Delhi Assembly Election 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు... తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

Delhi Assembly Election 2025 explained, AAP vs BJP vs congress fight in Delhi political war to win the national capital
x

Delhi Assembly Election 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు... తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

Highlights

Delhi Assembly Election 2025 political scenario: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మూడోసారి ఎలాగైనా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఆమ్ ఆద్మీ...

Delhi Assembly Election 2025 political scenario: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మూడోసారి ఎలాగైనా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా ప్రయత్నిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉండటంతో పాటు, దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పటికీ దేశ రాజధానిలో అధికారంలో లేని లోటు బీజేపిని వేధిస్తోంది. అందుకే ఈ ఎన్నికల్లో గెలిచి ఆ లోటును పూడ్చుకోవాలని ఆ పార్టీ కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ కంటే ముందు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉండేది. అరవింద్ కేజ్రీవాల్ కంటే ముందు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. ఈసారి అయినా మళ్లీ గెలిచి కాంగ్రెస్ ఈజ్ బ్యాక్ అనిపించుకోవాలని ఆ పార్టీ కూడా అంతే పోరాడుతోంది.

అరవింద్ కేజ్రీవాల్ ముందున్న సవాళ్లు

రెండోసారి అధికారంలోకొచ్చాక అరవింద్ కేజ్రీవాల్ పై, ఆయన కేబినెట్ మంత్రులపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. అన్నింటికి మించి ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ వారిని తీవ్ర విమర్శల పాలు చేసింది. ఈ కేసులోనే 2024 మార్చి 21న ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు.

అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పై బయటికి వచ్చినప్పటికీ... ముఖ్యమంత్రి బాధ్యతలను అతిషికి అప్పగించారు. తాను ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాతే మరోసారి ముఖ్యమంత్రి అవుతానని అన్నారు. తన నిజాయితీని, ఢిల్లీకి తాను చేసిన అభివృద్ధిని ఓటర్లే గుర్తిస్తారు అంటూ అరవింద్ కేజ్రీవాల్ తనకు తానే ఎన్నికల పరీక్ష పెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ పాస్ అవుతారా లేదా అనేది ఫిబ్రవరి 8న ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో తేలిపోతుంది.

ఢిల్లీ మినిష్టర్ మనీష్ సిసోడియా కూడా అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయి 17 నెలల పాటు జైల్లో ఉన్నారు. ఆప్ నేతలు సంజయ్ సింగ్, సత్యేందర్ జైన్, అమానతుల్లా ఖాన్ వంటి వారు కూడా అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు.

ఇవన్నీ ఆ పార్టీకి కొంత ఇబ్బంది పెట్టే అంశాలు. మరోవైపు బీజేపి కూడా ఇవే అవినీతి ఆరోపణలను ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో అస్త్రాలుగా వాడుకుంది. అవినీతికి వ్యతిరేకం అని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి అవినీతిలో కూరుకుపోయిందని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా వంటి బీజేపి అగ్ర నేతలు ఆరోపించారు.

ఢిల్లీ ప్రభుత్వం vs ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ - సుప్రీం కోర్టు ఏం చెప్పింది?

అనేక సందర్భాల్లో ఢిల్లీ ప్రభుత్వానికి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్లకు మధ్య విభేదాలు కనిపించాయి. ఢిల్లీ అభివృద్ధి ప్రణాళికలకు లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డం పడుతున్నారని ఆప్ సర్కార్ ఆరోపిస్తోంది. ఢిల్లీ సర్కారుకు లెఫ్టినెంట్ గవర్నర్ సహకరించడం లేదని ముఖ్యమంత్రి హోదాలో అరవింద్ కేజ్రీవాల్ అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపించారు. ఢిల్లీలో అభివృద్ధి జరిగితే ఆ పేరు ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తుందనే అభద్రతా భావంతోనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి సర్కారు ఈ కుట్రలు చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు.

ఇదే విషయమై ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించింది. అయితే, ఫెడరల్ లాస్ ప్రకారం ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతమైనందున మిగతా రాష్ట్రాల గవర్నర్లతో పోల్చుకుంటే, ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ కు కొన్ని అదనపు అధికారాలు ఉంటాయి. ఇదే విషయమై సుప్రీం కోర్టు స్పందిస్తూ... ప్రభుత్వ భూములు, పబ్లిక్ ఆర్డర్, పోలీసు పవర్స్ విషయంలోనే లెఫ్టినెంట్ గవర్నర్‌కు అధికారాలు ఉంటాయని స్పష్టం చేసింది.

అయితే, ఆ తరువాత బ్యూరోక్రాట్స్‌పై కూడా లెఫ్టినెంట్ గవర్నర్లకు అధికారాలు ఉంటాయంటూ కేంద్రం ఓ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. కేంద్రం తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్ ను ఆప్ సర్కార్ ఖండించింది. తమ ప్రభుత్వానికి అధికారాలు లేకుండా చేయడం కోసమే ఈ ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారని ఆప్ సర్కార్ ఆరోపించింది.

విడిపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్

గతంలో ఇండియా బ్లాక్‌ కూటమిలో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు కలిసి పనిచేశాయి. కానీ ఈ ఎన్నికల నాటికి రెండు పార్టీలు విడిపోయాయి. అంతేకాదు... ఇన్నాళ్లూ కలిసి పనిచేసి తప్పు చేశామంటూ పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి.

రాబోయే ఐదేళ్ల కాలానికి ఓటిందగ్ జరిగే ఈ 11 గంటలే అత్యంత కీలకం అని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఓటర్లకు సూచిస్తోంది. ఏదేమైనా ఇప్పుడు ఒక రకంగా ఆ మూడు పార్టీలకు గెలుపు ఒక అత్యవసరం. మరి ఢిల్లీ ఓటర్లు ఎవరి వైపు నిలుస్తారనేది ఫలితమే చెప్పాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories