ఫిబ్రవరి 24న భారత్‌లో అడుగుపెట్టనున్న ట్రంప్‌.. షెడ్యూల్‌ ఇదే!

ఫిబ్రవరి 24న భారత్‌లో అడుగుపెట్టనున్న ట్రంప్‌.. షెడ్యూల్‌ ఇదే!
x
trump modi ( File photo)
Highlights

యావత్‌ భారత్‌ ఇప్పుడు ట్రంప్ జపం చేస్తోంది. అగ్రరాజ్యాధినేత రాక కోసం ఇండియా మొత్తం ఎదురుచూస్తోంది. ఫిబ్రవరి 24న అంటే సోమవారం ఉదయం అహ్మదాబాద్‌లో...

యావత్‌ భారత్‌ ఇప్పుడు ట్రంప్ జపం చేస్తోంది. అగ్రరాజ్యాధినేత రాక కోసం ఇండియా మొత్తం ఎదురుచూస్తోంది. ఫిబ్రవరి 24న అంటే సోమవారం ఉదయం అహ్మదాబాద్‌లో ల్యాండ్ కానున్న డొనాల్డ్‌ ట్రంప్ దంపతులు... రెండ్రోజులపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మొదట అహ్మదాబాద్‌లో... ఆ తర్వాత ఆగ్రాలో... చివరిగా ఢిల్లీలో పర్యటించి ఫిబ్రవరి 25న తిరుగుపయనం కానున్నారు. ట్రంప్ ఇండియన్ టూర్ షెడ్యూల్‌పై ఫుల్ డిటైల్స్ మీకోసం.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి 24న భారత్‌లో అడుగుపెట్టనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌.... రెండ్రోజులపాటు ఇండియాలో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 24నుంచి 25వరకు మొత్తం మూడు దశల్లో ట్రంప్ టూర్ కొనసాగనుంది. అహ్మదాబాద్‌, ఆగ్రా, ఢిల్లీలో ట్రంప్ పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 11గంటలకు ఎయిర్‌‌ఫోర్స్ వన్‌ విమానంలో అహ్మదాబాద్‌ ఎయిర్‌‌పోర్ట్‌లో ల్యాండ్‌ కానున్న ట్రంప్ దంపతులకు ప్రధాని మోడీ స్వయంగా ఆహ్వానం పలుకుతారు. అనంతరం మోడీ, ట్రంప్ కలిసి రోడ్‌షో ద్వారా మొతేరా స్టేడియానికి చేరుకుంటారు. మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు, మొతేరా స్టేడియాన్ని ప్రారంభించి నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే, మొతేరా స్టేడియం దగ్గర ట్రంప్‌‌కు కనీవినీ ఎరుగనిరీతిలో గ్రాండ్ వెల్‌కమ్‌ చెప్పనున్నారు. అనంతరం, ట్రంప్‌, మోడీ కలిసి ప్రసంగిస్తారు. గతేడాది మోడీ అమెరికా టూర్ సందర్భంగా టెక్సాస్‌లో నిర్వహించిన హౌడీ మోడీ తరహాలోనే నమస్తే ట్రంప్ కార్యక్రమం జరగనుంది. ట్రంప్ ఇండియా టూర్‌లో మొతేరా స్టేడియంలో నిర్వహించనున్న ప్రోగ్రామే హైలైట్‌గా నిలవనుంది.

ఇక, అదే రోజు అంటే, ఫిబ్రవరి 24న మధ్యాహ్నం మూడున్నరకు గుజరాత్ నుంచి ట్రంప్ దంపతులు ఆగ్రాకు బయల్దేరి వెళ్తారు. సాయంత్రం 5గంటలకు ఆగ్రా చేరుకుని తాజ్‌-మహల్‌ను సందర్శిస్తారు. ఇక, రాత్రికి ఢిల్లీ చేరుకుని ఐటీసీ మౌర్య హోటల్‌లో ట్రంప్, మెలానియా దంపతులు బస చేస్తారు.

రెండోరోజు అంటే, ఫిబ్రవరి 25న ఉదయం 10గంటలకు ట్రంప్ దంపతులు రాష్ట్రపతి భవన్‌ను సందర్శిస్తారు. ఆ తర్వాత 10-45కి రాజ్‌ఘాట్‌‌కు చేరుకోనున్న ట్రంప్‌-మెలానియా దంపతులు.... ప్రధాని మోడీతో కలిసి మహాత్మాగాంధీ సమాధి దగ్గర నివాళులర్పిస్తారు. అనంతరం, సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాసిన తర్వాత ట్రంప్.. హైదరాబాద్ హౌజ్‌కు బయల్దేరుతారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మోడీ, ట్రంప్ మధ్య అత్యున్నతస్థాయి సమావేశం జరుగుతుంది. వివిధ అంశాల్లో రెండు దేశాల మధ్య ఒప్పంద పత్రాలపై సంతకం చేసి, ఇద్దరు కలిసి మీడియాతో మాట్లాడుతారు. ఆ తర్వాత యూఎస్ ఎంబసీలో ఈసీవో రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుంది.

అనంతరం ప్రధాని మోడీ ఏర్పాటు చేసే లంచ్‌లో ట్రంప్ దంపతులు పాల్గొంటారు. అక్కడి నుంచి ట్రంప్ ఐటీసీ మౌర్య హోటల్ చేరుకొని భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసే అవకాశం ఉంది. ఇక, అదే రోజు రాత్రి రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చే విందులో పాల్గొంటారు. అనంతరం ఫిబ్రవరి 25న రాత్రి 10గంటలకు ట్రంప్, మెలానియా... ప్రత్యేక విమానంలో అమెరికాకు తిరుగు ప్రయాణం అవుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories