Broadcast Services Regulation Bill: యూట్యూబర్స్ గొంతు నొక్కేందుకే సవరణలు చేస్తున్నారా?

Broadcast Bill 2024
x

Broadcast Bill 2024

Highlights

Broadcast Bill 2024: ఈ బిల్లు చట్టంగా మారితే ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ ఇన్ ఫ్లుయెన్సర్ల మీద నిఘా పెరుగుతుందనే ఆందోళనలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ విషయం ఇప్పుడు పార్లమెంటులో ప్రతిధ్వనిస్తోంది.

Broadcast Bill 2024: బ్రాడ్ కాస్టింగ్ సర్వీసెస్ – రెగ్యులేషన్ బిల్లులో మోదీ ప్రభుత్వం రహస్యంగా మార్పులు చేర్పులు చేస్తోందని ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ బిల్లును రివైజ్ చేసి తమకు కావల్సిన కొద్ది మందికి మాత్రమే చూపించి ఫైనల్ చేస్తున్నారని ఆరోపించాయి.

నిజానికి, గత ఏడాదే ప్రభుత్వం ఈ బిల్లును సిద్ధం చేసింది. ఇప్పుడు దీనిని చాలా రకాలుగా సవరించారనే విమర్శలు వస్తున్నాయి. ఈ బిల్లు చట్టంగా మారితే ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ ఇన్ ఫ్లుయెన్సర్ల మీద నిఘా పెరుగుతుందనే ఆందోళనలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ విషయం ఇప్పుడు పార్లమెంటులో ప్రతిధ్వనిస్తోంది.

మొదట ఈ అంశాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో ప్రస్తావించింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ జవహర్ సర్కార్ దీనిపై సభలో మాట్లాడుతూ, సవరించిన బిల్లును కొంతమంది వ్యాపారవేత్తలకు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. ఇది ప్రజల భావప్రకటన స్వేచ్ఛను అణచివేస్తుందని చెప్పిన జవహర్ సర్కార్, దీని ప్రతులను కొంతమందికి మాత్రమే రహస్యంగా సర్క్యులేట్ చేయడమేమిటని ప్రశ్నిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

అయితే, ఈ బిల్లులో ఉన్నాయని భావిస్తున్న కొన్ని అంశాలు ఇప్పటికే బయటకు వచ్చాయి. వాటి మీద సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కంటెంట్ క్రియేటర్స్ ఈ బిల్లు పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్ర జర్నలిస్టుల నోరు మూయించేందుకే మోదీ ప్రభుత్వం ఈ బిల్లులో సవరణలు చేసిందని వారంటున్నారు.

డ్రాఫ్ట్ బిల్లులో ఏముంది?

ఈ బిల్లు ముసాయిదా ప్రతిలో ఇన్ స్టాగ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్లను యూజర్ బేస్ ప్రాతిపదికన ప్రభుత్వమే నిర్వచిస్తుందని, వారిని డిజిటల్ న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ గా వర్గీకరిస్తారని ఉందని హిందుస్థాన్ టైమ్స్ పత్రిక రిపోర్ట్ చేసింది. టిక్ టాక్ యాప్ ను ఇండియాలో బ్యాన్ చేసినప్పటికీ, వారిని కూడా ఇందులో చేరుస్తారని తెలుస్తోంది.

ఈ డిజిటల్ బ్రాడ్ కాస్టర్స్ ను ఓటీటీ బ్రాడ్ కాస్టింగ్, రిజిస్టర్ డిజిటల్ మీడియా సేవల పరిధిలో కాకుండా వేరే కేటగిరీగా గుర్తిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి.

తొలి ముసాయిదా ప్రతిలోనే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ తమకు నచ్చినట్లుగా కంటెంట్ క్రియేట్ చేయడానికి వీల్లేకుండా ఒక ప్రోగ్రామ్ కోడ్ కు కట్టుబడి ఉండాలనే ప్రతిపాదన ఉంది.

ఈ బిల్లు చట్టం రూపం తీసుకున్న నెలరోజుల్లోగా కంటెంట్ క్రియేటర్స్ తమ వివరాలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఫాలోవర్ల సంఖ్యతో సంబంధం లేకుండా న్యూస్ షేర్ చేసే ప్రతి అకౌంటుకీ ఈ నిబంధన వర్తించే అవకాశం ఉంది.

ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ సేవల సంస్థల మాదిరిగానే డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ కూడా మూడు అంచెల రెగ్యులేటరీ విధానం కింద రిజిస్టర్ కావాల్సి ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి.

ఈ బిల్లులో ఉందని చెబుతున్న మరో ముఖ్యమైన నిబంధన ఏమిటంటే, కంటెంట్ తయారు చేసే వారు సొంతంగా ‘కంటెంట్ ఇవాల్యుయేషన్ కమిటీ’ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ కమిటీ చూసిన తరువాతే ఏ వీడియోనైనా పోస్ట్ చేయాలి. ఈ రూల్ పాటించకపోతే క్రిమినల్ లయబిలిటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించేందుకు కేంద్రం ఒక బ్రాడ్ కాస్ట్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం, పరిశ్రమకు చెందిన నిపుణులు నామినేట్ చేసిన అయిదుగురు సభ్యులు ఉంటారు.

సోషల్ మీడియా కంపెనీలు మధ్యవర్తులు మాత్రమే…

మెటా, యూట్యూబ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా సంస్థలను ఈ బిల్లు ఇంటర్మీడియరీస్ గా గుర్తిస్తుంది. ప్రభుత్వం కోరిన సమాచారం ఏదైనా వారు ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే, వారిపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకునేలా ఇందులో నిబంధనలను చేర్చినట్లు తెలుస్తోంది.

కంటెంట్ విషయానికి వస్తే చట్టపరమైన నిబంధనలు పాటించని యూజర్ ను మాత్రమే ఈ చట్టం టార్గెట్ చేస్తుంది. సోషల్ మీడియా ఇంటర్మీడియరీలను ఏమీ బాధ్యులను చేయదు.

గూగుల్ యాడ్ సెన్స్, ఫేస్ బుక్ ఆడియన్స్ నెట్ వర్క్, తబూలా వంటి అడ్వర్టయిజింగ్ నెట్ వర్క్ సంస్థలను కూడా ఈ బిల్లు చట్ట పరిధిలోకి తీసుకువస్తుంది. వీటిని అడ్వర్టయిజింగ్ ఇండర్మీడియరీస్ అని వ్యవహరిస్తుంది.

సోషల్ మీడియ పీక నొక్కుతున్నారా?

కంటెంట్ తయారు చేసి సోషల్ వేదికల మీద పోస్ట్ చేసే వారి మీద నియంత్రణ ఈ స్థాయిలో ఉంటే అది భావ వ్యక్తీకరణ, పత్రికా స్వేచ్ఛను దెబ్బ తీస్తుందని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన మీడియా-పబ్లిసిటీ విభాగానికి అధిపతిగా ఉన్న ఖేరా, ఈ బిల్లు చట్టంగా మారితే వీడియోలు పోస్ట్ చేసేవారు, పాడ్ కాస్టులు చేసేవారు ఎవరైనా ‘డిజిటల్ న్యూస్ బ్రాడ్ కాస్టర్స్’ కిందకు వస్తారని, దీనివల్ల తక్కువ పెట్టుబడితో ఈ రంగంలో పని చేస్తున్న స్వతంత్ర జర్నలిస్టులు దెబ్బతింటారని అన్నారు.

ఈ బిల్లు ప్రతిని బహిరంగపర్చాలని యూట్యూబర్ల డిమాండ్

ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లును బహిరంగపర్చాలని యూట్యూబర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ బిల్లులో ఏముందన్నది ప్రజలకు తెలియాలని వారంటున్నారు. కొత్తగా చేసిన సవరణలతో భావ వ్యక్తీకరణపై దాడి చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదని నెటిజన్లు అంటున్నారు.

ఈ బిల్లు విషయంలో ప్రభుత్వం నిజంగానే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ప్రజలకు అబద్ధాలు చెబుతోందా? ప్రభుత్వాన్ని విమర్శించేవారి నోళ్ళు మూయించే లక్ష్యంతోనే ఇందులో సవరణలు చేశారా? ప్రజల నుంచి వస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మోదీ సర్కార్ దే.

Show Full Article
Print Article
Next Story
More Stories