logo
జాతీయం

ఢిల్లీలో బీభత్సం సృష్టించిన అకాల వర్షం

Heavy Rains In Delhi
X

ఢిల్లీలో బీభత్సం సృష్టించిన అకాల వర్షం

Highlights

Delhi: అకాల వర్షాన్ని అంచనా వేయలేకపోయిన శాస్త్రవేత్తలు

Delhi: వానొచ్చినా, వాంతికొచ్చినా ఆగవు అనేది నిజమే. అయితే వాంతి అయ్యే ముందు మన మెదడుకు సూచనలు అందినట్టే... వానొచ్చే ముందు కూడా వాతావరణ విభాగానికి సంకేతాలు అందుతాయి. దాన్ని బట్టే మన ప్రోగ్రాములు ప్లాన్ చేసుకోవడం, అవసరమైన మేరకు మార్పుచేర్పులు చేసుకోవడం జరుగుతుంది. మరి.. మొన్న ఢిల్లీలో అంత సడన్‎గా అంత భారీ వర్షం ఎలా పడింది? భీకరమైన గాలులు ఎలా సంభవించాయి? ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

మొన్న సోమవారం ఢిల్లీని అనుకోని అతిథిలా వరుణుడు చుట్టేశాడు. మధ్యాహ్నం వరకు ఎలాంటి సంకేతాలు కానీ, ఉరుములు, మెరుపులు ఎలాంటి సందడీ కనిపించలేదు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలి వీయడం మొదలైంది. దాని వెనుకే ఉన్నట్టుండి కుండాపోతగా వరుణుడు దంచి కొట్టాడు. గంటకు 100 కిలోమీటర్ల గాలి వేగానికి బలమైన చెట్లు కూడా కూకటి వేళ్లు సహా పెకిలించుకొని నేలకొరిగిపోయాయి. ఫోర్ వీలర్లు చెట్ల కింద చిత్తయిపోయాయి. రోడ్లు బ్లాకైపోయాయి. రవాణా స్తంభించిపోయింది. ఎక్కడివాళ్లు అక్కడే ఆగిపోయారు. కార్యాలయాలకు వెళ్లినవాళ్లు ఇళ్లకు చేరుకోలేకపోయారు. కొన్ని గంటలపాటు వరుణుడు సృష్టించిన బీభత్సానికి ఢిల్లీ ప్రజలు తల్లడిల్లిపోయారు. ఊహించని ఆస్తి నష్టం సంభవించింది.

మరి వాతావరణ విభాగం బానే ఉంది కదా. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం చాలా ముందంజలో ఉన్నాం కదా.. ఈ వర్షపు రాకను ఎందుకను కనిపెట్టలేకపోయాం.. అన్న అనుమానాలు రావడం సహజమే. అయితే ఢిల్లీలోని వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు కూడా వరుణుడు ఈ తీరుగా విజృంభిస్తాడని, ఇంత బీభత్సం సృష్టిస్తాడని అంచనా వేయలేకపోయారట. సోమవారం వాతావరణం ఎలా ఉంటుందో ముందు రోజు.. అంటే ఆదివారమే సూచనలు జారీ చేశారు. కాకపోతే.. ఆకాశం కాస్త మేఘావృతమై ఉంటుందని, చిరుజల్లులు పడే అవకాశం ఉంటుందని చెబుతూ గ్రీన్ అలర్ట్ జారీ చేశారు.

గ్రీన్ అలర్ట్ అంటే వాతావరణంలో అనుకోని మార్పులు సంభవిస్తాయని, ఆకాశం మేఘావృతమై ఉంటుందని, చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం పడవచ్చని, గంటకు 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని... అయినా పనులకు ఇబ్బందులుండవు అనేది సూచిస్తుంది. దీంతో సోమవారం యథాప్రకారం ఉద్యోగులంతా తమ కార్యకలాపాల్లో నిమగ్నమైపోయారు. అయితే ఉన్నట్టుండి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. యెల్లో అలర్ట్ అంటే వాతావరణంలో అనుకోని మార్పులు సంభవిస్తాయని, గాలుల వేగం గంటకు 50 కిలోమీటర్లు ఉంటుందని, ఈ సమాచారాన్ని దృష్టిలో ఉంచుకోవాలనేది మాత్రమే సూచన.

ఈ హెచ్చరిక కూడా అంతగా భయపడాల్సిందేమీ లేదనే చెబుతుంది. ఆ తరువాత సాయంత్రం నాలుగున్నరకు వాతావరణ విభాగం నుంచి మరో హెచ్చరిక జారీ అయింది. అది ఆరెంజ్ అలర్ట్. అంటే గంటన్నరలో రెండో హెచ్చరిక జారీ అయిందన్నమాట. ఇందులో ప్రజలకు సమాచారం కాదు.. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, యాక్షన్‎లోకి వెళ్లిపోవాలని తొందరపెట్టడం ఇందులో ఇమిడి ఉంది. అప్పటివరకూ నింపాదిగా ఉన్న ప్రజలు.. ఉన్నట్టుండి నాలుగున్నరకు ఈ సమాచారం వస్తే ఎటుపోతారు? ఏం చేస్తారు? కాబట్టి సోమవారం రోజున ఢిల్లీ ప్రజలకు కష్టాలు తప్పలేదు.

సోమవారం జరిగే బీభత్సాన్ని వాతావరణ విభాగం అంచనా వేయలేకపోయింది. అందుకు వాళ్లు చెబుతున్నదేంటంటే.. మే నెలతో పాటు జూన్ మాసంలో దాదాపు సగం రోజుల వరకు వాతావరణంలో వేడి తీవ్రత అతి ఎక్కువగా ఉంటుందని, ఈ అతి వేడి కారణంగా కేవలం గంటన్నర, 2 గంటల తేడాతోనే వాతావరణంలో అనూహ్యమైన మార్పులు సంభవిస్తాయని వారంటున్నారు. అందుకే తాము వెదర్ ఫోర్-కాస్ట్ కాకుండా నౌ-కాస్ట్ విడుదల చేశామంటున్నారు. అంటే.. సోమవారం ఉండే వెదర్ కండిషన్‎ను ఆదివారం చెప్పడం ఫోర్-కాస్ట్ అయితే... సోమవారం కండిషన్‎ను అప్పటికప్పుడే ఓ గంట ముందు చెప్పడం నౌ-కాస్ట్ అన్నమాట.

మొన్న 23వ తేదీన ఢిల్లీ, దాని చుట్టపక్కల వర్షం కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మరోవైపు ఎండల తీవ్రత కూడా అదే స్థాయిలో 40 డిగ్రీలకు పైనే నమోదవుతూ వస్తోంది. ఇలా వేడితో పాటు తేమ కూడా ఎక్కువగా ఉండడంతో వాతావరణంలో అతి తొందరగా మార్పులు సంభవిస్తాయని వారంటున్నారు. అందుకే తాము గంటన్నర తేడాతో నౌ-కాస్ట్ విడుదల చేశామంటున్నారు. మిగతా నెలల్లో ప్రిడిక్ట్ చేసే వాతావరణ సూచనలు 95 నుంచి 100 శాతం వరకు కచ్చితత్వాన్ని కలిగి ఉంటే... మే, జూన్ మాసాల్లో అది 80 శాతం వరకే ఉంటుందంటున్నారు. వాతావరణంలో అతి వేడి, అతి ఎక్కువ తేమ వల్ల వేగంగా చోటు చేసుకునే మార్పులను డాప్లర్ రాడార్లు గుర్తించలేవంటున్నారు. అందుకే తాము నౌ-కాస్ట్ ద్వారా ప్రజలకు సమాచారం ఇవ్వడం మినహా చేయగలిగిందేమీ లేదని చేతులెత్తేస్తున్నారు.

Web TitleHeavy Rains In Delhi
Next Story