ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం..భారత ఆర్థిక వ్యవస్థపై నీలినీడలు

ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం..భారత ఆర్థిక వ్యవస్థపై నీలినీడలు
x
Highlights

ఆర్థిక మాంద్యం ఈ పేరు చెప్పగానే దేశాలన్నీ భయపడుతుంటాయి. అగ్రరాజ్యాలు సైతం వణికిపోతాయి. అలాంటి ఆర్థిక మాంద్యం ప్రభావం ఇప్పుడు భారత్ పై కనిపించడం ప్రారంభమైంది.

ఆర్థిక మాంద్యం ఈ పేరు చెప్పగానే దేశాలన్నీ భయపడుతుంటాయి. అగ్రరాజ్యాలు సైతం వణికిపోతాయి. అలాంటి ఆర్థిక మాంద్యం ప్రభావం ఇప్పుడు భారత్ పై కనిపించడం ప్రారంభమైంది. దీని ప్రభావం ఎలా ఉంటుందన్న ఆందోళన అందరిలో మొదలైంది.

కంపెనీల లాభాలు తగ్గిపోతున్నాయి పలు సంస్థల్లో ఉద్యోగాలపై వేటు మొదలైంది. ఇదంతా దేనికి సంకేతమనే భయం పట్టుకుంది. ఆర్థిక మాంద్యం ప్రభావం ప్రారంభమైందని ఆర్థిక వేత్తలు అంటున్నారు. ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి మందగించనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

హైదరాబాద్ లో అమెజాన్ తన అతిపెద్ద కార్యాలయాన్ని ప్రారంభించింది. అమెరికా వెలుపల మరే దేశంలోనూ ఇంత పెద్ద కార్యాలయం లేదు. మరో వైపున ఆ సంస్థ దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు వస్తోంది. ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. నాణేనికి మరో వైపు చూడాలంటేనే భయమేస్తోంది. అదే ఆర్థిక మాంద్యం. ప్రజల కొనుగోలు శక్తి బాగా పడిపోవడం ఆర్థిక మాంద్యానికి ఒక సంకేతం మాత్రమే. సాధారణంగా ఆర్థికాభివృద్ధికి సూచికగా కార్ల విక్రయాలను పరిగణిస్తుంటారు. ఆ రకంగా చూస్తే ఆర్థిక మాంద్యం ప్రభావం మొదటగా పడేది వాహనాల విక్రయాల పైనే. తాజాగా కార్ల విక్రయాల లెక్కలు చూస్తుంటే భారత్ పై ఆర్థిక మాంద్యం ప్రభావం ప్రారంభమైందనే ఆర్థిక నిపుణులు అంటున్నారు. కార్ల పరిశ్రమలో గత 19 సంవత్సరాలలో కనీవినీ ఎరుగని మాంద్యం నెలకొంది. 2018 జులై నెలలో వివిధ రకాల వాహనాలు 22.45 లక్షలు అమ్మగా, 2019 జులైలో 18.25 లక్షలకు పడిపోయింది. 4.20 లక్షల వాహనాల అమ్మకం తగ్గింది. గత మూడు నెలల కాలంలోనే వాహన పరిశ్రమలో 15 వేల మంది ఉద్యోగులను తొలగించారు. ఈ మాంద్యం ఇలానే కొనసాగితే ఒక్క వాహన రంగంలోనే వేల మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. మాంద్యం ప్రభావం ఇతర రంగాలకు విస్తరిస్తే ఇలా ఉద్యోగాలు కోల్పోయే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది.

ఆర్థిక మాంద్యం అనగానే అందరికీ గుర్తుకొచ్చేవి ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలే. గతంలో ఇలాంటి ప్యాకేజీలే దేశాన్ని ఆదుకున్నాయి. ఈ దఫా కూడా ఇలాంటి ప్యాకేజీలను ప్రకటించాలని పరిశ్రమలు కోరుతున్నాయి. ఒక్క వాహన పరిశ్రమనే లక్ష కోట్ల ఉద్దీపన ప్యాకేజీ కోరుతోంది. ఆ లెక్కన చూస్తే వివిధ పరిశ్రమలు మరెన్నో లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీలను కోరే అవకాశం ఉంది. ఉన్నత, మధ్యతరగతి వారిలో కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో కంపెనీల విక్రయాలు భారీగా పడిపోతున్నాయి. పార్లే కంపెనీ లాభాలు బాగా తగ్గిపోయాయి. పార్లే చిన్న కంపెనీ ఏమీ కాదు. సుమారు లక్ష మంది ఆ కంపెనీలో పని చేస్తున్నారు. వారిలో పదో వంతును అంటే సుమారు పదివేల మందిని తొలగించనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. జీఎస్టీ రేటు తగ్గించాలని పార్లే కంపెనీ కోరింది. అది ఒక్కటే కాదు మరెన్నో కంపెనీలు కూడా జీఎస్టీ రేట్లపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కంపెనీల విక్రయాలు తగ్గితే వాటి లాభాలు తగ్గుతాయి. దాంతో అవి ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగాలపై వేటు వేస్తాయి. ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారు రుణాలను చెల్లించలేరు. దాంతో బ్యాంకులపై కూడా ఆ ప్రభావం పడుతుంది. అవి వేరేవారికి మరింతగా రుణాలు ఇవ్వలేకపోతాయి. ఇదంతా ద్రవ్య వ్యవస్థపై, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం కనబరుస్తుంది. మొత్తం మీద పెద్ద నోట్ల రద్దుతో ప్రారంభమైన ప్రతికూల ఫలితాలు జీఎస్టీ తో మరింత అధికమై చివరికి ఆర్థికమాంద్యం గా రూపుదాలుస్తున్నాయి.

ఆర్థిక మాంద్యం దేశానికి కొత్తేమీ కాదు. ప్రతీ పది, ఇరవై ఏళ్లకోసారి ఆర్థిక మాంద్యం తలెత్తుతూనే ఉంది. కాకపోతే ఆర్థిక స్థితిగతులన్నీ బాగా ఉన్నాయని ప్రభుత్వాలు చెబుతున్న తరుణంలో ఆర్థికమాంద్యం రావడమే ఆశ్చర్యంగా మారింది. అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లో మొదలయ్యే ఆర్థిక మాంద్యం క్రమంగా ప్రపంచమంతా విస్తరిస్తోంది.

ఆర్థిక మాంద్యం ప్రపంచానికి కొత్తేమీ కాదు. అంతే కాదు ఒక దేశంలో ప్రారంభమయ్యే మాంద్యం అంటువ్యాధిలా ఇతర దేశాలకూ విస్తరిస్తుంది. అమెరికా విషయానికి వస్తే అక్కడ వచ్చే ఆర్థిక మాంద్యం యావత్ ప్రపంచానికి విస్తరిస్తుంది. అమెరికాలో గత 200 ఏళ్ళ కాలంలో సుమారు 17 సార్లు ఆర్థికమాంద్యం ఏర్పడింది. 1797లో తొలి ఆర్థిక మాంద్యం అప్పుడే ఏర్పడ్డ అమెరికాను ప్రభావితం చేసింది. 1929లో అమెరికాలో భారీ స్థాయి ఆర్థిక మాంద్యం నెలకొంది. అమెరికా ఆర్థిక చరిత్రలో అతి గడ్డుకాలంగా చరిత్రకెక్కింది. ఆ పరిస్థితి 1938 వరకూ సాగింది. నిరుద్యోగ సమస్య అత్యధిక స్థాయిలో 25 శాతానికి చేరింది. 2008 - 2009లో ఆర్థిక మాంద్యం అమెరికాను తీవ్రస్థాయి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. సబ్‌ప్రైమ్ మార్ట్‌గేజ్ సంక్షోభంగా దాన్ని వ్యవహరించారు. అది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలనూ ప్రభావితం చేసింది. అప్పట్లో భారత్ ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్ బాగా ఉండడంతో కొద్దిపాటి ప్రభావంతోనే బయటపడగలిగింది.

దేశంలో మొదలైన ఆర్థికమాంద్యం కంపెనీలను వణికిస్తోంది. కంపెనీల ఆదాయాలు, లాభాలు బాగా పడిపోతున్నాయి. జూన్ త్రైమాసికంలో భారతీయ కంపెనీలు నికర విక్రయాల్లో వృద్ధి 4.6 శాతంగా మాత్రమే నమోదైంది. గత ఏడాది జూన్ లో ఇది 13.5 శాతంగా ఉండింది. నికర లాభంలో వృద్ధి 6.6 శాతంగా మాత్రమే నమోదైంది. గత జూన్ లో ఇది 24.6 శాతంగా ఉండింది. త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన సుమారు 3 వేల కంపెనీల ఫలితాలను బట్టి ఈ గణాంకాలను కేర్ రేటింగ్స్ వెల్లడించింది. జనవరి - మార్చి మధ్య కాలంలో దేశ ఆర్థిక వృద్ధి 5.8 శాతంగా ఉండింది. గత ఐదేళ్ళ కాలంలో ఇదే కనిష్ఠం. మార్చి నుంచి జూన్ మధ్య కాలానికి ఇప్పుడు అది మరింతగా పడిపోయి 5.7 శాతానికి చేరుకుందని నోమురా సంస్థ వెల్లడించింది. చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తుంటే రాబోయేది గడ్డుకాలమే అని స్పష్టమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి నుంచే తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశ్రమలకు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించడం కేంద్రప్రభుత్వానికి తలకు మించిన భారమే అవుతుంది. మరో వైపున అలా ఇవ్వకుంటే ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉంది.

ఆర్థిక నిపుణులు అంచనా ప్రకారం మరో ఏడాదిలోనో రెండేళ్లలోనో అమెరికాలో తీవ్రస్థాయి ఆర్థిక మాంద్యం రానుంది. అప్పుడు యావత్ ప్రపంచం ఒడిదొడుకులకు లోను కాక తప్పదు. ఆలోగా ఆర్థికమాంద్యం అమెరికా కంటే ముందుగానే భారత్ ను పలకరిస్తోంది. మరో వైపున రాజకీయ నాయకులు కూడా రంగంలోకి దిగారు. మోడీ అనుసరిస్తున్న విధానాల కారణంగానే ఆర్థికమాంద్యం చోటు చేసుకుందని కాంగ్రెస్ నేత ప్రియాంక వాద్రా విమర్శించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories