కేరళలో కుండపోత వర్షాలు.. మునిగిన పలు గ్రామాలు.. స్కూల్స్ కు సెలవులు

Heavy Rain Lashes Kerala schools shut  Red Alert in 3 Districts
x

కేరళలో కుండపోత వర్షాలు.. మునిగిన పలు గ్రామాలు.. స్కూల్స్ కు సెలవులు

Highlights

Kerala: మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్.. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..

Kerala: కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఇడుక్కి, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాల్లో రెడ్‌ అలర్ట్ కొనసాగుతోంది. తిరువనంతపురంతో సహా మరో 12 జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళలోని పలు ప్రాంతాల్లో ఇల్లు, పంటలు దెబ్బతిన్నాయి. కన్నూర్, కాసర్‌గోడ్, ఎర్నాకులం, అలప్పుజా జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. అత్యవసర ఆపరేషన్ సేవలు సిద్ధంగా ఉండాలని కేరళ సీఎం పినరయి విజయన్ ఆదేశాలు జారీ చేశారు. ఇడుక్కి, మలప్పురం, అలప్పుజా, వాయనాడ్, కోజికోడ్, త్రిసూర్, పతనంతిట్ట జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను మోహరించారు.

భారీ వర్షాలకు కేరళలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. దీంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. పలుచోట్ల వర్షం నీరు ఇళ్లను చుట్టుముట్టడంతో జనం అవస్థలు పడుతున్నారు.

తీరప్రాంతంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి చెట్లు నేలకూలాయి. కొన్నిచోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. మరోవైపు భారీ వర్షం కారణంగా ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా ఎర్నాకులం, కన్నూర్, ఇడుక్కి, త్రిసూర్, కొట్టాయం, కాసర్ గోడ్ సహా ఆరు జిల్లాల్లో విద్యాసంస్థలు మూసివేశారు. నిన్న ఒక్కరోజే ఇడుక్కి జిల్లా పీర్మాడేలో 100 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించేందుకు కేరళ రెవెన్యూ మంత్రి రాజన్ అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు రెవెన్యూ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు వర్షం కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

భారీ వర్షం, బలమైన గాలుల కారణంగా కొల్లాం, అలప్పుజా, త్రిసూర్, కొట్టాయం, ఎర్నాకులంతో పాటు పలు జిల్లాల్లో పెద్దఎత్తున వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ చెట్లు కూలడంతో పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

భారీ వర్షాలకు మధ్య కేరళ అంతటా నదుల్లో నీటి మట్టం పెరిగింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. పంబా నది నీటిమట్టం పెరగడంతో పతనంతిట్ట జిల్లా కురుంబన్ ముజిలో గిరిజన కాలనీకి చెందిన వందలాది కుటుంబాలు వరదలో చిక్కుకుపోయాయి. మీనాచిల్ నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కొట్టాయం జిల్లాలోని పలు ప్రాంతాల నివాసితులు ఆందోళనకు గురవుతున్నారు.

మరోవైపు సముద్రం అల్లకల్లోలంగా మారింది. బలమైన గాలుల కారణంగా తీర ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఎర్నాకులం జిల్లా నయారంబాలంలో అలలు భారీ ఎత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో తీర ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా చేపల వేటకు వెళ్లిన ఓ పడవ సముద్రంలో బోల్తాపడింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ సూచించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున హై-రేంజ్ రోడ్లపై అనవసర ప్రయాణాన్ని నివారించుకోవాలని తెలిపారు.

కర్ణాటకలోనూ గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు అనేక ప్రాంతాలను వరద ముంచెత్తింది. మరో ఐదు రోజుల పాటు కేరళ, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ హెచ్చరించారు. దీంతో దక్షిణ కన్నడ ప్రాంతంలోని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని ప్రజలకు సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories