'క్లోరోక్విన్' ఎవరు..ఎందుకు..ఎప్పుడు..ఎలా వాడాలి? ఐసీఎంఆర్ చెబుతోంది ఇదే!

క్లోరోక్విన్ ఎవరు..ఎందుకు..ఎప్పుడు..ఎలా వాడాలి? ఐసీఎంఆర్ చెబుతోంది ఇదే!
x
representative image
Highlights

కరోనా వైరస్ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీలేదు. ప్రస్తుతం భారత దేశంలో మెల్ల మెల్లగా విస్తరిస్తున్న ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం...

కరోనా వైరస్ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీలేదు. ప్రస్తుతం భారత దేశంలో మెల్ల మెల్లగా విస్తరిస్తున్న ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది.. దాదాపుగా దేశం అంతా నిర్భంధంలోకి వెళ్ళిపోయింది.

ఇప్పుడు తాజా చర్చ అంతా కరోనా వైరస్ ను కట్టడి చేసే మందులపైనే ఉంది. ఇప్పటివరకూ నివారణ లేదా నియంత్రణ కోసం ఎటువంటి మందును వైద్యులు ఇతమిత్థంగా చెప్పలేక పోయారు. కానీ, ఇటీవల కాలంలో అమెరికా వంటి దేశాలలో మనం సాధారణంగా మలేరియా వ్యాధికి ఉపయోగించే క్లోరోక్విన్ మాత్రలు కరోనా నుంచి కొంత ఉపశమనాన్ని ఇస్తున్నట్టు చెబుతున్నారు. దీనిని సోమవారం (మార్చి 23) న భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) నిర్ధారించింది. ఈ మేరకు క్లోరోక్విన్ మందును కరోనా బాధితులకు ఉపయోగించవచ్చు అంటూ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.

ఈ ప్రకటన వెలువడిన వెంటనే ప్రజలు క్లోరోక్విన్ మాత్రల కోసం ఫార్మసీల బాట పట్టారు. అవసరం తో పని లేకుండా ఈ మందును కొనుగోలు చేసేస్తున్నారు. అయితే, ఈ క్లోరోక్విన్ వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఎలా వాడాలనే విషయం గురించీ, ఐసీఎంఆర్ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ మార్గదర్శకాల ముఖ్యాంశాలివే!

''కరోనా సోకే ముప్పు ఎక్కువగా ఉన్నవారు మాత్రమే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఔషధాన్ని వాడాలి. అది కూడా ముందస్తు నివారణ చర్యల్లో భాగంగానే. ఈ ఔషధ నిల్వలు మన దేశంలో తగినంతగా ఉన్నాయి.'' ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ చెబుతున్నారు.

ఎవరు వాడొచ్చు?

* కరోనా బాధితులు, అనుమానిత రోగులకు వైద్య సేవలు అందించే సిబ్బందికి కొవిడ్‌ లక్షణాలు లేకపోయినా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను అందించవచ్చు.

* కరోనా సోకినవారి కుటుంబ సభ్యులకు వ్యాధి లక్షణాలు లేకపోయినా ఇవ్వొచ్చు.

* ఈ ఔషధాన్ని తీసుకుంటే తాము క్షేమంగా ఉంటామని అపోహపడొద్దు. ఎప్పటిలాగానే తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ చేతులు కడుక్కోవాలి. శ్వాస సంబంధిత జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగత భద్రతా చర్యలు తీసుకోవాలి.

* వైద్య సిబ్బంది తమ ఆరోగ్యాన్ని నిరంతరం గమనించుకుంటూ ఉండాలి. తమలో కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యాధికారులకు సమాచారం అందించాలి.

* కరోనా బాధితులతో హై రిస్క్‌ కాంటాక్ట్స్‌ ఉన్నవారు రోగ నిరోధక చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఇంటికెళ్లాక నిర్బంధంలో ఉండాలి.

* హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను రిజిష్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషినర్‌ సూచనల మేరకే తీసుకోవాలి. దుష్ప్రభావాల ముప్పుంటే వాడకూడదు.

* జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి కొవిడ్‌-19 లక్షణాలతో ఉన్న వ్యక్తులు ఈ ఔషధాన్ని వినియోగిస్తున్నప్పుడు ఏవైనా ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఎలా వాడాలి?

* వైద్య సేవలు అందిస్తున్న సిబ్బంది తొలి రోజు రెండుసార్లు 400 ఎం.జి. వాడాలి. తర్వాత ఏడు వారాలపాటు వారానికి ఒకసారి 400 ఎం.జి. మోతాదులో భోజనంతో కలిపి తీసుకోవాలి.

* కొవిడ్‌-19 రోగులతో కలిసి ఇంట్లో ఉంటున్న కుటుంబ సభ్యులు తొలి రోజు రెండుసార్లు 400 ఎం.జి. తీసుకోవాలి. తర్వాత మూడు వారాలపాటు వారానికి 400 ఎం.జి. ఔషధాన్ని భోజనంతోపాటు తీసుకోవాలి.

క్లోరోక్విన్ వాడకంలో జాగ్రత్తలు ఇలా..

* 15 ఏళ్లలోపు చిన్నారుల్లో ముందస్తు నివారణ కోసం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఉపయోగించకూడదు.

* దాని వినియోగంతో దుష్ప్రభావాలు తలెత్తితే హెల్ప్‌లైన్‌ ద్వారా గానీ, యాప్‌ ద్వారా గానీ ఫిర్యాదు చేయాలి.

* కొవిడ్‌ బాధితులతో సంబంధమున్నవారు ఈ ఔషధంతో నివారణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ జాతీయ మార్గదర్శకాల ప్రకారం ఇంట్లోనే నిర్బంధంలో ఉండాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories