IAS Ashok Khemka: 34 ఏళ్లలో 57 సార్లు ట్రాన్స్‌ఫర్... సోనియా గాంధీకి ఎదురెళ్లిన ఐఏఎస్... అయినా సరే...

IAS officer Ashok Khemka who got transferred 57 times in his 34 years career is retiring today
x

Who is IAS officer Ashok Khemka: 34 ఏళ్లలో 57 సార్లు ట్రాన్స్‌ఫర్... సోనియా గాంధీకి ఎదురెళ్లిన ఐఏఎస్... అయినా సరే...

Highlights

IAS officer Ashok Khemka retirement: ఐఏఎస్ అశోక్ ఖేమ్కా తన పుట్టిన రోజు నాడే తనకు ఎంతో ఇష్టమైన సర్వీస్ నుండి రిటైర్ అవుతున్నారు.

IAS officer Ashok Khemka

Who is IAS officer Ashok Khemka: ఐఏఎస్ అశోక్ ఖేమ్కా... ఇండియాలో అత్యధికసార్లు ట్రాన్స్‌ఫర్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైనా ఉన్నారా అంటే టక్కున గుర్తుపెట్టుకుని చెప్పాల్సిన పేరు ఇది. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి ప్రశ్నలు ఏ పోటీ పరీక్షల్లోనైనా రావచ్చు మరి. ఈ ఐఏఎస్ ఆఫీసర్ స్టోరీ వెంటే ఐఏఎస్ అధికారులతో ఇలా కూడా ఆడుకుంటారా అని అనిపించకమానదు. ఎందుకంటే 34 ఏళ్ల కెరీర్లో 57 సార్లు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. అది తన నిజాయితీకి దక్కిన గౌరవంగా ఆయన చెప్పుకుంటారు. కానీ ఇకపై ఆయన్ను ఎవ్వరూ ట్రాన్స్‌ఫర్ చేయలేరు. ఎందుకంటే ఆయన ఈ ఏప్రిల్ 30వ తేదీతో తన సర్వీస్ నుండి రిటైర్ అవుతున్నారు. అందుకే ఇప్పుడు ఐఏఎస్ అశోక్ ఖేమ్కా మరోసారి వార్తల్లోకొచ్చారు. మరో విచిత్రం ఏంటంటే... తన పుట్టిన రోజు నాడే ఆయన సర్వీస్ నుండి రిటైర్ అవుతున్నారు.

అశోక్ ఖేమ్కా 1965 ఏప్రిల్ 30న కోల్‌కతాలో జన్మించారు. హర్యానా కేడర్‌కు చెందిన ఈ ఐఏఎస్ ఆఫీసర్ ప్రస్తుతం రవాణా శాఖ అదనపు ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన ఈ ఐఏఎస్ ఆఫీసర్‌తో పాటు డ్యూటీ ఎక్కిన వాళ్లంతా కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక హోదాల్లో ఉన్నారు. కానీ అశోక్ ఖేమ్కా మాత్రం సగటున ప్రతీ 6 నెలలకు ఒకసారి ఒక పోస్టు నుండి మరో పోస్టుకు బదిలీ అవుతూనే ఉన్నారు.

ఆయన 34 ఏళ్ల కెరీర్లో 57 సార్లు ట్రాన్స్‌ఫర్ అయ్యారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడికెళ్లినా, ఏ శాఖలో ఉన్నా అవినీతిని అంతమొందించాలనేదే తన ఉద్దేశం అంటారు. కానీ ఆ శాఖపై పట్టు పెంచుకోక ముందే విధిగా బదిలీ అవుతూ వస్తున్నారు. అధికారికంగా ఆయన బదిలీ అవుతున్నప్పటికీ, చూసే వారికి ఆయన బలి అవుతున్నట్లుగా అనిపిస్తుంది. అయినప్పటికీ ఆయన ఎవరికైనా సరే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి వెనుకాడరనే పేరుంది. కానీ కొంతమంది దానినే ఎదురు చెప్పడం అని కూడా అంటుంటారు.

పదేళ్ల క్రితం ఇదే రవాణా శాఖలో కమిషనర్‌గా అపాయింట్ అయ్యారు. సరిగ్గా 4 నెలలకే ఆయన్ను అక్కడి నుండి బదిలీ చేశారు. ఆ తరువాత మళ్లీ పదేళ్లకు అదనపు చీఫ్ సెక్రటరీగా ఇదే రవాణా శాఖకు బదిలీ అయ్యారు. ఇక్కడే రిటైర్ అవుతున్నారు. ఒకవేళ ఆయన్ను మళ్లీ బదిలీ చేయాలనుకున్నా... అదే రోజు ఆయన కొత్త పోస్టులో చార్జ్ తీసుకోవడంతో పాటు అదే స్థానం నుండి రిటైర్ అయ్యేలా బదిలీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన సర్వీసులో ఇక మిగిలి ఉంది ఈ ఒక్కరోజే.

గత 12 ఏళ్లుగా ఆయన పెద్దగా ప్రాధాన్యత లేని శాఖలు, విభాగాల్లోనే పనిచేస్తున్నారు. ఆయన్ను బదిలీ చేసిన పోస్టులు అటువంటివి మరి.

అశోక్ ఖేమ్కాకు చదువంటే ప్రాణం

కోల్‌కతాలో పుట్టి పెరిగిన అశోక్ ఖేమ్కాకు చిన్నప్పటి నుండి చదువంటే ప్రాణం. అందుకే కష్టపడి చదువుకుని ఐఐటి ఖరగ్‌పూర్‌లో అడ్మిషన్ సంపాదించారు. 1988 లో ఐఐటి ఖరగ్‌పూర్ నుండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. ఆ తరువాత టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (TIFR) లో పీహెచ్‌డీ చేశారు. పీహెచ్డీ చేసిన తరువాత బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్‌లో ఎంబీఏ చేశారు.

ఐఏఎస్ అయ్యాక కూడా ఆయనకు చదువుపై మక్కువ పోలేదు. అంత బిజీ షెడ్యూల్లోనూ పంజాబ్ యూనివర్శిటీ నుండి ఎల్ఎల్‌బి పట్టా అందుకున్నారు.

సోనియా గాంధీకి ఎదురెళ్లి.. ఇంకా ఎటూ తేలని కేసు

2012 లో అశోక్ ఖేమ్క తొలిసారిగా జాతీయ స్థాయిలో లైమ్‌లైట్‌లోకి వచ్చారు. అప్పుడు కేంద్రంలో యూపీఏ సర్కారు అధికారంలో ఉంది. ఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్‌లో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంబంధం ఉన్న ఒక భూమి మ్యుటేషన్‌ను ఐఏఎస్ అశోక్ రద్దు చేశారు. ఏదైనా ఒక స్థలం యాజమాన్య హక్కులను బదిలీ చేయడంలో మ్యూటేషన్ అనేది కీలకం కావడంతో అప్పట్లో ఆ న్యూస్ దేశవ్యాప్తంగా చర్చనియాంశమైంది.

అశోక్ ఖేమ్క రద్దు చేసిన మ్యూటేషన్ మరేదో కాదు... ఇప్పటికీ ఎటూ తేలని డీఎల్ఎఫ్ కేసు అదే. అది 2007-2008 మధ్య కాలంలో రాబర్ట్ వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థకు డీఎల్ఎఫ్ యూనివర్శల్ లిమిటెడ్ సంస్థకు మధ్య జరిగిన ఒప్పందం. ఆ డీల్ వెనుక ఎన్నో అవకతవకలు ఉన్నాయని హైలైట్ చేస్తూ ఆయన ఆ మ్యుటేషన్ రద్దు చేశారు.

ఇప్పటివరకు ఎన్నో దర్యాప్తు సంస్థలు ఆ కేసును విచారించాయి. కానీ ఆ కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సరిగ్గా 15 రోజుల క్రితం.. అంటే ఏప్రిల్ 15న రాబర్ట్ వాద్రా ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు.

ప్రభుత్వాలు మారినా ఆగని బదిలీలు

సాధారణంగా ఒక అధికారి వల్ల ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఇబ్బందిపడిందంటే, అవతలి పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ అధికారికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది తరచుగా చూస్తుంటాం. రాజకీయాల్లో, బ్యూరోక్రసిలో ఇది ఒక అనధికారిక ఆనవాయితీగా కనిపిస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీని ఇంతలా ఇరకాటంలో పడేసిన ఈ ఐఏఎస్ ఆఫీసర్ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఎందుకంటే హర్యానాలో ప్రభుత్వాలు మారినప్పటికీ అశోక్ బదిలీలు మాత్రం ఆగలేదు.

ఉదాహరణకు, ఎన్టీటీవీ కథనం ప్రకారం ఒక్క ఆర్కైవ్స్ డిపార్టుమెంట్‌కే ఆయన నాలుగు సార్లు బదిలీ అయ్యారు. అందులో మూడుసార్లు బీజేపి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన బదిలీలే. ఆయన మొత్తం కెరీర్లో కొన్నిసార్లు 3 నెలలకే బదిలీ అయితే, ఇంకొన్నిసార్లు అంతకంటే తక్కువే. ఆయన బదిలీల సగటు కాలం మాత్రం 6 నెలలకు మించలేదు. ఏదేమైనా ఈ ఐఏఎస్ అశోక్ ఖేమ్కా అనేది గుర్తుపెట్టుకోవాల్సిన పేరేనండోయ్.

Show Full Article
Print Article
Next Story
More Stories