FASTag: ఫాస్టాగ్‌పై కేంద్రం శుభవార్త.. వాహనదారులకు భారీ ఊరట

FASTag
x

FASTag: ఫాస్టాగ్‌పై కేంద్రం శుభవార్త.. వాహనదారులకు భారీ ఊరట

Highlights

FASTag: జాతీయ రహదారులపై ప్రయాణించే లక్షలాది మంది వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

FASTag: జాతీయ రహదారులపై ప్రయాణించే లక్షలాది మంది వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కార్లు, జీపులు, వ్యాన్‌లకు సంబంధించిన ఫాస్టాగ్‌లకు ఇప్పటివరకు అమల్లో ఉన్న ‘నో యువర్ వెహికల్’ (KYV) ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ప్రకటించింది. ఈ కొత్త నిబంధన ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది.

ఫాస్టాగ్ యాక్టివేషన్ అనంతరం కేవైవీ పేరుతో ఎదురవుతున్న జాప్యం, సాంకేతిక సమస్యలను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. వాహనానికి సంబంధించిన అన్ని సరైన పత్రాలు ఉన్నప్పటికీ, కేవైవీ అప్‌డేట్ కాలేదన్న కారణంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని, తాజా నిర్ణయంతో ఆ సమస్యలకు ముగింపు పలికినట్టేనని పేర్కొంది.

ఈ మినహాయింపు కొత్తగా జారీ చేసే ఫాస్టాగ్‌లకే కాకుండా, ఇప్పటికే వినియోగంలో ఉన్న ఫాస్టాగ్‌లకు కూడా వర్తిస్తుందని NHAI స్పష్టం చేసింది. అయితే ఫాస్టాగ్ దుర్వినియోగం, తప్పుగా జారీ చేయడం వంటి నిర్దిష్ట ఫిర్యాదులు వచ్చిన సందర్భాల్లో మాత్రమే కేవైవీ ప్రక్రియ అమలు చేస్తామని తెలిపింది. ఎలాంటి ఫిర్యాదులు లేని పాత ఫాస్టాగ్‌లకు ఇకపై కేవైవీ తప్పనిసరి కాదని పేర్కొంది.

వినియోగదారులకు సులభమైన సేవలు అందిస్తూనే, వ్యవస్థలో పారదర్శకత, కచ్చితత్వాన్ని పెంచడమే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు NHAI వెల్లడించింది. ఇకపై ఫాస్టాగ్ యాక్టివేషన్‌కు ముందే వాహన్ డేటాబేస్ ద్వారా వాహన వివరాలను ధృవీకరించాలని బ్యాంకులకు కఠిన ఆదేశాలు జారీ చేసింది.

ఒకవేళ వాహన్ పోర్టల్‌లో వాహన వివరాలు అందుబాటులో లేకపోతే, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) ఆధారంగా ధృవీకరణ పూర్తయ్యాకే ఫాస్టాగ్ యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో విక్రయించే ఫాస్టాగ్‌లకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మార్పులతో వెరిఫికేషన్ బాధ్యత పూర్తిగా బ్యాంకులపైనే ఉంటుందని, వినియోగదారులకు ఇబ్బందులేని ప్రయాణ అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని NHAI తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories