Gujarat: గుజరాత్ లో వేడెక్కిన రాజకీయం.. పార్టీల సందడి

Gujarat 2024 Assembly Elections Polls Strategy | Telugu News
x

గుజరాత్ లో వేడెక్కిన రాజకీయం.. పార్టీల సందడి

Highlights

Gujarat: పీకే టీమ్ పైనే కాంగ్రెస్ ఆశలు.. గుజరాత్ లో అప్పుడే ప్రచారం మొదలు పెట్టిన ఆప్

Gujarat: మినీ కురుక్షేత్రానికి సన్నాహాలు మొదలవుతున్నాయి. గుజరాత్ ఎన్నికలకోసం పార్టీల కసరత్తు వేగం పుంజుకుంది. బీజేపీ అడ్డా గుజరాత్ లో గెలుపు కోసం అటు కాంగ్రెస్, ఇటు ఆప్ కత్తులు నూరుతున్నాయి. 2024 లో అధికారం కావాలంటే కమలనాధులకి గుజరాత్ గెలుపు అత్యవసరం మరోవైపు ఈసారైనా గెలవాలని కాంగ్రెస్ ముచ్చటగా మూడో అడుగు వేయాలని ఆప్ సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయమున్నా పార్టీలెందుకు తొందరపడుతున్నాయ్? గుజరాత్ పై ఎవరి వ్యూహమేంటి?

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకోసం మినీయుద్ధం మొదలైపోయింది. ఎన్నికలకు 8నెలలు మాత్రమే ఉండటంతో పార్టీలన్నీగేరు మార్చి స్పీడ్ పెంచాయి. సొంత రాష్ట్రంలో బీజేపి గెలుపుకోసం ప్రధాని మోడీ పకడ్బందీ వ్యూహం రచిస్తున్నారు. 60ఏళ్లు పై బడిన వారిని ఎన్నికలలో పోటీ చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు.ఈసారి కొత్త మొఖాలు,యువతకు ఆస్కారమివ్వాలని బీజేపి హై కమాండ్ ఆలోచిస్తోంది. మాజీ సీఎం విజయ్ రూపానీ లాంటి వారు ఇక రెస్ట్ తీసుకోవలసిందేనని పార్టీ వర్గాలు అంటున్నాయి.

అదే టైమ్ లో గెలుపు గుర్రాలయితే వయసు కాస్త పెద్దదైనా పెద్దగా పట్టించుకోరాదని అధిష్టానం భావిస్తోంది. వచ్చేసార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే ముందు గుజరాత్ లో సంపూర్ణ మెజారిటీతో మళ్లీ గద్దె నెక్కడం బీజేపికి ప్రతిష్టాత్మక సవాల్. ప్రధాని సొంత రాష్ట్రం కూడా కావడంతో అందరి కళ్లూ ఈ రాష్టం మీదే ఉన్నాయి. అందుకే ఎలాంటి ఛాన్స్ తీసుకోరాదని హోం మంత్రి అమిత్ షా పట్టు బిగిస్తున్నారు. అభివృద్ధే ఎజెండాగా బీజేపీ ప్రజల్లోకి వెళ్లబోతోంది.కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని బీజెపి పెద్దలు ఇప్పటికే ఆదేశించారు.

మరోవైపు గుజరాత్ లోనైనా ఈసారి మెరుగైన ఫలితాలు సాధించాలన్న ఉద్దేశంలో ఉన్న కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు గుజరాత్ గెలుపు బాధ్యతలను అప్పగించింది. ఇప్పటికే కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా క్షేత్రస్థాయి రిపోర్ట్ సిద్ధం చేసిన ప్రశాంత్ కిషోర్ గుజరాత్ కే కాదు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు బాధ్యతలను నెత్తికెత్తుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. సీఎం అభ్యర్ధిని ముందే ప్రకటించే ఉద్దేశంలో ఉన్న కాంగ్రెస్ ప్రముఖ వ్యాపార వేత్త,పాటీదార్ కమ్యూనిటీకి చెందిన నరేష్ పటేల్ ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు తెలుస్తోంది. సంఘ సేవకుడిగా పేరున్న నరేష్ పాటిల్ ను ముందుంచి పార్టీ అడుగులేయాలని ప్రశాంత్ కిషోర్ సూచించారు. ఇప్పటికే అంతర్గత సర్వేల్లో నరేష్ పటేల్ పట్ల మంచి ఇమేజ్ ఉన్నట్లు తేలింది. అయితే నరేష్ పాటిల్ పై ఆప్ పార్టీ కూడా కన్నేయడంతో ఆయన ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓటమి భారంతో ఉన్న కాంగ్రెస్ కి గుజరాత్ ఎన్నికలు సవాల్ గా మారాయి. గుజరాత్ లో కాంగ్రెస్ అధికారం కోల్పోయి దాదాపు 28 ఏళ్లు అవుతోంది. గత ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్ ఈసారి మరింత పకడ్బందీగా అడుగులేస్తోంది. జాతీయ పార్టీల హడావుడి ఇలా ఉంటే ఢిల్లీ, పంజాబ్ లలో అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ముచ్చటగా మూడో అడుగు గుజరాత్ లో వేయాలని తహతహలాడుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే 58 సీట్లు గెలుచుకోగలమని ధీమాగా చెబుతోంది ఆప్. ఇప్పటికే కొంత గ్రౌండ్ వర్క్ కూడా ఆపార్టీ పూర్తి చేసేసుకుంది. తిరంగ యాత్ర ద్వారా పార్టీ పటిష్టతకు యాత్రా శంఖారావం పూరించింది ఆప్. పాటీదార్లు, హిందీ మాట్లాడే వలసకూలీలు, మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండే అహ్మదాబాద్ నుంచి ఆప్ యాత్ర మొదలైంది.

పంజాబ్ లో పార్టీ విస్తరణ, ఎన్నికల విజయానికి పని చేసిన సందీప్ పాఠక్ నే గుజరాత్లోనూ ఆప్ ప్రయోగిస్తోంది. ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్ అయిన పాఠక్ గ్రౌండ్ వర్క్ లో దిట్ట. గుజరాత్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, పంజాబ్ లో మాదిరి నిశ్శబ్ద విప్లవం రానుందని ఆపార్టీ ధీమాగా చెబుతోంది. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో గత ఎన్నికల్లో బీజేపీకి99 సీట్లు రాగా, కాంగ్రెస్77 సీట్లు గెలుచుకుంది.మరి ఈసారి ప్రతిపక్ష హోదా ఎవరికి దక్కుతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories