Arvind Kejriwal: సీఎం కేజ్రీవాల్‌ అరెస్టు.. ఢిల్లీలో టెన్షన్‌ టెన్షన్‌

ED Officers Arrest Delhi CM Kejriwal
x

Arvind Kejriwal: సీఎం కేజ్రీవాల్‌ అరెస్టు.. ఢిల్లీలో టెన్షన్‌ టెన్షన్‌

Highlights

Arvind Kejriwal: కేజ్రీవాల్‌ను ఈడీ ఆఫీస్‌కు తరలించిన అధికారులు

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీలాండరింగ్‌ కేసులో ఇప్పటికే ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను కూడా అరెస్ట్ చేసింది. గురువారం రాత్రి ఆయన అధికార నివాసంలో అదుపులోకి అరెస్టు చేసింది. కేజ్రీవాల్‌ సతీమణికి అరెస్ట్ సమాచారం అందించిన ఈడీ అధికారులు.. ఆయన్ను భారీ భద్రత నడుమ ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. రాత్రి అక్కడే వైద్య పరీక్షలు చేశారు. ఇవాళ మరోసారి వైద్య పరీక్షలు చేసి రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనుంది ఈడీ. లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌ను విచారించేందుకు పదిరోజుల కస్టడీకి కోరే అవకాశాలున్నాయి.

అంతకుముందు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటిముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సాయంత్రం 7 గంటల సమయంలో కేజ్రీవాల్ నివాసానికి వెళ్లిన ఈడీ అధికారులు.. రెండు గంటల పాటు సోదాలు నిర్వహించారు. కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. అనంతరం అదుపులోకి తీసుకుని ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. దీంతో కేజ్రీవాల్ నివాసం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేజ్రీవాల్‌ ఇంటికి ఈడీ అధికారుల బృందం చేరుకోవడంతో.. ఆప్‌ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. కేజ్రీవాల్ అరెస్ట్ విషయం తెలుసుకుని ఆయన ఇంటిముందే బైఠాయించి ధర్నా చేశారు. ఈడీ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. దాంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి తరలించారు. ఆప్ నేతలను అరెస్ట్ చేసిన అనంతరం కేజ్రీవాల్‌ను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయగా.. ఈడీ కార్యాలయానికి వెళ్లే దారులన్నింటినీ దిల్లీ పోలీసులు మూసివేశారు. ప్రధాన కూడళ్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాత్రి 11 గంటల 30 నిమిషాలకు ఆయన్ను ఈడీ ఆఫీస్‌కు తరలించారు.

దిల్లీ మద్యం కేసులో ఇప్పటివరకు 16 మందిని ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసు అభియోగ పత్రాల్లో పలుమార్లు కేజ్రీవాల్‌ పేరును ప్రస్తావించింది. విచారణకు హాజరుకావాలని ఈడీ 9సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ నిరాకరించిన కేజ్రీవాల్‌...అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనను జస్టిస్‌ సురేశ్‌కుమార్‌ కైత్‌, జస్టిస్‌ మనోజ్‌ జైన్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. కేజ్రీవాల్‌ పిటిషన్‌పై ఈడీని వివరణ కోరింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 22కి వాయిదా వేసింది. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఈడీ అధికారుల బృందం సెర్చ్‌ వారెంట్‌తో కేజ్రీవాల్‌ నివాసానికి వెళ్లడం, సోదాలు చేయడం, ప్రశ్నించి ఆయనను అదుపులోకి తీసుకోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఇదే కేసులో... గత వారం ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా, ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ జైల్లో ఉన్నారు.

అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని హైకోర్టు స్పష్టం చేసిన వెంటనే కేజ్రీవాల్‌ తరపు న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి విచారణ జరిపించేందుకు ప్రయత్నిస్తుండగానే ఈడీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. దీంతో న్యాయవాదులు గురువారం రాత్రి సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ ఇంటికి వెళ్లి వెంటనే విచారణ జరపటం కోసం విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు సమ్మతించలేదని తెలిసింది. పిటిషన్‌ ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది. దీంతో అరెస్ట్‌పై కోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందనే ఉత్కంఠ నెలకొంది.

లోక్‌సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ అరెస్టు పెద్ద రాజకీయ కుట్రేనని ఆప్‌ ఆరోపిస్తోంది. సోదాల్లో కేజ్రీవాల్‌ నివాసంలో కేసుకు సంబంధించిన ఆధారాలేమీ లభించలేదని, రూ.70వేలు ఇంట్లో ఉండగా ఆ మొత్తాన్ని ఈడీ అధికారులు తమకు అప్పగించారని ఆప్‌ నేత సౌరభ్‌ భరద్వాజ్‌ తెలిపారు. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తారేమో కానీ.. ఆయన ఆలోచనలను కాదని స్పష్టం చేశారు. అరెస్టును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ఎదుట నిరసనలకు ఆప్‌ పిలుపునిచ్చింది.

అటు కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలన్నీ కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఖండించాయి. భయపడిన ఓ నియంత ప్రజాస్వామ్యాన్ని చంపేయాలనుకుంటున్నాడని... దీనికి ఇండియా కూటమి తగిన సమాధానం చెబుతుందని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కూడా కేంద్రం దర్యాప్తు సంస్థలను కీలుబొమ్మలుగా మార్చుకుందని.. కేజ్రీవాల్‌ను చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేయించిందని ట్వీట్ చేశారు. విపక్షాలకు భయపడే అరెస్టులకు తెగబడుతున్నారని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories