ప్రాణదాతల సేవలకు గుర్తింపు వారిని ఇబ్బందిపెట్టడమేనా.. వైద్యులను ఇళ్ళ నుంచి ఖాళీ చేయిస్తారా ?

ప్రాణదాతల సేవలకు గుర్తింపు వారిని ఇబ్బందిపెట్టడమేనా.. వైద్యులను ఇళ్ళ నుంచి ఖాళీ చేయిస్తారా ?
x
Highlights

మనిషి ప్రాణం అమూల్యం. అందులో హెచ్చుతగ్గుల్లేవు. ఈ మాటల్లో సందేహం లేదు. కాకపోతే, కరోనా వైరస్ లాంటి ప్రాణాంతక వైరస్ విజృంభిస్తున్న సమయంలో అత్యవసర...

మనిషి ప్రాణం అమూల్యం. అందులో హెచ్చుతగ్గుల్లేవు. ఈ మాటల్లో సందేహం లేదు. కాకపోతే, కరోనా వైరస్ లాంటి ప్రాణాంతక వైరస్ విజృంభిస్తున్న సమయంలో అత్యవసర సేవలందించే సిబ్బంది మరీ ముఖ్యంగా వైద్యుల ప్రాణాలు మరింత విలువైనవి అనడంలో సందేహం లేదు. ఒక్కో డాక్టర్...సిస్టర్...ల్యాబ్ టెక్నీషియన్ వందలాది మంది ప్రాణాలను కాపాడగలుగుతారు. మరి వారి ప్రాణాలే ముప్పులో పడితే ఎలా ? ఇదే ఇప్పుడు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న అంశంగా మారింది. ప్రధానమంత్రి మోడీ సైతం పలు సందర్భాల్లో ఇదే అంశం గురించి ప్రస్తావించారు.

వైద్యో నారాయణో హరి అంటారు. సాధారణ సమయాలతో పోలిస్తే ప్రాణాంతక వైరస్ లు ప్రబలే సమయాల్లో వైద్య సిబ్బంది ప్రాధాన్యం మరింతగా ఉంటుంది. ప్రాణాలను కాపాడే వారి ప్రాణాలకు మరింత విలువనివ్వాల్సి ఉంటుంది. విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వారి ప్రాణాలే ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. ఢిల్లీ ఓ డాక్టర్, ఆయన భార్య, కుమార్తె కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. దేశంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దశకు చేరుకుంటున్నదన్న వార్తలు వెలువడుతున్నాయి. ఈ సమయంలో వైరస్ ను ఎదుర్కొనేందుకు ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్న వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై నే గాకుండా ప్రజలపై కూడా ఉంది. ఢిల్లీ వంటి నగరాల్లో కరోనా భయంతో పలువురు వైద్యులను ఇళ్లు ఖాళీ చేయిస్తున్న యజమానుల ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటివన్నీ వైద్యులపై ఒత్తిళ్ళను మరింతగా పెంచుతున్నాయి. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక వైద్య సంస్థ ఎయిమ్స్ ఈ అంశాన్ని హోం శాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లింది. పలువురు వైద్యులు ఇళ్లు ఖాళీ చేసి రోడ్డున పడ్డారని వైద్యుల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇళ్లు ఖాళీ చేయించడం, సామాజిక వివక్ష ప్రదర్శించడం లాంటివి వైద్య సిబ్బంది నైతిక స్థయిర్యాన్ని దెబ్బ తీస్తాయని, అలాంటి చర్యలను తాము సహించబోమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ హెచ్చరించారు. ఈ విషయంలో వైద్య సిబ్బందికి అవసరమైన సాయాన్ని అందిస్తామని ప్రకటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సైతం ఈ విషయంలో సానుకూలంగా స్పందించారు. వైద్యులను ఇళ్ళ నుంచి ఖాళీ చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలను కాపాడేందుకు డాక్టర్లు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది ప్రాణాలను కాపాడుకోవాల్సిన అవసరం మరింతగా ఉందని ఆయన అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా బారిన పడుతున్న వారి గణాంకాలను పరిశీలిస్తే భారత్ లో కనీసం 10 శాతం మంది ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు. మనదేశంలో వైద్య పరమైన మౌలిక వసతులు తక్కువ అనడంలో సందేహం లేదు. క్యూబాలో ప్రతీ లక్ష మంది జనాభాకు 591 మంది డాక్టర్లు ఉన్నారు. ప్రపంచంలో పేషెంట్- డాక్టర్ నిష్పత్తిలో ఇదే మొదటి స్థానంలో ఉంది. ప్రతీ లక్ష మందికి ఇటలీలో 428 మంది, ఇజ్రాయెల్ లో 382 మంది, ఫ్రాన్స్ లో 337 మంది, అమెరికాలో 359 మంది డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసుల మేరకు ప్రతీ 1000 మంది జనాభాకు కనీసం ఒక డాక్టర్ ఉండాలి. భారత్ లో మాత్రం ప్రతీ 1800 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. పేషెంట్- డాక్టర్ నిష్పత్తి లో భారత్ అట్టడుగు స్థాయిలో ఉంది. క్లినికల్ బెడ్ ల విషయంలో కూడా ఇదే దుస్థితి ఉంది. భారత్ లో ప్రతీ వెయ్యి మంది జనాభాకు సగటున ఒక్క బెడ్ కూడా అందుబాటులో లేదు. ఈ విషయంలో ప్రపంచంలో అతి తక్కువ సగటు కలిగిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఫ్రాన్స్ లో మెడికల్ క్లినికల్ బెడ్స్ ప్రతీ 1000 మందికి 6.5 గా ఉంది. దక్షిణ కొరియాలో 11.5 శాతంగా ఉంది. చైనాలో 4.2 గా ఉంది. ఇటలీలో 3.4, యూకేలో 2.9, అమెరికాలో 2.8, ఇరాన్ లో 1.5. అలాంటి దేశాలే కరోనా వైరస్ సమర్థంగా ఎదుర్కోలేకపోయాయి. మరో వైపున మే మధ్యకాలం నాటికి దేశంలో 13 లక్షల మంది కరోనా బారిన పడే అవకాశం ఉందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఈ భయంకర విపత్తును ఎదుర్కొనేందుకు భారతీయ వైద్య రంగం పూర్తిస్థాయిలో సన్నద్ధంగా లేదు. మాస్క్ లు, శానిటైజర్లు, గ్లోవ్స్ వంటివి వైద్యసిబ్బందికి అందుబాటులో లేకుండా పోయాయి. ప్రజలు విచ్చలవిడిగా అవసరం లేకుండా ఇలాంటి వాటిని విచ్చలవిడిగా కొనడంతో చివరకు అవి అత్యవసర సిబ్బందికి అందుబాటులో లేకుండా పోయాయి. మరో వైపున ప్రైవేటు వైద్యరంగం కరోనా ను ఎదుర్కోవడంలో కొంత మేరకు వెనుకంజ వేసింది. దీంతో ప్రభుత్వ వైద్యరంగంపైనే అధిక భారం పడింది.

కరోనా వైరస్ ప్రత్యేక వార్డుల్లో సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి కొంతమేరకు పూర్తిస్థాయి రక్షణ ఉపకరణాలు అందుబాటులో ఉన్నా, స్క్రీనింగ్ స్థాయిలో వైద్యసిబ్బందికి రక్షణ ఉపకరణాలు పెద్దగా లేవు. నిజానికి స్క్రీనింగ్ స్థాయిలోని వైద్య సిబ్బందికి కూడా సరైన రక్షణ ఉపకరణాల అవసరం ఉంది. దాంతో వారి ప్రాణాలు మరింతగా రిస్క్ లో పడినట్లయింది. ఈ తరహా పరిస్థితిని ఎదుర్కోవడంలో వైద్య సిబ్బందికి గతంలో ఎలాంటి శిక్షణ ఇవ్వలేదు. ఆ ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. కరోనా వైరస్ వ్యాధి లక్షణాలపై ఇప్పటికీ ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన లేదు. కొంతమంది చిన్న పాటి జలుబుకు కూడా డాక్టర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. మరో వైపున వ్యాధి లక్షణాలు బయటపడుతున్నా నిర్లక్ష్యంగా ఉంటున్న వారు మరెందరో ఉన్నారు. కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో తలమునకలైన వైద్య సిబ్బంది ఎంతో మంది కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. షిఫ్ట్ లతో సంబంధం లేకుండా నిరంతర సేవలు అందిస్తున్నారు. నిజానికి ఇది వారిపై ఒత్తిడి పెంచే అంశమే. కాకపోతే వారికి మరో ఆప్షన్ లేదు. ఒకవైపున కరోనా భూతంతో పోరాడుతూ, మరో వైపున కుటుంబసభ్యులతో గడిపే పరిస్థితి లేదు. కరోనా టెస్ట్ లు చేసేందుకు ప్రైవేటు రంగాన్ని కూడా అనుమతించడం కొంతలో కొంత నయం. ఇటీవలే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. శాంపిల్స్ సేకరించే వారు, వాటిని విశ్లేషించే వారు సైతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇటలీలో 29 మంది డాక్టర్లు ప్రజాసేవలో తమ ప్రాణాలు కోల్పోయారు. వైద్య వృత్తిని స్వీకరించేందుకు ముందు తాము చేసిన హిపోక్రటిస్ ఓత్ కు కట్టుబడి వారు తమ ప్రాణాలను సైతం అర్పించారు. అలాంటి రియల్ హీరోలను మనమంతా గౌరవించాలి.

వైద్య సిబ్బంది మాత్రమే కాదు పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు లాంటి వారు సైతం కరోనా భూతాన్ని తరిమిగొట్టడంలో తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ప్రజలంతా ఇంట్లోనే ఉండాల్సిందిగా ప్రభుత్వాలు ఎంతగా ప్రచారం చేస్తున్నా చాలామంది పెడచెవిన పెడుతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. ఇది పారిశుద్ధ్య సిబ్బందికి, పోలీసులకు సైతం ప్రాణాంతకంగా మారుతోంది.

లాక్ డౌన్ ను కచ్చితంగా అమలు చేసేందుకు వేలాది మంది పోలీస్ సిబ్బంది రోడ్లపై ఉంటున్నారు. కరోనా నుంచి రక్షణ కల్పించే ఉపకరణాలేవీ వారికి పెద్దగా అందుబాటులో ఉండడం లేదు. మరో వైపున వారు సైతం గుంపులుగా, గుంపులుగా ఉంటున్నారు. సామాజికదూరం పాటించడం లేదు. ఇవన్నీ కూడా వారి ఆరోగ్యానికి ముప్పు కలిగించే అంశాలుగా మారుతున్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడంలో పారిశుద్ధ్యం కూడా కీలక పాత్ర వహిస్తుంది. సరైన రక్షణ ఉపకరణాలు లేకుండానే వీధుల్లో పారిశుద్ధ్య సిబ్బంది విధులు నిర్వహించాల్సి వస్తోంది. చాలా మంది తాము ఉపయోగించిన టిష్యూలు, మాస్క్ లు, గ్లోవ్స్ లాంటి వాటిని ఇష్టం వచ్చినట్లుగా పారవేస్తున్నారు. వాటిని సేకరించి డిస్పోజ్ చేయాల్సిన బాధ్యత పారిశుద్ధ్య సిబ్బందిపై పడుతోంది. అది వారి ప్రాణాలకు ముప్పు కలిగించేదిగా మారుతోంది. ప్రజలు తాము పారేసే టిష్యూలు, మాస్క్ లు లాంటివాటిని ఒక కవర్ లాంటి దానిలో సీల్ చేయడం ద్వారా కొంతవరకైనా పారిశుద్ధ్య సిబ్బందికి తోడ్పడవచ్చు. పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది లాంటి వారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వారందరికీ అవసరమైన ఉపకరణాలు అందించేందుకు భారీ మొత్తంలో నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి. నిధుల సంగతి అటుంచి, అసలు ఆ స్థాయిలో ఉపకరణాల లభ్యత కూడా లేదు. కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు తక్షణం ఈ అంశాలపై సైతం దృష్టి వహించాలి. పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు తమ ప్రాణాలకు తెగించి రోడ్లపై ఉంటూ మనల్ని కాపాడుతున్నారు. మరి జనం రోడ్లపై రాకుండా ఇళ్ళలో ఉంటూ కరోనా భూతంపై పోరాటానికి మద్దతు ఇవ్వలేరా అంటూ వారు వేసే ప్రశ్నలకు మన వద్ద సమాధానం లేదు.

అమెరికాలో ప్రజారోగ్యంపై బడ్జెట్ లో 17శాతం వెచ్చిస్తున్నారు. బ్రిటన్ లో ఇది సుమారు 10 శాతంగా ఉంది. ప్రపంచ సగటు కూడా 10 శాతంగా ఉంది. కరోనా వైరస్ తో అమెరికా అల్లాడుతుంటే, దానికి కూతవేటు భారతదేశంలో మాత్రం ఇది సుమారు మూడున్నర శాతంగా మాత్రమే ఉంది. వైరస్ వైపరీత్యాలు ఇటీవలి కాలంలో అధికమైపోతున్నాయి. మౌలిక వసతులను మెరుగుపరుచుకోకుండా అలాంటి వాటిని ఎదుర్కోవడం సాధ్యం కాదు. బడ్జెట్లో ప్రజారోగ్యానికి భారీగా నిధులు పెంచాల్సిన అవసరం ఉంది. అంతేగాకుండా ఇలాంటి విపత్తులు ఎదురైనప్పుడు తక్షణం అనుసరించాల్సిన విధి విధానాలను సమగ్రంగా రూపొందించుకోవాలి.

సమాజానికి ప్రాణదాతలు వైద్యులు. వారిని గౌరవిస్తూ, వారి సూచనలు పాటించడం మన విధి. అదేవిధంగా పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు సైతం మన కోసమే పని చేస్తున్నారు. వారికి సహకరించడం ద్వారా కరోనా వైరస్ బారి నుంచి మనల్ని మనం కాపాడుకుందాం. జనతా కర్ఫ్యూ సందర్భంగా సాయంత్రం ఐదు గంటలకు చప్పట్లు కొట్టి మనం వారి సేవలను గుర్తు చేసుకున్నాం. అంతకంటే ముఖ్యమైంది మరొకటి ఉంది. కొన్ని రోజుల పాటు మనం ఇళ్లకే పరిమితమై అత్యవసర సిబ్బంది వారి విధులను సక్రమంగా నెరవేర్చడంలో తోడ్పడుదాం. మన దేశభక్తిని చాటుకునేందుకు ఇదో మహత్తర అవకాశం.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories