Train Accident: పట్టాలు తప్పిన బెంగళూరు-హారా బోగీలు..ఘోర రైలు ప్రమాదం,207 మంది దుర్మరణం

Derailed Bengaluru-Hara Bogies
x

Train Accident: పట్టాలు తప్పిన బెంగళూరు-హారా బోగీలు..ఘోర రైలు ప్రమాదం,207 మంది దుర్మరణం

Highlights

Train Accident: అదే సమయంలో వాటిని ఢీకొన్న కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌

Train Accident: ఒడిశాలో మాటలకందని మహా విషాదం చోటుచేసుకుంది. బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం అనూహ్య రీతిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 207 మంది దుర్మరణం పాలయ్యారు. 900 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాత్రివేళ ప్రమాదం చోటుచేసుకోవడంతో.. బోల్తాపడిన బోగీల్లో ఇంకా ఎంతమంది చిక్కుకొని ఉండొచ్చనేది అధికారులు సరిగా అంచనా వేయలేకపోతున్నారు. తాజా దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో మన దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద రైలుప్రమాదం ఇదేనని పలువురు చెబుతున్నారు. ప్రమాదంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల్లో బెంగాల్‌వాసులే ఎక్కువమంది ఉన్నట్లు తెలుస్తోంది.

స్థానిక అధికారుల కథనం ప్రకారం- బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డాకు వెళ్తున్న బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు 7 గంటల సమయంలో తొలుత పట్టాలు తప్పింది. ఫలితంగా దాని పలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడిపోయాయి. వాటిని షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. దాంతో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 15 బోగీలు బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదం అక్కడితో ఆగిపోలేదు. బోల్తాపడ్డ కోరమండల్‌ కోచ్‌లను పక్కనున్న ట్రాక్‌పై దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొంది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత భారీగా పెరిగింది. ప్రమాదానికి గురైన సమయంలో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ కోల్‌కతా నుంచి చెన్నైకి వెళ్తోంది. అయితే రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్‌ శర్మ కథనం మాత్రం మరోలా ఉండటం గమనార్హం. తొలుత కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిందని అమితాబ్‌ చెప్పారు. దాని 10-12 బోగీలు బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ రైలు మార్గంలో పడ్డాయని పేర్కొన్నారు. అనంతరం ఆ సూపర్‌ఫాస్ట్‌ బోగీలు పక్క ట్రాక్‌పై బోల్తాపడ్డాయని వివరించారు.

ప్రమాదం అనంతరం బోగీల్లో చిక్కుకున్నవారి హాహాకారాలతో ఘటనాస్థలం దద్దరిల్లింది. దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే అధికార వర్గాలు అప్రమత్తమయ్యాయి. సత్వరం అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. బాలేశ్వర్‌లోని వివిధ ఆసుపత్రుల్లో 400 మంది క్షతగాత్రులను అధికారులు చేర్పించారు. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌ సహా బాలేశ్వర్‌, భువనేశ్వర్‌, భద్రక్‌, మయూర్‌బంజ్‌, కటక్‌ల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను అప్రమత్తం చేశారు. బోల్తాపడ్డ బోగీల నుంచి ఇప్పటివరకు 50 మంది మృతదేహాలను బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. ఇంకా పలువురు వాటి లోపల చిక్కుకొని ఉన్నారని, వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. స్థానికులు కూడా తమకు సహకరిస్తున్నారని, అయితే చీకటి కావడంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోందని వివరించారు. ఇప్పటివరకు నాలుగు యూనిట్ల ఎస్‌డీఆర్‌ఎఫ్‌, మూడు యూనిట్ల ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలను మోహరించారు. 115 అంబులెన్సులను రంగంలోకి దించారు.

తాజా దుర్ఘటనపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భువనేశ్వర్‌, కోల్‌కతాల నుంచి సహాయక బృందాలను ఘటనాస్థలానికి ఇప్పటికే పంపించినట్లు తెలిపారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, వాయుసేన బృందాలనూ తరలిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.50 వేల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. ఘటనాస్థలంలో తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించినట్లు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ వెల్లడించారు. శనివారం తాను అక్కడికి వెళ్లనున్నట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ప్రధాని కూడా పరిహారం ప్రకటించారు.

ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా బహనాగ రైల్వేస్టేషన్‌ సమీపంలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు భావిస్తున్నారు. మరో 350 మందికిపైగా క్షతగాత్రులై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బహనాగ్‌ రైల్వేస్టేషన్‌ వద్ద సాయంత్రం 7.15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలికి చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఓడీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. బోగీల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. క్షతగాత్రులను సోరో, గోపాల్‌పూర్, ఖంటపాడ పీహెచ్‌సీలకు తరలించారు. బాలేశ్వర్‌లో ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. బాధితుల సమాచారం కోసం ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 06782262286కు ఫోన్‌ చేయాలని అధికారులు తెలిపారు. సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసేందుకు మూడు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, నాలుగు రాష్ట్ర సహాయక బృందాలు రంగంలోకి దించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories