Delhi Chalo March: రేపు ఢిల్లీ చలో మార్చ్‌కు రైతు సంఘాల పిలుపు.. భద్రత కట్టుదిట్టం

Farmers Unions have Called for a Chalo March in Delhi tomorrow
x

Delhi Chalo March: రేపు ఢిల్లీ చలో మార్చ్‌కు రైతు సంఘాల పిలుపు.. భద్రత కట్టుదిట్టం

Highlights

Delhi Chalo March: 2 వేల ట్రాక్టర్లతో 20వేల మంది రైతులు వచ్చేలా ప్లాన్‌

Delhi Chalo March: కనీస మద్దతు ధరకి చట్టబద్ధత, రైతులపై కేసుల ఎత్తివేత డిమాండ్లతో ఉత్తరాది రాష్ట్రాల రైతులు మరోసారి ఢిల్లీ బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. రేపు ఢిల్లీ చలో మార్చ్‌కు రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీ బార్డర్లలో పోలీసులు భారీగా మోహరించారు. పలు చోట్ల 144 సెక్షన్ విధించారు. బారికేడ్లతో రోడ్లను మూసివేశారు. హర్యానాలోకి శంభూ వద్ద రాష్ట్ర సరిహద్దును పోలీసులు మూసివేశారు. రోడ్డుపై కాంక్రీట్ బ్లాకులు, ఇసుక బస్తాలు, ముండ్ల కంచెలు, మేకులు ఏర్పాటు చేశారు.

మంగళవారం చేపట్టనున్న ఢిల్లీ చలో మార్చ్’కు భారీగా తరలిరావాలంటూ సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ యూనియన్ నేతలు పిలుపునిచ్చారు. పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి దాదాపు 200 సంఘాల ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీకి వచ్చే అవకాశాలున్నాయి. గతంలో కంటే భారీగా, డిమాండ్లు పరిష్కారం అయ్యే దాకా ఆందోళన విరమించకుండా పోరాటం చేయాలని డిసైడ్ అయ్యారు. ఢిల్లీ బార్డర్లలోనే తిష్ట వేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఢిల్లీ చలో మార్చ్​లో దాదాపు 2 వేల ట్రాక్టర్లతో 20 వేల మంది రైతులు నిరసనల్లో పాల్గొనేలా ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కేరళ, కర్నాటక నుంచి కూడా రైతులు ఢిల్లీకి చేరుకున్నట్లు హెచ్చరించాయి. ముందస్తుగా ఢిల్లీలోకి వేర్వేరుగా ఎంటరై మంగళవారం ఒక్కసారిగా ప్రధాని, మంత్రులు, బీజేపీ నేతలు, వీఐపీల ఇండ్ల ముందు నిరసనలు తెలిపేలా ప్లాన్ చేసినట్టు అంచనా వేస్తున్నారు అధికారులు.

రైతుల ఢిల్లీ చలో మార్చ్ నేపథ్యంలో నార్త్ ఈస్ట్ ఢిల్లీలో 144 సెక్షన్ విధించినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ జాయ్ టిర్కీ వెల్లడించారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూసేందుకు భారీగా పోలీసులను మోహరించినట్లు తెలిపారు. అనుమతి లేకుండా ఆందోళనకారులు వస్తే.. అడ్డుకుంటామని చెప్పారు. తుపాకులు, కత్తులు, రాడ్లు, కట్టెల వంటివి తీసుకొస్తే వెంటనే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. మరోవైపు రైతులు ముందుకు దూసుకుని వస్తే.. టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించేలా డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. నార్త్ ఢిల్లీలోని ఒక ఓపెన్ ఏరియాలో పోలీసులు వరుసగా నిలబడి టియర్ గ్యాస్ షెల్స్ పేలుస్తున్న వీడియో తాజాగా మీడియాలో వైరల్ అయింది.

ఇక రైతులు నిరసనలు విరమించేలా ఇప్పటికే ఓ దఫా చర్చలు జరపగా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం చర్చలకు రావాలంటూ రైతు సంఘాల నేతలకు కేంద్రం పిలుపునిచ్చింది. అయితే ఢిల్లీ చలో మార్చ్ చేసి తీరుతామని ఆ తర్వాతే ప్రభుత్వంతో చర్చలంటూ రైతు సంఘాల నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories