దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

Increasing Corona Cases In India
x

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

Highlights

Corona Cases In India: దేశంలో నిన్న 17,000 దాటిన రోజువారి కేసులు, ఒక్కరోజులోనే పెరిగిన 30శాతం కేసులు

Corona Cases In India: దేశంలో మళ్లీ కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రోజువారి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ఫోర్త్ వేవ్ వచ్చిందంటూ.. ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రతి పదుల సంఖ్యలో కేసులు మాత్రమే నమోదవుతుండేవి. ఇప్పుడు ప్రభుత్వం అధికారిక బులిటెన్ విడుదల చేయకపోయినా... ప్రతి రోజూ వేల సంఖ్యలోనే పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది.

దేశంలో కోవిడ్ కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. నాలుగు నెలల తరువాత రోజువారి కేసుల సంఖ్య నిన్న17వేలు దాటింది. ఒక్కరోజులో కేసులు ఏకంగా 30శాతం కేసులు పెరిగాయి. రోజువారి పాజిటివిటీ రేటు 4శాతానికి దాటిపోయింది. నిన్న 17వేల 336 మంది కరోనా బారిన పడగా..13 మంది కోవిడ్ తో చనిపోయారు. క్రితం రోజుతో పోలిస్తే 4వేలకు పైగా కేసులు పెరిగాయి.

తెలంగాణ రాష్ట్రంలోనూ కొవిడ్‌ పాజిటివిటీ రేటు క్రమేణా పెరుగుతోంది. ఈ నెలలో గత 24 రోజుల పాజిటివిటీని పరిశీలిస్తే.. అదనంగా ఒక శాతానికి పైగా పెరిగింది. అది ఈ నెల 1న 0.61 శాతం ఉండగా.. 24న 1.69 శాతానికి ఎగబాకింది. తెలంగాణ వ్యాప్తంగా నిన్న 493 కొత్త కొవిడ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. గత మూడు నెలల్లో ఇదే అత్యధిక పెరుగుదల. తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ శ్రీనివాస్‌. డెంగ్యూ, మలేరియా కేసులు వస్తున్నాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంటింటికీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోందని, అందరూ బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలని చెబుతున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వారం రోజుల్లోనే రెట్టింపు కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఇటీవల కరోనా కేసులు చాలా తక్కువగా ఉండడంతో ప్రజలు నిబంధనలు పాటించడంతో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. దీంతో కరోనా వైరస్‌ విస్తరిస్తోంది. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనూ వ్యాప్తి చెందుతోంది.

ఏపీలో కాకినాడ ఎస్‌ఆర్‌కే మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఎన్‌సీసీ శిబిరంలో ఆరుగురు క్యాడెట్లకు కరోనా సోకింది. అనుమానిత లక్షణాలున్న 53 మంది విద్యార్థుల నమూనాలు సేకరించి... కాకినాడ జీజీహెచ్‌కు పంపించాగా ఫలితాల్లో ఆరుగురికి పాజిటివ్‌గా తేలింది. వారిని శిబిరంలోనే ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories