మోడీ బాణం ఢిల్లీలో మళ్లీ ఎందుకు ఫెయిలైంది?

మోడీ బాణం ఢిల్లీలో మళ్లీ ఎందుకు ఫెయిలైంది?
x
Highlights

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఒకరకంగా కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించాయి. కనివిని ఎరుగని రీతిలో భారీ సైన్యాన్ని మోహరించింది కమలదళం. 56 మంది కేంద్రమంత్రులు,...

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఒకరకంగా కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించాయి. కనివిని ఎరుగని రీతిలో భారీ సైన్యాన్ని మోహరించింది కమలదళం. 56 మంది కేంద్రమంత్రులు, 11 మంది ముఖ్యమంత్రులు, 200 మంది ఎంపీలను యుద్ధక్షేత్రంలో నిలిపింది. దీనికితోడు ఆరెస్సెస్, వీహెచ్‌పీ కరసేవకులు. ఇంకోవైపు ఏకంగా నరేంద్ర మోడీ ప్రచారాన్ని హోరెత్తించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ ‌షా సమర వ్యూహాన్ని రచించారు. అటు కేజ్రీవాల్‌ మాత్రం తనే ఒక సైన్యంగా కదిలారు. ఈ ఎన్నికలు పార్లమెంట్ ఎలక్షన్స్ స్థాయిలో మోడీ వర్సెస్ కేజ్రీవాల్‌గా సాగాయి.

ఢిల్లీ మరోసారి చీపురు వైపు చూస్తోందని ముందే గ్రహించిన కమలం, ఆఖరి వరకు సకల అస్త్రాలూ సంధించింది. చావోరేవోగా పోరాడింది కాషాయ దళం. మోడీ పౌరసత్వ ఆయుధాన్ని వదిలితే...స్వచ్చమైన నీటి సరఫరా చూడండి అన్నారు కేజ్రీవాల్. అమిత్‌ షా షహీన్‌ బాగ్‌ టెర్రరిస్టు అంటే, నిరంతరం కారుచౌకగా ఇస్తున్న కరెంటు చూడండి అంటూ ఓటర్లకు విన్నవించారు కేజ్రీవాల్. ఆఖరికి మోడీ రామబాణం, హనుమాన్‌ ఆయుధం సంధించినా, కేజ్రీవాల్ మాత్రం, తన హయాంలో సకల సదుపాయాలతో నెలకొల్పిన సర్కారీ బడులను చూడండంటూ ప్రచారాన్ని హోరెత్తించారు. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన బ్రహ్మాస్త్రమైన హిందూత్వకు సంబంధించిన సకల ఆయుధాలనూ సంధిస్తే, కేజ్రీవాల్‌ మాత్రం, కేవలం తన సుపరిపాలన గురించి మాత్రమే వివరించారు. బీజేపీ పన్నిన సెంటిమెంట్‌ ఉచ్చులో మాత్రం పడలేదు. అదే హస్తిన జనాలను ఆలోచింపజేసినట్టుంది. ఎగ్జిట్‌పోల్స్‌‌ను బట్టి, ఆమ్‌ఆద్మీని మరోసారి పీఠమెక్కిస్తున్నవి, కేజ్రీవాల్‌ గుడ్‌ గవర్నెన్స్ అని అర్థమవుతోంది.

తన ఐదేళ్ల పాలనలో చేపట్టిన వివిధ పథకాలనే ప్రచారంలో ప్రజల ముందు పెట్టారు సీఎం కేజ్రీవాల్. పేదలకు ఆధునిక సౌకర్యాలతో వైద్య సేవలందించే మొహల్లా క్లినిక్స్‌‌ను ఏర్పాటు చేశారు. అలాగే కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారు. మహిళల భద్రత కోసం సీసీటీవీలు, వీధి దీపాలు ఏర్పాటు చేశారు. అలాగే మహిళలకు బస్సులు, ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. ఉచిత వైఫై ఇచ్చారు. అవీనీతి రహిత పాలన అందించానని చెప్పుకున్నారు. ఇలా తన పాలన గురించే చెప్పుకుని, ఓట్లు అడిగారు కేజ్రీవాల్. తన ఐదేళ్ల పాలన గురించి లగే రహో కేజ్రీవాల్ అంటూ అదిరిపోయే పాటను విడుదల చేశారు.

ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు చీపురు పార్టీకి మళ్లీ పట్టాభిషేకం చేశాయి. బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా పని చేయలేదని అర్థమవుతోంది. అలాగే కాంగ్రెస్‌ కాస్త పుంజుకున్నా, మూడో స్థానానికి పరిమితమవుతోంది. ఎలాగూ ఆప్‌-బీజేపీ మధ్య పోటీ అని గ్రహించిన కాంగ్రెస్‌, కమలం ఓడితే చాలని, లోపాయికారీగా కేజ్రీవాల్‌కు సపోర్ట్ ఇచ్చిందన్న చర్చ జరుగుతోంది.

మొత్తానికి ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలు నిజమైతే, చీపురు పార్టీ దేశానికి కొత్త నిర్దేశం ఇచ్చిందనుకోవాలి. సకల భారత సమాహారమని చెప్పుకునే హస్తినలో, మోడీ సత్తాచూపించలేదని అసలు ఫలితాలు రుజువు చేస్తే, మాత్రం కమలానికి చిక్కులే. దేశవ్యాప్తంగా గాలి మారుతోందని, మోడీ హవా తగ్గుతోందనడానికి నిదర్శనమన్న మాటలు వినపడటం ఖాయం. ఢిల్లీ ఫలితాలతో విపక్షాలకు కేజ్రీవాల్‌కొత్త దారి చూపొచ్చు. దేశవ్యాప్తంగా మోడీని ఢీకొట్టగల నాయకుడిగా, అరవింద్ కేజ్రీవాల్‌ కొత్త దిక్సూచి కావచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories