Bihar: బిహార్ ఛాప్రా జిల్లాలో 73కు పెరిగిన కల్తీ మద్యం మరణాలు

Deaths From Adulterated Liquor Reaches 73 in Bihar Chapra District
x

Bihar: బిహార్ ఛాప్రా జిల్లాలో 73కు పెరిగిన కల్తీ మద్యం మరణాలు

Highlights

Bihar: మృతుల సంఖ్య 300కుపైనే ఉంటుందని విపక్షాలు ఆరోపణ

Bihar: బిహార్‌లో కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరికొంతమంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 73కు పెరిగింది. అయితే మరణాలపై ప్రభుత్వం వాస్తవాలను దాస్తోందని చిరాగ్ పాశ్వాన్ ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు 300కుపైనే చనిపోయారని చెప్తున్నారు. ఛాప్రా జిల్లాతో పాటు సరన్, సివాన్, బెగుసరాయ్ జిల్లాల్లోనూ కల్తీ మద్యం బారిన పడి పలువురు మరణించారు. ఇదిలా ఉంటే మరోవైపు ఈ కల్తీ మద్యం ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కల్తీ మద్యం పోలీస్‌స్టేషన్ల నుంచే బయటకు వెళ్లినట్లు సమాచారం. బిహార్‌లోని ఎక్సైజ్‌శాఖ భారీ మోతాదులో కల్తీ మద్యాన్ని తయారు చేసే పదార్థాలను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేసేందుకు మష్రక్ పీఎస్‌లోనే దాచి ఉందని అయితే డ్రముల్లో ఉంచిన కల్తీ మద్యం అదృశ్యం అయినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.

దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇది ఖచ్చితంగా పీఎస్‌లోని సిబ్బంది నిర్వాకమే అని పలువురు విమర్శిస్తున్నారు. చికిత్స పొందుతున్న బాధితులు తాము మద్యాన్ని మష్రక్ మార్కెట్ నుంచే కొనుగోలు చేసినట్లు తెలిపారు. కల్తీ మద్యం కేసులో ఇప్పటివరకు 213 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. బాధితుల్లో 25 మంది కంటిచూపు కోల్పోయినట్లు తెలుస్తోంది.

బిహార్‌లో కల్తీ మద్యానికి 300 మందికిపైగా బలయ్యారని విపక్ష ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ ఆరోపించారు. నిజాన్ని ప్రభుత్వం అణిచివేస్తుందని మండిపడ్డారు. పోస్టుమార్టం పరీక్షలు లేకుండానే అంత్యక్రియలు ముగించేస్తున్నారని తెలిపారు. బాధిత కుటుంబాలపై ఒత్తిడి తెస్తున్నారని మరణాలకు కల్తీ మద్యం కాదని చెప్పాలని బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. లేదంటే జైలుకు పంపుతామని అధికారులు హెచ్చరిస్తున్నారని పాశ్వాన్ ఆరోపిస్తున్నారు. సీఎం మౌనం అవినీతి అధికారులకు వరంగా మారిందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories