ఉత్తరాఖండ్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు

ఉత్తరాఖండ్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు
x
Highlights

*సహాయక చర్యల్లో ఇండో-టిబెటిన్ సరిహద్దు పోలీసులు *సహాయక చర్యలకు ఆర్మీ హెలికాప్టర్ల వినియోగం *ఉత్తరాఖండ్‌కు 4 కాలమ్స్ ఆర్మీ, రెండు వైద్య బృందాలు, ఇంజనీరింగ్ టాస్క్‌ఫోర్స్

ఊహించని పెనువిపత్తు మరోసారి ఉత్తరాఖండ్‌లో కల్లోలం సృష్టించింది. భారీ మంచు చరియలు విరిగి పడడంతో ఒక్కసారిగా ధౌలీగంగా నది ఉప్పొగింది. దీంతో రైనీ తపోవన్ గ్రామం దగ్గర ఉన్న పవర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. ఆ సమయంలో పవర్ ప్రాజెక్టులో ఉన్న 150 మంది వరద ఉధృతిలో కొట్టుకుపోయారు. దాంతోపాటు.. నదిని ఆనుకుని ఉన్న పలు గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

మరోవైపు.. పవర్ ప్రాజెక్టులో గల్లంతయిన 150 మంది కార్మికుల్లో ముగ్గురి మృతదేహాలను సహాయక బృందాలు గుర్తించాయి. మరో 147 మంది కోసం తీవ్రంగా గాలింపును ముమ్మరం చేశారు. అటు.. తపోవన్ డ్యామ్ దగ్గర 16 మందిని సహాయక బృందాలు రక్షించాయి. అయితే.. పవర్ ప్రాజెక్టులో గల్లంతయిన వారు మొత్తం మృతి చెంది ఉంటారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఊహించని విపత్తుతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ప్రభుత్వం రంగంలోకి దింపింది. నాలుగు కాలమ్స్ ఆర్మీ, రెండు మెడికల్ బృందాలు, ఒక ఇంజినీరింగ్ టాస్క్‌ఫోర్స్‌ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అలాగే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల కోసం రెండు విమానాలు ఆర్మీ ఏర్పాటు చేసింది. అవసరమైతే మరిన్ని విమానాలను పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తెలిపింది.

మరోవైపు.. ధౌలిగంగా నదీ తీరానికి వెళ్లొద్దని స్థానికులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వరద ఉధృతి మరోసారి పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నదీ తీరంలో ఆక్షలు విధించారు. అటు సహాయక చర్యలను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఘటనాస్థలంలో సీఎంతో పాటు చమోలి జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా ఉన్నారు. ఘటనపై సీఎం రావత్‌కు ఫోన్ చేసిన అమిత్ షా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.

ఇక.. ఉత్తరాఖండ్ పెను విపత్తుపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. భారతదేశం యావత్తూ ఉత్తరాఖండ్ వెంట అండగా నిలుస్తుందని ట్వీట్ చేశారు. అలాగే.. వీలైనంత త్వరగా సహాయకచర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories