ISRO: నేడు నింగిలోకి తొలి ప్రైవేట్‌ రాకెట్‌ ప్రయోగం

First Private Rocket Launch Today
x

ISRO: నేడు నింగిలోకి తొలి ప్రైవేట్‌ రాకెట్‌ ప్రయోగం

Highlights

ISRO: ఉ. 11:30 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనున్న రాకెట్‌

ISRO: ఒక్కో మెట్టూ ఎక్కుతూ.. ప్రపంచవ్యాప్తంగానే కాకుండా.. ఇతర గ్రహాలపైనా తన మార్క్ చూపించిన ఇస్రో.. ఇవాళ మరో కొత్త అంకానికి తెరతీస్తోంది. తొలిసారిగా ప్రైవేట్ రాకెట్‌ను ప్రయోగించబోతోంది. దీంతో అమెరికా నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలకు ఇస్రో మరింత గట్టి పోటీ ఇవ్వనుంది.

ఒకప్పుడు సైకిళ్లపై రాకెట్ విడి భాగాలను తీసుకెళ్లిన ఇస్రో..ప్రపంచమే ఆశ్చర్యపోయేలా.. ప్రైవేట్ రాకెట్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించబోతోంది. దీని వల్ల రోదసీ వాణిజ్యంలో ఇస్రో మరో భారీ అడుగు వేసినట్లవుతుంది.

హైదరాబాద్‌లోని స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సంస్థ సొంతంగా విక్రమ్‌-S రాకెట్ తయారుచేసింది. దాన్ని శ్రీహరికోటలోని షార్‌ నుంచి ఉదయం 11గంటల 30నిమిషాలకు నింగిలోకి పంపబోతోంది. ప్రైవేట్ రంగంలో ఇది మొదటి ప్రయోగం కాబట్టి దీన్ని ప్రారంభ్‌ మిషన్‌ అని పిలుస్తున్నారు. దీన్ని విజయవంతం చేయడం ద్వారా ఇస్రో.. చరిత్రలో మరో అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించినట్లు అవుతుంది.

భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్‌ సారాబాయికి నివాళిగా రాకెట్‌కు విక్రమ్‌-S' అని పేరుపెట్టారు. ఇది 545 కేజీల బరువు ఉంటుంది. అంటే దాదాపు 3 బైకులతో సమానం. రాకెట్ పొడవు 6 మీటర్లు. ఇది నింగిలో 81.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్తుంది. తర్వాత యూటర్న్ తీసుకొని.. శ్రీహరికోటకు 115 కిలోమీటర్ల దూరంలో.. సముద్రంలో పడిపోతుంది.

ఈ రాకెట్ ద్వారా 3 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపుతారు. వాటిలో ఒకటి చెన్నైలోని ఏరోస్పేస్‌ స్టార్టప్‌ స్పేస్‌కిడ్స్‌ తయారుచేసిన 2.5 కేజీల శాటిలైట్ ఫన్‌-శాట్‌ కాగా.. మిగతా రెండూ విదేశీ శాటిలైట్లు. ఈ రాకెట్ ప్రయోగానికి ప్రస్తుతం వాతావరణం అత్యంత అనుకూలంగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories