్రతతో భూకంపాలు సంభవిస్తాయి. అలాగే దాదాపు ప్రతి 14 ఏళ్లకు ఓసారి 8 తీవ్రతతో భూమి కంపిస్తుంది.

కొన్ని భూకంపాలను పరిశీలించినపుడు చాలా తక్కువ తీవ్రత కనిపిస్తుంది. కానీ ఆ భూకంపం వల్ల ప్రజలకు తగిలే దెబ్బ మాత్రం భారీగా ఉంటుంది. తాజాగా ఇండోనేషియాలోని జావా ను కుదిపేసింది ఇలాంటి తక్కువ తీవ్రతతో వచ్చిన భూకంపమే. కేవలం 5.6 తీవ్రతతో వచ్చిన భూకంపం 260 మందికి పైగా ప్రాణాలను మింగేసింది. ఈ లెక్క మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. పాఠశాలలు, ఆసుపత్రి, ఇతర భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రిక్టర్ స్కేల్‌పై కనిపించినదానికి భిన్నంగా వాస్తవ నష్టం జరగడానికి కారణం ఉంది. నిజానికి భూకంపం వల్ల జరిగే నష్టం కేవలం దాని తీవ్రతపై ఆధారపడదు. జనావాసాలు ఆ భూకంప భ్రంశ రేఖకు ఎంత దగ్గరగా ఉన్నాయి? కంపనం ఎంత లోతులో సంభవించింది? భూకంపం నుంచి రక్షణ పొందే పద్ధతిలో భవనాల నిర్మాణం జరిగిందా? లాంటి అంశాలను బట్టే నష్టం తీవ్రత పెరుగుతుంది. భూకంపం మధ్యంతర స్థాయిలో ఉన్నప్పటికీ, భూమి ఉపరితలానికి సమీపంలో, సముద్రాలకు దూరంగా, జనావాసాలకు దగ్గరగా ఏర్పడితే, చెప్పుకోదగ్గ స్థాయిలో నష్టం కలిగించే శక్తి దానికి ఉంటుందన్నమాట.

మరోవైపు ఇటీవలి కాలంలో భారత్‌లో కూడా వరుస భూప్రకంపనలు చోటుచేసు కుంటున్నాయి. ఇవి కూడా తక్కువ తీవ్రతతోనే నమోదవుతున్నప్పటికీ రిలాక్స్ అవ్వడానికి లేదని ఇండోనేషియా ఘటన హెచ్చరిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే భవిష్యత్‌లో మరిన్ని భూకంపాలు సంభవించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రధానంగా హిమాలయాల్లో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇటీవల పశ్చిమ నేపాల్‌లోని మారుమూల ప్రాంతంలో రిక్టర్ స్కేల్ పై 6.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపంలో ఆరుగురు మరణించారు. ఈ భూకంప ప్రకంపనలు భారత్‌లో కూడా సంభవించాయి. ఉత్తరాఖండ్‌తో పాటు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి. గత 150 ఏళ్లలో హిమాలయ ప్రాంతాల్లో నాలుగు భారీ భూకంపాలు వచ్చాయి. రానున్న రోజుల్లో కూడా భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్లు ప్రిపేర్ అయి ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

మరోవైపు.. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, ఆసియా టెక్టానిక్ ప్లేట్ మధ్య ఘర్షణ తీవ్రం అవుతోందని.. దీని కారణంగానే హిమాలయాల్లో భూకంపాలు సంభవిస్తున్నట్లు వెల్లడించారు. ఈ రెండు పలకల మధ్య ఘర్షణ వల్ల అపరిమిత శక్తి భూకంపాల రూపంలో బయటకు వస్తున్నట్లు తెలిపారు. ప్రతీ ఏడాది కొన్ని మిల్లీమీటర్ల మేర ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ ఉత్తర వైపుగా ఆసియా టెక్టానిక్ ప్లేట్ ని నెట్టేస్తోంది. దీని వల్ల హిమాలయాల ఎత్తు కూడా కాలక్రమంలో మెల్లిగా పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల తరుచుగా హిమాలయ ప్రాంతాల్లో భూకంపాలు వస్తున్నాయి. ఈ క్రమంలో పెద్ద భూకంపం సంభవించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఒకవేళ హిమాలయ పర్వత శిఖరాల్లో సంభవించే భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ పై 8 పాయింట్లు నమోదైతే కనుక సుమారు ఎనిమిది లక్షల మంది ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది ఎక్స్‌పర్ట్స్‌ అంచనా. హిమాలయ పర్వశ్రేణులకు ఆనుకుని ఉండే రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో గత 53 సంవత్సరాల్లో భూకంప తీవ్రత చాలా ఉధృతంగా ఉన్నట్టు సూచనలు అందుతున్నట్టు చెబుతున్నారు. భూకంప తీవ్రత 8 పాయింట్లకు మించితే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే పరిస్థితి ఉందన్నారు. 1950 నుంచి అలాంటి ప్రమాదాన్ని ఇప్పటి వరకు ఎదుర్కోలేదన్నారు. అయితే హియాలయ పర్వత ప్రాంతాల్లో అలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నట్టు అధ్యయనాలు వెల్లడించాయన్నారు. హిమాచల్ ప్రదేశ్ మండిలో భూకంపం సంభవిస్తే చండిఘర్‌లో 20 వేల మంది ప్రాణలకు ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు.

అయితే, భూకంపం నుంచి రక్షణ పొందే డిజైన్‌లో భవనాలను నిర్మించుకోవడం వల్ల సత్ఫలితాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. జావాలో సంభవించిన భూకంపం వల్ల నష్టం పెరగడానికి కారణం అక్కడి భవనాలను ఇటువంటి డిజైన్లలో నిర్మించకపోవడమే అంటున్నారు. పసిఫిక్ బేసిన్‌లో అగ్ని పర్వతాలు, భూమి లోపలి పొరల్లోని శిలలు పగిలిపోయిన ప్రాంతాలు ఎక్కువగా గల చోట ఇండోనేషియా దేశం ఉంది. ఇక్కడ సుమారు 27 కోట్ల మంది జీవిస్తున్నారు. దాదాపు 40 వేల కిలోమీటర్ల మేరకు విస్తరించిన ఈ ప్రాంతంలో భూకంపాలు తరచూ సంభవిస్తాయి. అయితే చాలా భూకంపాలు స్వల్ప తీవ్రతతోనే కనిపిస్తాయి. వాటి వల్ల జరిగే నష్టం చాలా స్వల్పంగా ఉంటుంది. కొన్నిసార్లు అసలు నష్టం ఏమీ ఉండదు. మొత్తంగా భూకంపాల విషయంలో మరింత అలర్ట్‌గా ఉండాల్సిన టైం వచ్చినట్టే కనిపిస్తోంది.

Web TitleIs Series of Earthquakes is Hint for Threats
Next Story