Exit Poll 2023: ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. హోరెత్తుతున్న ఎగ్జిట్ పోల్‌ సర్వేలు

Five State Elections Exit Poll 2023
x

Exit Poll 2023: ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. హోరెత్తుతున్న ఎగ్జిట్ పోల్‌ సర్వేలు   

Highlights

Exit Poll 2023: రాజస్థాన్‌లో బీజేపీకే ఎడ్జ్‌ ఇచ్చిన సర్వేలు.. మిగతా 4 రాష్ట్రాల్లో సర్వేలన్నీ గందరగోళం

Exit Poll 2023: తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌, రాజస్థాన్‌, మిజోరాం అసెంబ్లీలకు పోలింగ్‌ ముగిసింది. తెలంగాణ మినహా.. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ముందే పోలింగ్‌ అయిపోయింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు వచ్చిన ఈ ఎలక్షన్స్‌ను సెమీ ఫైనల్‌గా అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏయే రాష్ట్రాలో అధికారం ఎవరికి దక్కుతుందో? అన్న చర్చ మొదలైంది. ఇప్పటికే దీనికి సంబంధించి పలు ఏజెన్సీలు తమ అంచనాలను వెలువరించాయి. అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి? కొత్తగా అధికారం ఎవరు దక్కించుకుంటారు? ఎవరు అధికారాన్ని కోల్పోతున్నారు?

2024 సార్వత్రిక ఎన్నికల ముందు... ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు అందరిలోనూ ఆసక్తి రేపుతున్నాయి. తాజా తెలంగాణ పోలింగ్‌ ముగియడంతో.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తోందోన్న చర్చ ఊపందుకుంది. అదే సమయంలో ఐదు రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్స్‌ ఆధారంగా ఏ పార్టీకి అధికారం దక్కుతుందో అంచనాలను వెల్లడించాయి. మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్యనే పోటీ నెలకొంది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య పోటీ నెలకొనగా, మిజోరాంలో మాత్రం స్థానిక పార్టీలు ఎంఎన్‌‌ఎఫ్‌, జెడ్‌పీఎం పార్టీలు ప్రధానంగా తలపడుతున్నాయి.

ఆయా రాష్ట్రాల్లో తాజాగా వెలువరించిన ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలను పరిశీలిద్దాం. ముందుగా మధ్యప్రదేశ్‌ను చూస్తే.. ఈ రాష్ట్రంలో 230 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 116 స్థానాలు. అయితే బీజేపీకి 100 నుంచి 123, కాంగ్రెస్‌కు 102 నుంచి 125, ఇతరులకు 5 స్థానాలు వస్తాయని జన్‌కీ బాత్‌ అంచనా వేసింది. రిపబ్లిక్‌ టీవీ, మాట్రిజ్‌ సర్వే ప్రకారం.. బీజేపీకి 118 నుంచి 130, కాంగ్రెస్‌కు 97 నుంచి 107, ఇతరులకు సున్నా నుంచి 2 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. టీవీ9 భారత్‌వర్ష్‌-పోల్‌స్ట్రాట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే ప్రకారం.. బీజేపీకి 106 నుంచి 116, కాంగ్రెస్‌కు 111 నుంచి 121, ఇతరులకు సున్నా నుంచి 6 స్థానాలు వచ్చే అవకాశం ఉంది.

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో 119 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టాలంటే.. 100 సీట్లను సాధించాల్సి ఉంటుంది. అయితే జన్‌ కీ బాత్‌ నిర్వహించిన సర్వేలో బీజేపీకి 100 నుంచి 122 స్థానాలు, కాంగ్రెస్‌కు 62 నుంచి 85, ఇతరులు 15 నుంచి 15 స్థానాలు సాధించే అవకాశం ఉంది. టీవీ9 భారత్‌వర్స్‌, పోల్‌స్ట్రాట్‌ సర్వే ప్రకారం.. బీజేపీకి 100 నుంచి 110, కాంగ్రెస్‌కు 90 నుంచి 100, ఇతరులకు 5 నుంచి 15 స్థానాలు దక్కించుకోనున్నట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న మరో రాష్ట్రం చత్తీస్‌గడ్‌. ఈ రాష్ట్రంలో 90 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ అధికారం చేపట్టాలంటే.. 46 సీట్లు సాధించాల్సి ఉంటుంది. చత్తీస్‌గడ్‌ పోల్‌ సర్వేలపై ఎక్కువ సంస్థలు దృష్టి సారించాయి. ఏబీపీ న్యూస్‌-సీవోటర్ నిర్వహించిన సర్వేలో బీజేపీకి 36 నుంచి 48, కాంగ్రెస్‌కు 41 నుంచి 53, ఇతరులకు సున్నా నుంచి 6 స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. ఇండియా టుడే - యాక్సస్‌ మై ఇండియా సర్వేలో బీజేపీకి 36 నుంచి 46, కాంగ్రెస్‌కు 40 నుంచి 50, ఇతరులకు 1 నుంచి 5 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. జన్‌ కీ బాత్‌ సర్వేలో బీజేపీకి 34 నుంచి 45, కాంగ్రెస్‌కు 42 నుంచి 53, ఇతరులకు మూడు స్థానాలు లభించే అవకాశం ఉంది. ఇవే కాదు.. ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్‌, రిపబ్లిక్‌ టీవీ-మాట్రిజ్‌, టీవీ9 భారత్‌వర్ష్‌-పోల్‌ స్ట్రాటజీలు కూడా దాదాపు అలాంటి ఫలితాలనే వెల్లడించాయి. న్యూస్‌24-టుడేస్‌ చాణక్య మాత్రం కాంగ్రెస్‌కు పక్కా ఎడ్జ్ ఉన్నట్టు వెల్లడించింది.

మిజోరాంలో 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ అసెంబ్లీకి 21 మ్యాజిక్ ఫిగర్. ఈ రాష్ట్రంలో జాతీయ పార్టీల కంటే.. లోకల్‌ పార్టీల మధ్యే హోరాహోరీగా ఉంటాయని సర్వేలు చెబుతున్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అక్కడి లోకల్ పార్టీలకు మద్దతు ఇస్తాయి. ఎంఎన్‌ఎఫ్‌ పార్టీకి 14 నుంచి 18, జెడ్‌పీఎం పార్టీకి 12 నుంచి 16, కాంగ్రెస్‌కు 8 నుంచి 10, బీజేపీకి సున్నా నుంచి 2 స్థానాలు వస్తాయని ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్‌ సర్వే వెల్లడించింది. ఇక ఎంఎన్ఎఫ్ పార్టీకి 10 నుంచి 14, జె‌డ్‌పీఎంకు 15 నుంచి 25, కాంగ్రెస్‌కు 5 నుంచి 9, బీజేపీకి సున్నా నుంచి 2 స్థానాలు దక్కే అవకావం ఉందని జన్‌కీ బాత్‌ వెల్లడించింది. ఓవరాల్‌గా చూస్తే.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్ మినహా ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదని సర్వేలు చెబుతున్నాయి. అయితే సర్వేలన్నీ నిజం అవుతాయని చెప్పలేము. అంతిమంగా ఓటరు తీర్పే అసలైనది.

Show Full Article
Print Article
Next Story
More Stories