Delta Plus: భారత్‌లో క్రమంగా విస్తరిస్తోన్న డెల్టా ప్లస్ కేసులు

Delta Plus Cases Expanding in India
x
Representational image 
Highlights

Delta Plus: 12 రాష్ట్రాల్లో ఇప్పటివరకు 51 కేసులు నమోదు * మధ్యప్రదేశ్‌లో ఇద్దరు..మహారాష్ట్రలో ఒకరి మృతి

Delta Plus: కరోనా కొత్త వేరియంట్లు ప్రపంచానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. సెకండ్‌ వేవ్‌ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత్‌లోనూ ఇప్పుడు కొత్త వేరియంట్‌ హడలెత్తిస్తుంది. భారత్‌లో ఇన్నాళ్లు నాలుగైదు రాష్ట్రాలకే పరిమితమైన డెల్టా ప్లస్‌ కేసులు.. రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. శుక్రవారం నాటికి 12 రాష్ట్రాల్లో 51 కేసులు బయటపడ్డాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 22 కేసుల రాగా.. తమిళనాడులో 9, మధ్యప్రదేశ్‌లో 7 కేసులు వెలుగుచూశాయి. కేరళలో మూడు, పంజాబ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో రెండేసి కేసులు.. ఏపీ, ఒడిశా, రాజస్థాన్‌, జమ్ము, కశ్మీర్‌, హరియాణా, కర్ణాటకల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.

మధ్యప్రదేశ్‌లో మొత్తం 7 డెల్టా ప్లస్ కేసులు నమోదవగా.. ఇద్దరు మరణించారు. అయితే, వారిద్దరూ టీకా వేయించుకోనివారేనని అధికారులు తెలిపారు. డెల్టా ప్లస్‌ కేసులు అత్యధికంగా నమోదైన మహారాష్ట్రలో కూడా ఆ వేరియంట్‌ బారిన పడి ఒకరు మరణించారు. రత్నగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో 80 ఏళ్లు దాటిన వృద్ధురాలు ఈ వేరియంట్‌తో మరణించినట్టు అధికారులు వెల్లడించారు. అయితే మూడు నెలల్లో 50 కేసులు మాత్రమే రావడంతో.. కేసులు పెరిగే ట్రెండ్‌లో ఉన్నాయనే విషయం ఇప్పుడే చెప్పలేమని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ డైరెక్టర్‌ సుజీత్‌సింగ్‌ తెలిపారు. అయితే కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక సహా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.

తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటకల్లో కేసులు నమోదు కావడంతో రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. సెకండ్‌వేవ్‌లో మహారాష్ట్రలో కేసులు భారీగా పెరిగిన కొద్దిరోజులకే తెలంగాణలోనూ వేగంగా వ్యాపించింది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల వైద్య, ఆరోగ్య అధికారులను డీహెచ్‌ శ్రీనివాసరావు అప్రమత్తం చేశారు. కొవిడ్‌ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా రోజుకు లక్ష తగ్గకుండా చేయాలని సూచించారు. ఈ వేరియంట్‌ సోకినవారికి ఆక్సిజన్‌ అవసరం ఎక్కువగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories