గోవా కాంగ్రెస్‌లో ముసలం.. కమలం తీర్థానికి 9 మంది ఎమ్మెల్యే రెడీ?

Goa Congress MLAs May Join BJP Soon | Goa News
x

గోవా కాంగ్రెస్‌లో ముసలం.. కమలం తీర్థానికి 9 మంది ఎమ్మెల్యే రెడీ?

Highlights

Goa Congress: హోటల్‌ గ్రేస్‌ మెజిస్టిక్‌కు చేరిన కాంగ్రెస్‌ రెబల్స్‌

Goa Congress: సంస్కరణలు చేపడుతున్నా కాంగ్రెస్‌లో వలసలు ఆగడం లేదు. తాజాగా గోవా కాంగ్రెస్‌లో ముసలం మొదలయ్యింది. ఆ రాష్ట్రంలో హస్తం పార్టీ మనుగడకే ముప్పు ఏర్పడింది. 11 మందిలో 9 మందికి ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. వారు ఇప్పటికే హోటల్‌ గ్రేస్‌ మెజిస్టిక్‌లో సమావేశమయ్యారు. ఆ 9 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరవచ్చని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఫిరాయింపులను అడ్డుకునేందుకు రాష్ట్ర పార్టీ చీఫ్‌ గుండూరావు దినేష్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తప్పవంటూ కాంగ్రెస్‌ అధిష్ఠానం హెచ్చరిస్తోంది. గోవా అసెంబ్లీ సమావేశాల సమయంలో రాజకీయ సమీకరణలు మారడం అక్కడ చర్చనీయాంశంగా మారింది.

హోటల్‌ గ్రేస్‌ మెజిస్టిక్‌లో మాజీ సీఎం దిగంబర్‌ కామత్‌తో పాటు, మైకెల్‌ లోబో యూరీ లెమావో, డెలైలా లోబో, అలెక్స్‌ సికారెరో, కేదార్‌ నాయక్‌, రాజేష్‌ ఫల్దేశాయ్‌ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తాము ఎలాంటి సమావేశాలు నిర్వహించడం లేదని కేవలం హోటల్‌కు వచ్చినట్టు ఎమ్మెల్యే అలెక్స్‌ సికారెరో తెలిపారు. బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోందన్న ప్రశ్నకు బయట ఎన్నో ప్రచారమవుతాయని రూమర్స్‌ను పట్టించుకుంటే ఎలా? అంటూ ప్రశ్నించారు. అయితే హోటల్‌లో మాత్రం ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్టు చెప్పారు. తాను తన కోసమే పని చేస్తానని ఇతరుల కోసం పని చేయనన్నారు. పార్టీ అధిష్ఠానం నుంచి తమకు ఎలాంటి కాల్స్ రాలేదని అలెక్స్‌ సికారెరో స్పష్టం చేశారు.

ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఎన్నికల్లో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దిగంబర్‌ కామత్‌ను అధిష్ఠానం ప్రకటించింది. అయితే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిర్వహించిన ఎమ్మెల్యేల సమావేశానికి కామత్‌ గైర్హాజరయ్యారు. అయితే తాను సూచించిన మైకెల్‌ లోబోను శాసనసభా పక్ష నేతగా ప్రకటించకపోవడంతో కలత చెందినట్టు తెలుస్తోంది. ఎన్నికల ముందు సీటు రాకపోవడంతో.. మైకెల్‌ లోబో బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఇప్పుడు కమలనాథులతో మైకెల్‌ టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీలోకి చేరుతారనే ఉహాగానాలపై ఎమ్మెల్యే దిగంబర్‌ కామత్‌ స్పందించారు. ఇలాంటి ప్రచారం చాలాకాలంగా ఉందన్నారు. తాను ఇంట్లోనే ఉన్నట్టు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories