మహారాష్ట్రలో కొనసాగుతున్న హైడ్రామా

మహారాష్ట్రలో కొనసాగుతున్న హైడ్రామా
x
Highlights

మహారాష్ట్రలో హైడ్రామా కొనసాగుతోంది. క్షణక్షణానికి మారుతోన్న పరిణామాలు థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తున్నాయి. శివసేన-ఎన్సీపీలో పరిణామాలు, బలపరీక్షపై...

మహారాష్ట్రలో హైడ్రామా కొనసాగుతోంది. క్షణక్షణానికి మారుతోన్న పరిణామాలు థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తున్నాయి. శివసేన-ఎన్సీపీలో పరిణామాలు, బలపరీక్షపై బీజేపీ మంతనాలు జరుపుతుంటే విశ్వాస పరీక్షలో ఎలా దెబ్బకొట్టాలంటూ శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ వ్యూహరచన చేస్తున్నాయి. ఇక, అర్ధరాత్రి ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌తో సమావేశమైన డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ బలనిరూపణపై మంతనాలు జరిపారు. అయితే, ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ రెబల్స్ ఎమ్మెల్యేలతోపాటు ఇండిపెండెంట్స్ మద్దతుతో విశ్వాస పరీక్షలో గట్టెక్కేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

ఇక, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటికే, సుప్రీంకోర్టుకు వెళ్లిన శివసేన తమకు 162మంది ఎమ్మెల్యేల బలముందని చెబుతోంది. బీజేపీకి సంఖ్యా బలం లేదని తమకు సంపూర్ణ మెజారిటీ ఉందంటోన్న శివసేన 162మంది ఎమ్మెల్యేలతో ముంబై పార్క్ హయత్ దగ్గర పరేడ్‌కు సిద్ధమవుతోంది. అంతేకాదు, శివసేనకు మద్దతిస్తోన్న ఎమ్మెల్యేల బలాన్ని కావాలంటే చూసుకోమంటూ మహారాష్ట్ర గవర్నర్ ను కోరింది.

ఇదిలాఉంటే, మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపునకు కారణమైన ఎన్సీపీ బహిష్కృత నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో 70వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ నమోదైన ఏసీబీ కేసును మూసివేసింది. మొత్తం 20 కేసులుండగా 9 కేసుల్లో అజిత్‌ పవార్‌కు ఎలాంటి సంబంధం లేదంటూ క్లీన్ చిట్ ఇచ్చింది. కాంగ్రెస్‌-ఎన్సీపీ సంకీర్ణ సర్కారు హయాంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో 70వేల కోట్ల అవినీతి జరిగిందని కేసులు నమోదు అయ్యాయి. అయితే, ఆ కేసులను ఇప్పుడు ఎత్తివేయడంపై శివసేన, కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. కావాలనే, అజిత్‌ పవార్ పై కేసులను మూసివేశారని ఆరోపించారు. అయితే, ఏసీబీ మాత్రం అజిత్‌ పవార్‌‌పై ఉన్న కేసులను మూసివేయలేదని, టెండర్ల అవినీతిపై విచారణ కొనసాగుతోందని చెబుతోంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories