logo
జాతీయం

కేంద్రం తీసుకొచ్చిన మూడు బిల్లులపై వివరణ.. నష్టమేనంటున్న పలు రాష్ట్రాలు, రైతు సంఘాలు

కేంద్రం తీసుకొచ్చిన మూడు బిల్లులపై వివరణ.. నష్టమేనంటున్న పలు రాష్ట్రాలు, రైతు సంఘాలు
X
Highlights

ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన మూడు బిల్లులపై ఏకాభిప్రాయం రావడం లేదు.

ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన మూడు బిల్లులపై ఏకాభిప్రాయం రావడం లేదు. వీటి వల్ల కార్పోరేట్ వ్యవసాయానికి నాంది పలుకుతున్నారని కొన్ని పార్టీలు అంటుంటగా, కేంద్రం తన కిష్టమొచ్చిన చోట అమ్ముకోవచ్చని చెబుతోంది. అయితే దేశ వ్యాప్తంగా ఉన్న 86 శాతం మంది చిన్న, సన్నకారు రైతులు తాము పండించిన ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్మకం చేసే స్థోమత ఉంటుందా ? అనేది ప్రశ్న. ఇదే కాకుండా మార్కెట్ కమిటీలు వంటి ప్రభుత్వ స్థాయి మధ్యవర్థి లేనిపక్షంలో వ్యాపారులు తమ కిష్టమొచ్చిన రీతిలో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది, ఒక్కోసారి వీరంతా ఏకంగా సిండికేట్ గా మారి, ధరలను నియంత్రించవచ్చని రైతులు గగ్గోలు పెడుతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు బిల్లులపై వివరణ ఇలా.....

కేంద్రప్రభుత్వం వ్యవసాయరంగంలో తీసుకొచ్చిన మూడు బిల్లులు.. రైతన్నను నిండా ముంచేలా ఉన్నాయని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. వాళ్ల కడుపుకొట్టి కార్పొరేట్‌ కంపెనీలకు పట్టం కట్టేలా ఉన్నాయని చెప్తున్నారు. రైతుకు, వినియోగదారుడికి, రాష్ర్టాలకు నష్టం చేసేలా ఉన్న ఈ బిల్లులను తెలంగాణతోపాటు మెజార్టీ రాష్ర్టాలు వ్యతిరేకిస్తున్నాయి. హర్యానా, పంజాబ్‌తోపాటు పలు రాష్ర్టాల్లో రైతులు రోడ్లపైకి వచ్చి బిల్లులకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. అయినప్పటికీ కేంద్రం ఈ బిల్లులపై వెనక్కి తగ్గటం లేదు. బిల్లులు పాస్‌ చేసిన రోజు ఎన్డీయే మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌ పార్టీకి చెందిన హర్‌సిమ్రత్‌ కౌర్‌ ఏకంగా తన మంత్రి పదవికి రాజీనామా చేయటం గమనార్హం. మూడు నెలల క్రితం కేంద్రం వ్యవసాయరంగ ఉత్పత్తులు, మార్కెటింగ్‌పై మూడు బిల్లులను తీసుకొచ్చింది.

ఇందులో మొదటిది రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) బిల్లు, రెండోది రైతుల ధరల హామీ, సేవల ఒప్పందాల బిల్లు, మూడోది నిత్యావసర సరుకుల (సవరణ) బిల్లు. ఈ మూడు ఏ విధంగా చూసినా అన్నదాతలకు, వినియోగదారులకు, రాష్ర్టాలకు కీడుచేసేలా ఉన్నాయి తప్ప ప్రయోజనం చేకూర్చేలా లేవని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. మొదటి బిల్లు ప్రకారం రైతులు తమ పంటలను ఎక్కడైనా, ఎవరికైనా అమ్ముకునే వీలు కల్పించింది. అంటే.. పంటల కొనుగోలుకు మార్కెట్లు అవసరం లేదు. పాన్‌కార్డు ఉంటే చాలు ఎవరైనా రైతుల పంటలను కొనేయొచ్చు. రెండోదాని ప్రకారం కాంట్రాక్ట్‌ వ్యవసాయం చట్టబద్ధం అయ్యింది. ఇక, మూడోది.. పప్పులు, నూనె గింజలు, నూనెలు, ఉల్లిగడ్డ, ఆలుగడ్డతోపాటు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను నిత్యావసర వస్తువుల జాబితా నుంచి తొలగించటం. దీనివల్ల ఈ ఉత్పత్తులను ఎవరైనా, ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు.

పంట నిల్వ చేసుకోగలడా?

రైతులు తమ పంటలను నిల్వ చేసుకొని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవాలని, ధర అధికంగా ఉండే ఇతర రాష్ర్టాలకు తీసుకెళ్లి అమ్ముకోవాలని కేంద్రం చెప్తున్నది. రైతులు తమ పంటలను నిల్వ చేసుకోవటం ఎంత వరకు సాధ్యమనేది మొదటి ప్రశ్న. ఉన్న శీతల గిడ్డంగుల్లో ఎంతమంది రైతులు నిల్వ చేసుకుంటారనేది రెండో ప్రశ్న. గ్రామాల్లో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయకుండా, సౌకర్యాలు కల్పించకుండా గుడ్డిగా చట్టాన్ని ఎలా తీసుకువస్తారనేది అన్నింటికీ మించి పెద్ద ప్రశ్న. మార్కెట్లు నిర్వీర్యం పంటల కొనుగోళ్లలో మార్కెటింగ్‌ శాఖది కీలక పాత్ర. రైతులకు నష్టం రాకుండా వ్యాపారుల ఆగడాలకు చెక్‌ పెడుతూ పంటల కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. పంటలు కొనుగోలు చేయాలనుకునే వ్యాపారులు మార్కెట్లలో రిజిస్టర్‌ చేసుకోవాలన్న నిబంధన ఉండేది. ఒకచోట కొన్న పంటలను మరోచోటుకు తీసుకెళ్లాలంటే వ్యాపారులు పన్నులు చెల్లించాలి. తద్వారా మార్కెట్లకు ఆదాయం వచ్చేది. తాజాగా తీసుకొచ్చిన మొదటి బిల్లుతో వ్యాపారులపై మార్కెటింగ్‌శాఖ నియంత్రణ ఉండదు. ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలోని మార్కెట్లకు ఏటా రూ.350 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారుల అంచనా.

కార్పొరేట్‌ చేతికి వ్యవసాయం

మరో బిల్లు ద్వారా కాంట్రాక్ట్‌ ఫామింగ్‌కు కేంద్రం చట్టబద్ధత కల్పించింది. తద్వారా వ్యవసాయాన్ని కార్పొరేట్ల చేతిలో పెట్టేందుకు మార్గం సుగమం చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్ట్‌ ఫామింగ్‌ అంటే.. కార్పొరేట్‌ కంపెనీలు ఒక ప్రాంతంలో రైతులతో ఒప్పందం చేసుకొని వ్యవసాయం చేయిస్తాయి. పంట వేసే ముందే కంపెనీలు ఇంత మొత్తంలో పంట దిగుబడి ఉండాలి, కూరగాయల కాయ సైజు ఇంత ఉండాలి అంటూ రైతులకు అనేక రకాల నిబంధనలు పెడతాయి. నిబంధనలకు అనుగుణంగా దిగుబడి రాకపోతే ఆ పంటను కొనేందుకు కంపెనీలు ముందుకురావు. దీంతో రైతు నష్టపోతాడు. అదేవిధంగా పండిన పంటలో ఏ గ్రేడ్‌ (నాణ్యమైన) పంటను మాత్రమే కంపెనీలు కొంటాయి.

మిగతా పంటను కొనవు. అలా రైతు తీవ్రంగా నష్టపోతాడు. రైతుకు నష్టం జరిగితే కోర్టుకు వెళ్లొచ్చనే నిబంధన చేర్చారు. రైతు కోర్టుల చుట్టూ తిరగడం సాధ్యమేనా? కోర్టుల్లో అయ్యే ఖర్చులను భరించే స్థోమత వాళ్లకు ఉంటుందా? అన్న ప్రశ్నలు అందరి మెదళ్లను తొలుస్తున్నాయి. కాంట్రాక్ట్‌ ఫామింగ్‌తో వ్యవసాయ శాఖకు గానీ, మార్కెటింగ్‌ శాఖకు గానీ ఎలాంటి సంబంధం పెట్టలేదు. దీంతో కార్పొరేట్‌ కంపెనీలు రైతులకు నష్టం చేసినా అడిగే పరిస్థితి ఉండదు. గతంలో టేకు చెట్లు, అలోవీరా, మాంజియం సహా పలు రకాల సుగంధ మొక్కలను సాగుచేస్తే లక్షల్లో లాభాలు వస్తాయని రైతులను నమ్మించి విత్తనాలు అమ్మి మొహం చాటేసిన కంపెనీలను ఏమీ చేయలేకపోవటం తెలిసిందే.

రైతు రాష్ర్టాలు తిరగగలడా?

మొదటి బిల్లు ప్రకారం రైతులు తమ పంటల్ని ఎక్కడైనా, ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఆ పంటలను పాన్‌కార్డు ఉన్న ఎవరైనా కొనవచ్చు. దీని అమలుతో క్షేత్రస్థాయిలో రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి రైతులు తమ పంటలను మార్కెట్లకు తీసుకెళ్లి, బేరమాడి అమ్మే స్థోమత లేక స్థానిక వ్యాపారులకు ఇచ్చేస్తారు. మరి, వేరే రాష్ర్టాలకు వెళ్లి పంటలను అమ్మటం సాధ్యమవుతుందా? ఇక, కొత్త బిల్లు వల్ల మద్దతు ధర చట్టబద్ధత కోల్పోయింది. అంటే.. మద్దతు ధర కోసం రైతన్న డిమాండ్‌ చేయలేడు. చివరికి వ్యాపారులు నిర్ణయించిన ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.

ప్రజలపై ధరల మోతే..

కేంద్రం తీసుకొచ్చిన వాటిలో నిత్యవసర సరుకుల (సవరణ) బిల్లు మరొకటి. దీనిద్వారా వ్యవసాయ ఉత్పత్తులను (పప్పులు, నూనె గింజలు, నూనెలు, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ తదితరాలు) నిత్యావసర వస్తువుల జాబితా నుంచి తొలగించింది. దీంతో వీటి నిల్వపై ఇన్నాళ్లు ఉన్న ఆంక్షలు ఎత్తివేసినైట్లెంది. బడావ్యాపారులు సిండికేట్‌గా మారి రైతుల వద్ద తక్కువ ధరకే పంటలు కొని.. పెద్దమొత్తంలో నిల్వ చేసుకొని, కృత్రిమ కొరత సృష్టించి, తర్వాత ధరలు పెంచి అమ్ముకొనే స్వేచ్ఛ కలిగింది. వినియోగదారులపై ఇది పెద్ద ప్రభావమే.

రైతుకు తీరని నష్టం

పంటల మార్కెటింగ్‌లో కేంద్రం తెచ్చే బిల్లు వల్ల రైతుకు తీరని నష్టం జరుగుతుందని మార్కెటింగ్‌ శాఖ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. వ్యాపారులు డిమాండ్‌ ఉన్నపుడే పంటల్ని కొంటారు. ఇబ్బందికర పరిస్థితులొస్తే ఆ వంక చూడరు. దీనికి ఉదాహరణే యాసంగి పంటల కొనుగోలు. కరోనా నేపథ్యంలో పంట కొనడానికి ఏ వ్యాపారీ ముందుకు రాలేదు. రైతుకు నష్టం రావొద్దనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం మద్దతు ధరకు పంటలను కొన్నది.

వ్యాపార, వాణిజ్య బిల్లు:

ఈ చట్టం చెప్తున్నది ఏమిటంటే.. రైతులు తమ పంటలను దేశంలో ఎక్కడికైనా తీసుకెళ్లి అమ్ముకోవచ్చు. ఇందుకు రైతుల నుంచి ఎలాంటి పన్ను వసూలు చేయరు. మార్కెట్లలో రిజిస్టర్‌ చేసుకున్న వ్యాపారులే కాకుండా పాన్‌కార్డు ఉన్న వ్యక్తులెవరైనా కొనవచ్చు.

ఇవీ నష్టాలు..

దేశంలోఉన్న రైతుల్లో 86% చిన్న, సన్నకారు రైతులే. అప్పుచేసి పండించే పంటను ఇతర రాష్ర్టాలకు వెళ్లి అమ్ముకోగలరా? చాన్స్‌ దొరికితే రైతన్న నోట్లో మట్టి కొట్టాలని చూసే వ్యాపారులను కేంద్రం అదుపుచేయగలదా? కార్పొరేట్‌ కంపెనీలు సిండికేట్‌గా మారి రైతుల పంటలను ఇతరులెవరూ కొనకుండా చేసే ప్రమాదం ఉంది. దీంతో రైతులు వారి పంటలను తప్పనిసరిగా కార్పొరేట్‌ కంపెనీలకే అమ్మే పరిస్థితి కల్పించినట్టు అవుతుంది.

సేవల ఒప్పందాల బిల్లు:

ఈ చట్టం చెప్తున్నది ఏమిటంటే.. రైతులు పంటల సాగుపై కార్పొరేట్‌ కంపెనీలు, ఇతర వ్యాపారులు ముందే ఒప్పందం కుదుర్చుకునే వీలు. పంట చేతికొచ్చాక ధర తగ్గినా, పెరిగినా రైతుకు సంబంధం లేదు. ఒప్పందంలో ధరను కంపెనీలు రైతుకు చెల్లించాలి.

ఇవీ నష్టాలు..

వ్యవసాయరంగం కార్పొరేట్‌ కంపెనీల గుప్పిట్లోకి వెళ్లిపోతుంది. ఏ పంట వేయాలి? ఎలా సాగు చేయాలి? ఆ పంటకు ఎంత ధర? ఇలా అన్ని విషయాలను అవే నిర్ణయిస్తాయి. పంట చేతికొచ్చాక మార్కెట్‌లో అధిక ధర లభించినా కంపెనీ ఒప్పందం ప్రకారం నిర్ణయించిన ధరనే చెల్లిస్తుంది. దిగుబడి తీరుపైనా షరతులు పెడుతాయి. ఆ మేరకు పంట రాకుంటే కొనుగోలుకు నిరాకరిస్తాయి. ఒప్పందం పూర్తయ్యే వరకు ఆ భూమిపై కంపెనీకి హక్కులు.

నిత్యావసర సరుకుల సవరణ బిల్లు:

ఈ చట్టం చెప్తున్నది ఏమిటంటే.. పప్పు, తృణ ధాన్యాలు, నూనె గింజలు, ఉల్లి, ఆలుగడ్డతోపాటు ఇతర వ్యవసాయ ఉత్పత్తులు నిత్యవసరాల జాబితాలో ఉండవు. వీటిని ఎవరైనా, ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు. ఆపత్కాలంలోనే సరుకుల నిల్వపై షరతులు విధిస్తారు.

ఇవీ నష్టాలు..

మంచి ధర వచ్చేదాకా రైతులు తమ పంటలను నిల్వ చేసుకోవడం ఎంతవరకు సాధ్యం? ఎక్కడ నిల్వ చేసుకోవాలి? నిల్వ చేసుకొనే స్థోమత రైతుకు ఉంటుందా? ఈ బిల్లు వల్ల నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటే ప్రమాదం ఉంది. సరుకుల నిల్వపై ఎలాంటి షరతులు లేకపోవటంతో కార్పొరేట్‌ కంపెనీలు ఒకేసారి పెద్ద మొత్తంలో పంటలను కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటాయి. కృత్రిమ కొరత సృష్టించి, ఎక్కువ ధరకు అమ్ముకుంటాయి.

ఇవీ బిల్లులు!

వ్యాపార, వాణిజ్య బిల్లు: రైతు రక్తమాంసాలు పిండుకో అని కార్పొరేట్‌ సంస్థలకు కేంద్రం చెప్పకనే చెప్తున్నది. ఎక్కడికైనా పోయి పంటను అమ్ముకోవచ్చట. రైతన్న ఎన్ని ఊర్లు తిరగాలి? ఎన్ని రాష్ర్టాలు దాటాలి? అప్పటికీ పంట అమ్ముడుపోతుందన్న గ్యారెంటీ ఉన్నదా?

సేవల ఒప్పందాల బిల్లు:

ఈ బిల్లును కార్పొరేట్‌ చుట్టంగా అభివర్ణించవచ్చు. దీనివల్ల సొంత పొలంలోనే రైతు.. కూలీగా మారే దుస్థితి వస్తుంది. కంపెనీలు చెప్పినట్టు తల ఆడించాల్సి వస్తుంది. స్వేచ్ఛ పోయి షరతులతో వ్యవసాయం చేసే ప్రమాదకర పరిస్థితి తలెత్తుతుంది.

నిత్యావసర సరుకుల సవరణ బిల్లు:

నిత్యావసర వస్తువుల నిల్వ, సరఫరాపై ఎలాంటి నియంత్రణ ఉండొద్దన్నది ఈ చట్టం ముఖ్యోద్దేశం. వీటిని భారీఎత్తున నిల్వ చేసుకొనే అవకాశం ఉండటంతో వ్యవసాయ వ్యాపార సంస్థలు భారీగా లాభపడతాయన్నది సుస్పష్టం.

Web TitleExplanation on the three bills brought by the Central Government Many states and farmers' associations opposing
Next Story