Lockdown in India: లాక్ డౌన్ దిశగా కేంద్రం అడుగులు!

Health Ministry Recommends Lock down
x

Lockdown in India:(File Image) 

Highlights

Lockdown in India: మరోమారు లాక్ డౌన్ పెడితేనే పరిస్థితులు నియంత్రణలోకి వస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ సిఫార్సు చేసినట్లు సమాచారం.

Lockdown in India: రోజు రోజుకూ విజృభిస్తోన్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు లాక్ డౌన్ ఒక్కటే మార్గం అని కేంద్రం భావిస్తోందా అంటే అవునుఅని అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. అదే అంశాన్ని ఆరోగ్య శాఖ కూడా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే... దేశవ్యాప్తంగా దాదాపు 150 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 15 శాతానికి పైగా ఉండటంతో మరోమారు లాక్ డౌన్ పెడితేనే పరిస్థితులు నియంత్రణలోకి వస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ సిఫార్సు చేసింది. లాక్ డౌన్ తో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉన్నప్పటికీ, కరోనా బాధితులకు అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో లాక్ డౌన్ విధించడం మాత్రమే మార్గమని హెల్త్ మినిస్ట్రీ ఉన్నతాధికారులు సూచించారు. అయితే, లాక్ డౌన్ ను మరోమారు విధించే విషయంలో రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం.

కాగా, ఇండియాలో ఏప్రిల్ 5న కరోనా సెకండ్ వేవ్ లో భాగంగా రోజువారీ కేసుల సంఖ్య లక్షను దాటగా, ఆపై 10 రోజుల వ్యవధిలో ఏప్రిల్ 15న రెండు లక్షలకు, మరో వారం రోజుల వ్యవధిలో ఏప్రిల్ 22న 3 లక్షలకు కేసుల సంఖ్య పెరిగింది. అప్పటి నుంచి రోజుకు సరాసరిన దాదాపు మూడున్నర లక్షల కేసులు వస్తూనే ఉన్నాయి. వీటిల్లో 74 శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. మహారాష్ట్రతో పాటు ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, గుజరాత్, కేరళ, కర్ణాటకల్లో కరోనా కరాళనృత్యం కొనసాగుతోంది.

ఈ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కఠిన లాక్ డౌన్ ఆంక్షలు అమలవుతున్నా, మిగతా ప్రాంతాల్లో నిబంధనల అమలు లేకపోవడంతో కేసుల సంఖ్య అనుకున్నట్టుగా తగ్గడం లేదు. లాక్ డౌన్ పెట్టాలన్న ఆలోచన చివరి అస్త్రంగా మాత్రమే ఉండాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయమని, పరిస్థితులను అంతవరకూ తీసుకుని వెళ్లకుండా చూడాలనే భావిస్తున్నామని ఉన్నతాధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ నుంచి అందిన సిఫార్సులపై కేంద్రం ఎలా స్పందింస్తుందో వేచి చూడాల్సి వుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories