DRDO: 2డీజీ వాడకంపై మార్గదర్శకాలు జారీ చేసిన డీఆర్డీవో

DRDO Issues Guide Lines on Using Their Corona Medicine
x
 2 DG Medicine (File image) 
Highlights

DRDO: కొవిడ్-19 వైద్యంలో అత్యవసర వినియోగం కింద ఈ డ్రగ్‌కు అనుమతించినట్టు వెల్లడించింది.

DRDO: కరోనా చికిత్సలో రోగులకు సత్వర ఉపశమనం కలిగించేలా డీఆర్డీవో 2 డీజీ (2 డీఆక్సీ డీ గ్లూకోజ్) ఔషధాన్ని అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఔషధ వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలని డీఆర్డీవో స్పష్టం చేసింది. తాజాగా దీని వాడకంపై మార్గదర్శకాలు జారీ చేసింది. 2-డీజీ డ్రగ్ వినియోగంపై డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌‌డీవో) మార్గదర్శకాలు విడుదల చేసింది.

కొవిడ్-19 వైద్యంలో అత్యవసర వినియోగం కింద ఈ డ్రగ్‌కు అనుమతించినట్టు వెల్లడించింది. మధ్యస్థ నుంచి తీవ్రస్థాయి లక్షణాలున్న కేసుల్లో మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది. పాజిటివ్‌గా గుర్తించిన వెంటనే గరిష్టంగా 10 రోజులపాటు డ్రగ్ ఇవ్వొచ్చని తెలిపింది. ఆస్పత్రుల్లో వైద్యుల సూచన మేరకు మాత్రమే డ్రగ్ వినియోగించాలని సూచించింది.

'నియంత్రణ లేని మధుమేహం, తీవ్రమైన హృద్రోగ సమస్యలు, తీవ్ర శ్వాసకోస ఇబ్బందులు, తీవ్ర హెపాటిక్ రీనల్ ఇంపెయిర్మెంట్ సమస్యలున్నవారిపై 2-డీజీ డ్రగ్‌‌ను పరీక్షించలేదు. కాబట్టి అలాంటి వారికి వినియోగించే సమయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, 18 ఏళ్ల లోపువారికి 2-డీజీ డ్రగ్ ఇవ్వొద్దు. రోగులతోపాటు వారి బంధువులు ఈ డ్రగ్ కోసం ఆస్పత్రి యాజమాన్యాలను, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌ను సంప్రదించొచ్చు. [email protected]కు మెయిల్ చేయడం ద్వారా డ్రగ్ సప్లై కోరొచ్చు' అని డీఆర్‌డీవో పేర్కొంది.

ఈ ఔషధం పొడి రూపంలో సాచెట్‌లలో లభిస్తుంది. నీళ్లలో కలుపుకొని తాగితే చాలు. వైరస్‌ ఉన్న కణాల్లోకి చేరి దాని వృద్ధిని అడ్డుకుంటుంది. వైరస్‌ సోకిన కణాల్లో నేరుగా ప్రవేశించడం ఈ ఔషధం ప్రత్యేకత. ఫలితంగా కొవిడ్‌ రోగులు చాలా వేగంగా కోలుకోవడానికి సహకరిస్తుందని క్లినికల్‌ ట్రయల్స్‌లో గుర్తించారు. వేర్వేరు స్థాయిల్లో స్టాండర్డ్‌ ఆఫ్‌ కేర్‌ (ఎస్‌వోసీ)తో పోల్చి చూసినప్పుడు సగటు కోలుకుంటున్న రోజులకంటే 2డీజీ ఔషధంతో చికిత్స పొందిన రోగులు రెండున్నర రోజులు ముందే కోలుకున్నట్లు గుర్తించారు. ఆక్సిజన్‌పై ఆధారపడటం 42 శాతం తగ్గినట్లు తమ పరిశోధనల్లో వెల్లడైందని స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories