Sheesh Mahal: శీష్ మహల్‌‌కు దూరంగా ఢిల్లీ కొత్త సీఎం..?

Delhi New Bjp CM Will Not Stay Sheesh Mahal
x

శీష్ మహల్‌‌కు దూరంగా ఢిల్లీ కొత్త సీఎం..?

Highlights

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కాషాయ జెండా ఎగిరింది. ఇక ముఖ్యమంత్రి రేసులో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి.

Sheesh Mahal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కాషాయ జెండా ఎగిరింది. ఇక ముఖ్యమంత్రి రేసులో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ పై మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ విజయం సాధించారు. ఆయనకే సీఎం పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధాని మోడీ 4 రోజుల పాటు విదేశీ టూర్ తర్వాత ఢిల్లీ సీఎం ఎవరన్నది క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే ఢిల్లీ కొత్త సీఎం శీష్ మహల్‌లో ఉండరంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా పనిచేసిన సమయంలో సివిల్ లైన్స్ లో 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్ బంగ్లాను అధికారిక నివాసంగా ఉపయోగించేవారు. ఆ బంగ్లాను బీజేపీ శీష్ మహల్‌గా అభివర్ణించింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి 7 స్టార్ రిసార్టుగా మార్చుకున్నారని బీజేపీ విమర్శించింది. ఎన్నికల ప్రచారంలోనూ ఈ విషయాన్ని ఆయుధంలా వాడుకుంది. ఈ బంగ్లాను పునరుద్దరించడంలో పెద్ద స్కామ్ జరిగిందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది.

నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించామని.. కానీ తానేమీ అద్దాల మేడ కట్టుకోలేదని ప్రధాని మోడీ సైతం కేజ్రీవాల్ ను విమర్శించారు. ఈ అంశం ఢిల్లీ ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఆప్ ఓటమికి ఇది కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. ఆప్ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని ఓటమి పాలు చేశాయి. ఇక బీజేపీకి ఘన విజయాన్ని అందించాయి. అయితే విమర్శలకు తావు లేకుండా ఆ బంగ్లాకు దూరంగా ఉండాలని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం.

ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ బీజేపీ ఏకంగా 48 స్థానాల్లో విజయం సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. కీలక నేతల్లో ఆప్ సీఎం అతిశీ ఒక్కరే గెలుపొందారు. ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా మనీశ్ సిసోడియా వంటి కీలక నేతలు సైతం ఓటమి పాలుకావడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్టైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories