భారత్‌లో మళ్లీ కరోనా హైటెన్షన్

భారత్‌లో మళ్లీ కరోనా హైటెన్షన్
x
Highlights

* బ్రిటన్‌‌ను వణికిస్తున్న కరోనా న్యూ వెర్షన్ * బ్రిటన్‌ ఎఫెక్ట్‌తో భారత్‌లోనూ కలకలం * దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల్లో అలర్ట్ * ముంబైలో నైట్ కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం * జనవరి 5వరకు ముంబైలో నైట్ కర్ఫ్యూ * బ్రిటన్‌కు విమానాలను నిలిపివేసిన భారత్ * ప్రయాణికులతో బ్రిటన్ ఎయిర్‌పోర్టుల్లో భారీ రద్దీ

బ్రిటన్‌‌ను వణికిస్తోన్న కరోనా కొత్త వెర్షన్ భారత్‌లోనూ టెన్షన్ పుట్టిస్తోంది. ఈరోజు అర్ధరాత్రి నుంచి బ్రిటన్‌కు విమాన రాకపోకలను నిలిపివేసిన భారత్... అన్ని ఎయిర్‌పోర్టుల్లో హైఅలర్ట్ ప్రకటించింది. అన్ని విమానాశ్రయాల్లో కరోనా సర్వేలెన్స్ ఏర్పాటుచేసి అక్కడికక్కడే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేపడుతున్నారు. ముఖ‌్యంగా యూరోపియన్ యూనియన్, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను 14రోజుల క్వారంటైన్‌కు తరలిస్తున్నారు.

బ్రిటన్‌లో కరోనా స్ట్రెయిన్‌ కల్లోలం సృష్టిస్తుండటంతో ఇండియన్స్ స్వదేశానికి క్యూకడుతున్నారు. అయితే, లండన్ నుంచి భారత్‌కు వచ్చిన వారిలో ఇప్పటివరకు ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీళ్లలో కొత్త రకం కరోనా వైరస్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? లేదో? తేల్చేందుకు ఎన్సీడీసీకి శాంపిల్స్‌‌ను పంపారు. అంతేకాదు, వీళ్లంతా ఇండియా వచ్చాక... ఎక్కడెక్కడ తిరిగారో... ఎవరెవరిని కలిశారో ఆరా తీస్తున్నారు.

లండన్ నుంచి మొత్తం 266మంది ప్రయాణికులు రాగా... అందులో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వీరిలో ఐదుగురు ఢిల్లీకి... ఒకరు చెన్నైకి వెళ్లారు. దాంతో, పాజిటివ్ వచ్చినవాళ్లను ఆస్పత్రికి.... నెగటివ్ వచ్చిన వాళ్లను క్వారంటైన్‌కు తరలించారు. అయితే, కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లలో సెకండ్ స్ట్రెయిన్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

యూకేలో బయటపడిన కొత్త రకం కరోనా వైరస్‌తో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంబైతోపాటు ప్రధాన నగరాల్లో నైట్ కర్ఫ్యూ విధించింది. బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో... జనవరి 5వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు మహారాష్ట్ర సర్కారు ప్రకటించింది. రాత్రి 11గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. దేశంలో ఇప్పటివరకు మహారాష్ట్రలోనూ, ముంబైలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో ముందుజాగ్రత్తగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కరోనా ముప్పు ఇంకా తొలిగిపోలేదని, ప్రజలం‍దరూ కోవిడ్ నిబంధనలు తప్పకుండా అనుసరించాలని సీఎం ఉద్ధవ్ కోరారు.

యూరప్‌ను వణికిస్తున్న కరోనా కొత్త రూపం

లండన్‌/హేగ్‌/బెర్లిన్‌: యూరప్‌ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి ఇప్పుడు మరో రూపం సంతరించుకుని మరింత తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ వైరస్‌ కొత్త రూపం 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతోందంటూ బ్రిటన్‌ ప్రభుత్వం ఆదివారం నుంచి కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. ఈ వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వచ్చే వరకు, కొన్ని నెలలపాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆ దేశ ఆరోగ్య మంత్రి ప్రకటించారు. అయితే, వైరస్‌ తమ సరిహద్దులు దాటి లోపలికి ప్రవేశించకుండా పొరుగున ఉన్న పలు యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) దేశాలు పలు ముందు జాగ్రత్తలు ప్రకటించాయి.

దీంతో లండన్‌లోని పాంక్రాస్‌ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు బారులు తీరారు. ఆంక్షలు కొన్ని నెలలపాటు అమల్లో ఉండొచ్చని బ్రిటన్‌ ప్రభుత్వం చెబుతోంది. ఇక ఆ దేశంతో విమాన సర్వీసులను ఈయూ దేశాలు రద్దు చేస్తున్నాయి.

వైరస్‌ వ్యాప్తి అదుపు తప్పింది

బ్రిటన్‌లో తాజాగా అమల్లోకి వచ్చిన ఆంక్షలు కొన్ని నెలలపాటు కొనసాగే అవకాశాలున్నాయని ఆరోగ్య మంత్రి మాట్‌ హాంకాక్‌ తెలిపారు. ప్రజలంతా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే క్రిస్మస్‌ వేడుకలను రద్దు చేయాలని తాము కోరుకోవడం లేదని ఆయన అన్నారు. అయితే, కొత్త రకం కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు స్పష్టమైన ఆధారాలున్నందున, దానిని అడ్డుకోవ డమే ప్రభుత్వ అభిమతమన్నారు. కొత్త రకం వైరస్‌ వ్యాప్తి అదుపు తప్పిందని వ్యాఖ్యానిస్తూ ఆయన.. ప్రతి ఒక్కరూ తమకు వైరస్‌ సోకిందని భావించి అప్రమత్తతతో ఉండాలని కోరారు. కొత్తగా బయటపడిన కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రత 70 శాతం ఎక్కువగా ఉందని హాంకాక్‌ అన్నారు. ఈ వైరస్‌తో మరణాలు పెరిగాయా అన్న విషయం నిర్థారణ కాలేదన్నారు.

క్రిస్మస్‌ రోజు కూడా వ్యాక్సినేషన్‌

వారాంతంలోగా 5 లక్షల మందికి కోవిడ్‌ టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా శని వారం వరకు 3.50 లక్షల మందికి వ్యాక్సి నేషన్‌ పూర్తయిందని ఆరోగ్య మంత్రి హాంకాక్‌ వివరించారు. క్రిస్మస్‌ రోజున కూడా వ్యాక్సినేషన్‌ కొనసాగనుంది. కరోనా కొత్త రూపం వ్యాప్తితో దేశంలో తలెత్తిన పరిస్థితులపై చర్చించేందుకు యూకే ఆరోగ్య శాఖ సోమవారం అత్యవసరంగా భేటీ కానుంది.

అప్రమత్తమైన ఈయూ దేశాలు

బ్రిటన్‌లో కొత్తరకం కరోనా వైరస్‌ వ్యాప్తి పై ఈయూ దేశాలు అప్రమత్తమ య్యా యి. ఆదివారం నుంచి జనవరి ఒకటో తేదీ వరకు బ్రిటన్‌ నుంచి వచ్చే విమానా లపై నెదర్లాండ్స్‌ నిషేధం విధించింది. యూకే నుంచి అన్ని రకాల ప్రయాణా లను నిషేధిస్తున్నట్లు ఇటలీ తెలిపింది. 24 గంటలపాటు యూకే నుంచి వచ్చే విమా నాలను రద్దు చేస్తున్నట్లు బెల్జియం తెలి పింది. రైలు సర్వీసులను నిలుపుదల చేస్తున్నట్లు వెల్లడించింది. జర్మనీ ప్రభుత్వం కూడా బ్రిటన్‌ నుంచి వచ్చే విమానాలపై నిషేధించేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. యూకే నుంచి వచ్చే వారికి క్వారంటైన్‌ నిబంధనలను కఠిన తరం చేస్తున్నట్లు చెక్‌ రిపబ్లిక్‌ తెలిపింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంటోంది?

కరోనా వైరస్‌ కొత్త రూపం వ్యాప్తిపై యూకే ప్రభుత్వంతో కలిసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కొత్త వైరస్‌ జాడలు సెప్టెంబర్‌లోనే కనిపించాయని వెల్లడించింది. ఇది వైరస్‌ కొత్త రూపమా? కాదా? ఎంత వేగంగా వ్యాప్తి చెందుతోంది? అనే విషయాలపై లోతుగా అధ్యయనం జరుపుతున్నట్లు డబ్ల్యూహెచ్‌వో అధికారి మరియా వాన్‌ కెర్ఖోవ్‌ తెలిపారు. ఇలాంటి వైరస్‌ను ఇప్పటికే డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియాలో గుర్తించామన్నారు. ఒక్కో కేసు చొప్పున బయటపడిందనీ, వ్యాప్తి అంతటితో ఆగిపోయిందని వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories