Coronavirus: దేశంలో మళ్లీ కరోనా వైరస్ బుసలు.. ఒక్క రోజే 734 కేసులు నమోదు

Coronavirus Cases Are Increasing In India
x

Coronavirus: దేశంలో మళ్లీ కరోనా వైరస్ బుసలు.. ఒక్క రోజే 734 కేసులు నమోదు 

Highlights

Coronavirus: గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడులో విజృంభణ

Coronavirus: దేశంలో మళ్లీ కరోనా వైరస్ బుసలు కొడుతోంది. ఓవైపు ఇన్‌ఫ్లూయెంజా వైరస్ ముప్పేట దాడి చేస్తుంటే మరోవైపు...కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఇలా రెండు వైపులా రెండు రకాల వైరస్‌లు దాడి చేస్తుండడం దేశ ప్రజలను కలవరపెడుతోంది. రోజు రోజుకు కరోనా కేసులతో పాటు ఇన్‌ఫ్లూయెంజా కేసులు పెరుగుతుండడంతో...మరోసారి హెల్త్ ఎమర్జన్సీ ఏర్పడే సూచనలు కన్పిస్తున్నాయి. దేశంలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో..కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు హెచ్చరిస్తూ..హై అలెర్ట్ ప్రకటించింది. సుమారు 4 నెలల తర్వాత బుధవారం ఒక్కరోజే...734 కరోనా కేసులు నమోదు కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. యాక్టివ్ కేసులు కూడా గణనీయంగా 4, 623కు చేరడంతో అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్రం. కేసులు అధికంగా నమోదు అవుతున్న గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసింది. టెస్టింగ్, ట్రాకింగ్, వ్యాక్సినేషన్, వైద్య చికిత్స ప్రక్రియలను ముమ్మరం చేయాలని కోరింది. కొవిడ్ కేసుల పెరుగుదలను సీరియస్‌గా తీసుకోవాలని, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు...కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం తెలిపింది.

దేశంలో మరోసారి కొత్త వేరియంట్ రూపంలో కరోనా విజృంభించే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటికే కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల కన్పించింది. ఇదిలా ఉంటే..మరోవైపు ఫ్లూ కేసులు కూడా రోజు రోజుకు అధికంగా నమోదు కావడంతో తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. హఠాత్తుగా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నందున..అప్రమత్తంగా ఉండాలని, నియంత్రణ మీద దృష్టి సారించాలని ఆ లేఖలో పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితుల దృష్ట్యా..కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని...అందుకే నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. ఈ పర్యవేక్షణ..క్షేత్రస్థాయిలో గ్రామాలు, మండలాలు, జిల్లాల నుంచే కొనసాగించాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. కొవిడ్-19 నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.

మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో ఏడు రోజుల వ్యవధిలోనే 500కుపైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. గుజరాత్‌లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది. అందుకే కరోనా నిబంధనలను అమలు చేయాలని, కరోనా వ్యాప్తి కట్టడికి చర్యలు చేపట్టాలని సూచించింది. ఇక గుజరాత్ తర్వాత కరోనా వ్యాప్తిలో మహారాష్ట్ర, ఆ తర్వాత తమిళనాడు ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. తెలంగాణలో వారం రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. నిత్యం 50కిపైగా కేసులూ నమోదు కావడంతో..అందరు అప్రమతంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సూచించింది.

దేశంలో కరోనా వైరస్‌తో పాటు H3N2 వైరస్ కూడా విజృంభిస్తోంది. దేశంలో ఇప్పటికే ఈ వైరస్ సోకి దాదాపు 8 మంది చనిపోయారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ H3N2 వైరస్ స్వైర విహారం చేస్తుండడంతో ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఏ ఇంట్లో చూసినా..దగ్గు, జ్వరం, వాంతులతో బాధపడే బాధితులే కన్పిస్తున్నారు. హైదరాబాద్‌ నగరంతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కన్పిస్తోంది. చిన్న ఆసుపత్రి దగ్గరి నుంచి మొదలుకొని పెద్ద ఆసుపత్రి వరకు...ప్రభుత్వ, ప్రయివేటు అన్న తేడా లేకుండా అన్ని రకాల ఆసుపత్రులు ఫ్లూ బాధితులతో కిటకిటలాడుతున్నాయి. అయితే దేశంలో వేగంగా విస్తరిస్తున్న H3N2 వల్ల భయపడాల్సిందే ఏమీలేదని వైద్యులు చెప్తున్నారు. ఈ వైరస్ మరీ అంత డేంజర్ కాదని..కరోనా జాగ్రత్తలు పాటిస్తే నయం అవుతుందని సూచిస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం, వాంతులు లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి వైద్యం తీసుకోవాలని చెప్తున్నారు. అనవసరంగా సొంత వైద్యం చేసుకోవద్దని..వైద్యులు చెప్పందే యాంటీబయాటిక్స్ వాడొద్దని హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories