Uttar Pradesh: టాయిలెట్‌లో క్రీడాకారులకు భోజనాలు

Food Served to Kabaddi Players in Toilets in Uttar Pradesh | UP News
x

Uttar Pradesh: టాయిలెట్‌లో క్రీడాకారులకు భోజనాలు

Highlights

ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్ జిల్లాలో దారుణ ఘటన

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌‌లో కబడ్డీ ప్లేయర్లకు బాత్రూంలో భోజనాలు పెట్టడం పెను వివాదానికి దారితీసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌ నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడా టోర్నమెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలికలకు టాయిలెట్లలో అధికారులు భోజనాలు ఏర్పాట్లు చేశారు. దీంతో వారు ఇబ్బంది పడుతూనే భోజనం చేశారు. స్థలం లేకపోవడంతోనే ఇలా చేశామని అధికారులు వివరణ ఇవ్వడం గమనార్హం.

సహరన్‌పుర్ జిల్లాలో ఈ నెల 16వ తేదీన అండర్‌-17 బాలికల కబడ్డీ టోర్నమెంట్‌ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200 మంది క్రీడాకారిణులు ఈ టోర్నీలో పాల్గొన్నారు. అయితే ఈ పోటీల సమయంలో తమకు స్టేడియం టాయిలెట్‌లో భోజనాలు ఏర్పాటు చేసినట్లు కొందరు జూనియర్‌ ఆటగాళ్లు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటికొచ్చాయి. టాయిలెట్‌ గదిలో అన్నం, పప్పు, కూరల పాత్రలు ఉండగా అందులో నుంచి అమ్మాయిలు వడ్డించుకున్నట్లు వీడియోలో ఉంది.

అయితే ఈ వ్యవహారంపై సహరన్‌పుర్‌ క్రీడా అధికారి అనిమేశ్‌ సక్సేనా స్పందించారు. భోజనాలను టాయిలెట్‌లో ఏర్పాటు చేయలేదని, తప్పనిసరి పరిస్థితుల్లో వంట పాత్రలను 'ఛేంజింగ్‌ రూం'లో పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. స్టేడియం నిర్మాణ దశలో ఉందని.. వర్షం కారణంగా వంట పాత్రలు పెట్టేందుకు స్థలం లేకపోవడంతో స్విమ్మింగ్‌ పూల్‌ పక్కనే ఉన్న ఛేంజింగ్‌ రూంలో పెట్టామని సక్సేనా చెప్పడం గమనార్హం.

Show Full Article
Print Article
Next Story
More Stories