Corona Virus: ఇండియాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

Corona Cases Are Increasing Again In India
x

Corona Virus: ఇండియాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

Highlights

Corona Virus: సిమ్లాలో కరోనా కారణంగా ఒక మహిళా మృతి

Corona Virus: 2019లో తొలిసారి వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ దాదాపు 2-3 ఏళ్లపాటు యావత్ ప్రపంచాన్ని వణికించింది. కానీ కొత్త కొత్త వేరియంట్‌లు పుట్టుకొస్తూ అక్కడక్కడ భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలో ఇటీవల రోజురోజుకు పెరుగుతున్న కోవిడ్ కేసుల సంఖ్య కొత్త భయాందోళనలకు గురిచేస్తోంది. వైద్య శాఖ గణాంకాల ప్రకారం, దేశంలో 24 గంటల్లో కొత్తగా 166 మందికి కోవిడ్ -19 సోకింది. ఈ కొత్త కేసులు ఎక్కువగా కేరళ రాష్ట్రంలోనే నమోదవడం మరింత కలవరపెడుతోంది.

దేశంలో కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. చాలా రోజుల తర్వాత దేశంలో మళ్లీ కొత్త కోవిడ్ కేసులు బయటికి వచ్చాయి. ఒక్కరోజులో 166 కొత్త కేసులు నమోదు కావడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కొత్త కేసులు ఎక్కువగా కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఈ 166 కొత్త కేసులతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 895కి చేరుకుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు రోజువారీ సగటు కరోనా కేసుల సంఖ్య 100 కంటే తక్కువగా ఉండగా.. తాజాగా అది 166కు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

అయితే, దేశంలో శీతాకాలం కొనసాగుతున్నందున ఇన్‌ఫ్లుఎంజా వంటి వైరస్‌ల కారణంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని కేంద్రం చెబుతోంది. ఇటీవల, సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ఒక మహిళ కరోనా ఇన్‌ఫెక్షన్‌తో మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ ఏడాది జులైలో కరోనా తీవ్రత తగ్గిన తర్వాత దేశంలోనే అత్యల్పంగా కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. జూలై 24, 2023న దేశంలో కేవలం 24 కొత్త కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి.

రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండడంతో ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించింది. మన దేశంలో మొదటి కరోనా కేసు 2020 జనవరి 7న కేరళ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. కేరళలోని త్రిసూర్ జనరల్ ఆస్పత్రిలో 20 ఏళ్ల మహిళకు వైరస్ లక్షణాలు కనిపించడంతో, ఆమె రక్త నమూనాలను సేకరించి ల్యాబ్‌లో పరీక్షించారు. ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, కోవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి దేశంలో వెలుగులోకి వచ్చిన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.44 కోట్లకు చేరుకుంది. కరోనా మరణాల సంఖ్య 5 లక్షల 33 వేల 306కి పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు ఇవ్వబడ్డాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories