Top
logo

భారీ స్థాయిలో ప్రభుత్వ బ్యాంకుల విలీనం..ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందా ?

భారీ స్థాయిలో ప్రభుత్వ బ్యాంకుల విలీనం..ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందా ?
Highlights

ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో మరో సంచలనం చోటు చేసుకుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మెగా మెర్జర్...

ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో మరో సంచలనం చోటు చేసుకుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మెగా మెర్జర్ ప్రకటించారు. మరి ఈ విధమైన సంఘటితం ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేస్తుందా? 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించగలుగుతామా ? బ్యాంకింగ్ నిర్వహణలో మెరుగుదల సాధించగలమా లాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు తెరపైకి వచ్చాయి.

1969 జూలై 19న నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించిన బ్యాంకుల జాతీయీకరణ ఎంతో సంచలనం కలిగించింది. ఒక యాభై ఏళ్ళ తరువాత అలాంటి సంచలనమే మరోసారి చోటు చేసుకుంది. ప్రభుత్వ రంగంలో కొత్త కొత్త బ్యాంకులను ఏర్పరిచే ధోరణి పోయి ఉన్నవాటిని సంఘటితం చేసే ధోరణి మొదలైంది. ఇప్పుడిక అందరి దృష్టి కూడా ఈ సంఘటితం ఎలాంటి ఫలితాలను అందిస్తుందన్న అంశంపైనే ఉంది.

కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తరువాత ప్రభుత్వ బ్యాంకింగ్ రంగాన్ని సంఘటితం చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. 2017 ఏప్రిల్ లో ఐదు అసోసియేట్ బ్యాంకులను, భారతీయ మహిళా బ్యాంకును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారు. 2019 ఏప్రిల్ లో దేనా బ్యాంక్, విజయా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాతో విలీనం చేశారు. ఈ విలీనాలు ఆశించిన ఫలితాలు అందించడంతో ఆ విషయంలో ప్రభుత్వం మరింత ముందుకు వెళ్ళింది. అందులో భాగంగానే తాజాగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భారీ స్థాయిలో ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనాన్ని ప్రకటించారు.

తాజా విలీన ప్రయత్నంలో పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా మార్చనున్నారు. ఈ ప్రతిపాదనకు పరిశ్రమ వర్గాల నుంచి కూడా సానుకూల స్పందన వ్యక్తమైంది. ఈ చర్య దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ప్రభావపూరితం చేస్తుందని, వ్యవస్థలోకి మరింత సామర్థ్యాన్ని తీసుకురాగలదన్న భావనలు వ్యక్తమయ్యాయి. బ్యాంకులను ఈవిధంగా విలీనం చేయడంతో మరింత పెద్దవైన పటిష్ఠ బ్యాంకులు ఏర్పడుతాయి. నిర్వహణ వ్యయాలు తగ్గడం, సామర్థ్యం పెరగడం లాంటి తక్షణ ఫలితాలను మనం చూడగలుగుతాం. మరో వైపున ఆయా బ్యాంకులకు ప్రభుత్వం ఏటా అందించే మూలధనం సమర్థంగా వినియోగం అయ్యేందుకు కూడా తోడ్పడుతుంది. అదే సమయంలో స్వల్పకాలికంగా చూస్తే మాత్రం మొదట్లో వివిధ రకాల ప్రావిజన్ల కారణంగా కొంత ప్రతికూల ఫలితాలు కనిపించే అవకాశం కూడా ఉంది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ ఆశయాల సాధనలో కీలకం కానుంది. 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశలో ఇది ముందడుగుగా చెప్పవచ్చు.

ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశవ్యాప్త ఉనికి కలిగిఉన్నాయి. ప్రతీ నగరంలోనూ వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్నో బ్రాంచీలను కలిగిఉన్నాయి. విలీన ప్రక్రియతో ఈ బ్రాంచీల సంఖ్య తగ్గి నిర్వహణ వ్యయం తగ్గనుంది. దీంతో ప్రైవేటు రంగ బ్యాంకులకు అవి గట్టి పోటీ కూడా ఇవ్వగలుగుతాయి. టెక్నాలజీ ప్లాట్ ఫామ్ లను ఉపయోగించుకోవడం, నిరర్ధక ఆస్తులు, నిధుల కేటాయింపు లాంటి అంశాలన్నీ కూడా విలీనం తరువాత ఆవిర్భవించే పెద్ద బ్యాంకులకు సానుకూల అంశాలుగానే మారుతాయి. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెరుగుతుంది. పది బ్యాంకులు కలసి 4 బ్యాంకులుగా ఏర్పడితే ఖాతాల సంఖ్య పెరుగుతుంది, వ్యయ-ఆదాయ నిష్పత్తి తగ్గుతుంది.

ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ లను పంజాబ్ నేషనల్ బ్యాంక్ తో విలీనం చేయడంతో అది రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు కానుంది. ఇలాంటివే మరెన్నో విశేషాలు ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో చోటు చేసుకోనున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ పటిష్టంగా ఉండడం ఎంతో ముఖ్యం. ఈ విలీన ప్రక్రియ దాన్ని అందించే అవకాశం ఉంది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అందుకు అవి చెబుతున్న ప్రధాన కారణం నేటికీ ఎంతో మంది బ్యాంకింగ్ సేవలకు దూరంగానే ఉన్నారని. విలీనాలు జరిగే సందర్భాల్లో పలు శాఖలు, కార్యాలయాలు మూతపడడం సహజమే. మరో వైపున సిబ్బంది జీతభత్యాలు, హెచ్ ఆర్ విధానాలు లాంటివి బ్యాంకింగ్ సిబ్బందిపై ప్రభావం కనబరుస్తాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో వివిధ మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. అలాంటి మార్పులను అడ్డుకోలేం. కాకపోతే ఆ మార్పులు మంచివి కావనుకుంటే ఆ వేగాన్ని కాస్తంత తగ్గించడమే మనం చేయగలిగింది. బ్యాంకుల విలీన ప్రక్రియ కూడా అలాంటిదే. అతిపెద్ద, పటిష్ఠ బ్యాంకులు నేటి అవసరం. నేడు చైనాకు చెందిన బ్యాంకులు అంతర్జాతీయ స్థాయిలో కీలకంగా ఉన్నాయి. అలాంటి బ్యాంకుల అవసరం మనకు ఉంది. ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా పెరిగిపోతున్న డిజిటలైజేషన్ ఆ సమస్యలను పరిష్కరిస్తుందనే ఆశిద్దాం. విలీన ప్రక్రియ భారతీయ బ్యాంకింగ్ రంగానికి నూతన జవసత్వాలు అందించగలదని ఆశిద్దాం.

Next Story